"చేసుకోను! నా జీవితంలో త్యాగంచేసే రోజులు గడిచిపోయాయనుకొంటాను!" మొండికెత్తినదానిలా అనేసి బాగ్ తీసుకొని బయటికి నడిచింది స్వప్న.
పళ్లు పటపట కొరుకుతున్న మాధవ్ నోటినుండి అసభ్యకరమైన ఏదో తిట్టు కూడా వచ్చింది!
లెక్కపెట్టకుండా వెళ్లిపోయింది స్వప్న.
* * * *
ఒళ్ళంతా బేండేజీకట్లతో స్పృహ లేకుండా పడి వున్నాడు స్వరూప్. అతడి చెల్లెలు అరుణ మాత్రం అతడి బెడ్ దగ్గర వుంది!
ప్రశ్నార్దకంగా చూస్తోన్న ఆమెకు తనను ఎలా పరిచయం చేసుకోవాలో తెలియలేదు స్వప్నకు. "ఎలా వుంది?" అస్పష్టంగా గొణిగినట్టుగా అడిగింది.
"ఉదయం వరకు ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు!"
కన్నీటితో తడిసిన కళ్లతో స్వరూప్ ని చూస్తున్న స్వప్నని ఆశ్చర్యంగా చూసింది అరుణ. "మీరు..... "
"నా పేరు స్వప్న."
"స్వప్న!?" గుర్తురావడానికి అరక్షణం పట్టింది. గుర్తు వస్తూనే కనుబొమలు ముడివేసింది. కళ్లలో తిరస్కారం చోటుచేసుకోగా "ఏక్సిడెంట్ సంగతి మీ కెలా తెలిసింది?'అని అడిగింది.
"మా వారు చెప్పారు... మీరు స్వరూప్ చెల్లెలా?"
తలూపింది అరుణ. "ఏక్సిడెంట్ అయిందని నాన్నకి ఆఫీసుకి టెలిగ్రామ్ వచ్చింది. అమ్మకి అంతకుముందే గుండెనొప్పి వచ్చి కాస్త తగ్గింది. ఏక్సిడెంట్ సంగతి ఆమెతో చెప్పకుండానే నన్ను బయల్దేరదీశారు నాన్న. అమ్మకి ఈ సంగతి తెలియదింకా."
స్వరూప్ సన్నగా మూల్గుతున్నాడు.
"ఎంత సేపు నిలబడతారు?" ఆ స్టూల్ మీద కూర్చోండి!" తను కూర్చున్న స్టూల్ ఇవ్వబోయింది.
"మీరు కూర్చోండి. నేనిక్కడ కూర్చుంటాను"స్వప్న స్వరూప్ బెడ్ మీదే కూర్చుంది. ఆ సమయంలో అతడు పరపురుషుడన్న ఆలోచన నశించింది. అతడి చెంపలు అప్యాయంగా అరచేత్తో రాయసాగింది. కళ్లనుండి ఆగని కన్నీరు బుగ్గలుమీద ప్రవాహమైంది.
స్వప్న ప్రవర్తనకి విబ్రాంతిగా చూడసాగింది నీరజ. అన్నయ్యకు ఇంతగా ప్రేమించే ఈ మనిషి అన్నయ్య జీవితం అగ్నిగుండంగా ఎందుకు మార్చింది? ప్రేమకంటే కుటుంబ గౌరవం ముఖ్యమనుకొనే ఈమె ఈరోజు అన్నయ్యపక్కన కూర్చొని అతడిని స్పృశిస్తూ కన్నీరు కార్చడమేమిటి? కుటుంబ గౌరవం ఇప్పుడెక్కడికి పోయింది?
"అమ్మా! అరుణా!" అరుణ తండ్రి వచ్చాడు. అక్కడ బెడ్ మీద అపరిచిత యువతిని ఆశ్చర్యంగా చూశాడు.
అరుణ "స్వప్న" అంది నెమ్మదిగా. సైగలతో మరికొంత వివరించింది.
స్వప్నని స్వరూప్ పక్కన ఇంకెవరైనా చూస్తే బాగుండదని, అరుణ స్వప్న భుజం తట్టింది.
పిచ్చిదానిలా చూసింది స్వప్న.
"రాత్రి అయింది. మీ కోసం వారు చూస్తుంటారేమో!"
స్వప్న కంగారుగా లేచింది. కొంగుతో కళ్లని గట్టిగా తుడుచుకొని , "వస్తాను. స్వరూప్ కి స్పృహవచ్చాక చెప్పండి, స్వప్న వచ్చి వెళ్లిందని!"అంది. బాగ్ తీసుకుని బయటికి వచ్చిన స్వప్నతోపాటు అరుణకూడా వచ్చింది.
"ఇంత ప్రేమించిన మీరు అన్నయ్య జీవితాన్ని నరకంగా ఎలా మార్చారు?"
"ఇప్పుడనుకొంటున్నాను చాలా పిచ్చజిపని చేశానని! అర్దంలేని త్యాగం చేశానని! అనుభవించేదానికి రెట్టింపు బాధను అనుభవిస్తున్నాను!"