Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 37


                                                                                24
    "నువ్వింత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు రవీ!"
    పినతల్లి ముఖంలో కనిపిస్తోన్న ఆనందవీచికల్ని గమనించి తృప్తిగా నిట్టూర్చాడు రవి.
    "ఇక నా బాధ్యత తీరినట్టే. నిన్నో యింటివాడినిచేసి, హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటాను."
    ఆ మాటలకి నవ్వేడు రవి.
    స్వతహాగా అతను మితభాషి! కవిత్వంలో ఔచిత్యం, పదాల పొదుపు దానికెంత శోభ తెస్తుందో నిత్యజీవితం లోనూ మితభాషిత్వం అంతే గౌరవాన్ని కలిగిస్తుందని అతని నమ్మకం.
    బ్యాంక్ ఆఫీసర్లు, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్లు ఎంతో తక్కువగా మాటాడతారని అందుకే వారంటే సమాజంలో గౌరవమనీ అనుకుంటాడు. అతని అభిప్రాయం పొరపాటే కావచ్చు. కానీ రాజకీయనాయకుల్లాగా, ఉపాధ్యాయవర్గం ఎక్కువ విస్తరించి మాటాడతారు కాబట్టే వాళ్ళకి సమాజంలో విలువ గుర్తింపు తక్కువ అని అతను అనుకుంటాడు.
    "అమ్మాయి ఒద్దికైంది. సంసారానికి యోగ్యురాలు. మొదట నువ్వూ, ఆ అమ్మాయీ ఏదో ఘర్షణపడుతూ, నువ్వు కాదని అంటే నేనెంత బాధపడిపోయాననీ, రవీ! మనుషుల జీవితాలు బుద్భుదాలు! నేనెన్నాళ్ళుంటాను? నా తర్వాత నీకు మంచి జోడు దొరికితే నీ జీవితం సుఖమయంగా వుంటుందని ఆశిస్తున్నాను బాబూ! రాజలక్ష్మి ఉత్తమురాలు!"
    తలూపేడు అతను.
    "ఆరోజెంత కోపం వచ్చిందని! ఎంత బాధేసిందని? డబ్బు తెచ్చే లాటరీ టికెట్టుపోయినప్పుడు కూడా అంత బాధ కలగలేదు. జాతిముత్తెం కదకా అమ్మాయ్!"
    "అవునమ్మా!"
    "మరెందుకబ్బాయ్ ఆరోజు అలా ప్రవర్తించేవు?"
    ఆమె అలా సూటిగా ప్రశ్నించేసరికి రవి కాస్త తబ్బిబ్బయ్యాడు. "అమ్మా! ప్రేమకి ఎన్నో ఉపాధులుంటాయి. అలాగే ఎన్నో కారణాలు వుంటాయి. నేను కవిననీ, రూపసిననీ ఆ అమ్మాయి ప్రేమిస్తోంది. అయితే పెళ్ళయ్యాక జీవితంలో కొంత చేదునిజాల్ని రుచిచూశాక ఈ ఆకర్షణ తగ్గిపోవచ్చు. అప్పుడు నా యీ పేదరికమే ఆమెకి గుర్తుంటుంది. కానీ నా యీ కవిత్వం గుర్తింపుకిరాదు. పైగా ఒక నిష్ప్రయోజకుడిగా కూడా అనుకోవచ్చు.
    అందుకే తొలుతనే ఆమె ప్రేమని అట్టిపెట్టాను.
    తర్వాత ఇదిగో-యీ లాటరీ టికెట్టు వ్యవహారం.
    ఇది నన్ను మరీ ఆలోచింపజేసినట్టుగా చేసింది. ఈ డబ్బు ఆ ఆకర్షణకి తోడయిందా అనిపించింది. దాంతో ఆమెని మరికాస్త దూరం వుంచాను.
    కానీ--- ఈరోజు క్షణాలపై వచ్చిన ఐశ్వర్యం దూరమైపోయినా యింకా వెనుకటి ఆకర్షణని, వెనుకటి ఆప్యాయతని గుర్తుంచుకుని మళ్ళీ వాళ్ళ తలిదండ్రుల్ని ఒప్పించి రాగలిగింది.
    దాంతో ఆమెలో ప్రేమే ముఖ్యమనిపించింది.
    దానికితోడు మీ ఒత్తిడి. సరిత బలవంతం!"
    "బావా!" ఇంతసేపూ శ్రోతలాగా వున్న సరిత పలుకరించింది. "నువ్వు స్త్రీ హృదయాన్ని చదవలేవు బావా?" అంది.
    "అదేం?" వింతగా అడిగాడు.
    "అదంతే బావా! స్త్రీ హృదయాన్ని ఏ మగాడూ చదవలేడు."
    ఈ స్టేట్ మెంట్ కి అదిరిపోయాడు రవి. "చిత్తం!" అన్నాడు.
    "అవును! అదంతే."
    "ఏమిటే ఆ మాటలు?"
    "అవును అత్తయ్యా! ఆడదాని మనస్సుకి ఎన్ని పొరలు వుంటయో, అందులో ఎన్ని ప్రేమ తెరలు, పొరలు వుంటాయో లెక్కించటం కష్టం అందుకే ప్రపంచంలో స్త్రీ అపార్ధం చేసుకోబడుతోంది."
    "సరితా! నీ స్టేట్ మెంట్స్ అర్ధం చేసుకోలేక చచ్చిపోతున్నాను."
    "బావా! స్త్రీ భర్తని ప్రేమిస్తుంది. అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్ళని, తండ్రిని, తల్లిని, పిల్లల్ని ప్రేమిస్తుంది. అవునా?"
    "అవును!"
    "వీళ్ళందరినీ ప్రేమించిన ఆడదే భర్తనీ ప్రేమిస్తుంది?"
    "ఏమిటీ గందరగోళం?"
    "స్త్రీ హృదయమే అంతంలేని అనంతం!"
    "ఒప్పుకున్నాం."
    "మరి యిన్ని ప్రేమలూ కాక ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఓ దివ్యపురుషుడు ఆ హృదయం పొరల్లో అట్టడుగు పొరకి చేరతాడు."
    "ఇది అన్యాయం-జనరలైజ్ చేయకు!"
    "నీకు తెలియదంతే జీవితంలో ప్రతి స్త్రీకి ఒక రహస్యం వుంటుంది. అది చచ్చినా చెప్పదు. ఆఖరికి ఆ రహస్య సంబంధం మనిషికి కూడా తెలియనివ్వరు. అంతే ఆరాధన"
    "ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది"
    "అక్కర్లేదు బావా! రాజ్యలక్ష్మి అట్టడుగు మనో మందిరంలో నిలుచున్న దివ్యసుందర విగ్రహం నీదే."
    "సరితా! ప్రతి స్త్రీ ప్రేమిస్తుందన్నావే! ఎలా కనుక్కోవటం?"
    "ఆ కళ్ళల్లో మెరుపే చెపుతుంది బావా!"
    "థాంక్యూ!"
    "సవితా! నాకు నిద్దరొస్తోంది!" అంది సుబ్బమ్మగారు.
    రవి లేచివెళ్ళాడు తన గదికి.
    "అత్తా! బావ హడలిపోయాడు.
    ఆ మాటకి బిత్తరపోయింది ఆమె. "ఏమిటీ?" అంది.
    "నీకు అర్ధం కాదులే! బావ అదో తరహా వ్యక్తి. మొదటినుంచీ సమాజానికి దూరంగా వెలివేయబడ్డ వ్యక్తిలాగా ఆర్ధికమైన చిక్కులతో పెరిగాడా! అంచేత ఎత్తునిచూస్తే భయం"

 Previous Page Next Page