"నీ ముఖం!"
"అత్తా!" ఆశ్చర్యంగా పిలిచింది సరిత.
"నువ్వేదో చదువుకున్నదానివి, లోకం తెలిసినదనివి అనుకున్నాను కానీ ఒట్టి బుద్ధిలేనిదానివి!"
సరిత ముఖం నల్లబడింది. బిక్కముఖం వేసింది.
"లేకపోతే ఏమిటి? ఆడదాని మనస్సులో పొరలుంటాయా? ప్రతి స్త్రీకి ఒక రహస్యం వుంటుందా? ఎవడో చేతకాని రచయిత రాసిన నవల చదివి వచ్చావా?"
"అత్తా! నీపైన డామేజ్ కి సూట్ వేస్తాను!"
"సూట్ కాకపోతే షూట్ వెయ్యి! దిగుల్లేదు. పిచ్చిదానా! ఒక్కమాట చెబుతావిను. ఆడదాని హృదయం అమృతభాండం! ఆ అనురాగామృతాన్ని ఎందరికి పంచిపెట్టినా అది తరగదు."
తల తిరిగిపోతోంది సరితకి. ఏమీ తెలియదు, చదువురాదు, సంస్కారంలేని సంసార పక్షం స్త్రీ అనుకునే అత్తయ్య నిర్వచనాలు చెబుతుందే అనుకుంది.
"బుద్ధిగా కళ్ళుమూసుకుని పడుకో! తల తిరిగిపోతుందా? ఇంకోమాట విను! స్త్రీ తనని తాను ప్రేమించుకున్నట్టు మరెవ్వరినీ ప్రేమించదు. ఊరికే అద్దంలా రిఫ్లెక్టు అవుతుంది.
ఇక వినలేక, విని ఆరగించుకోలేక ముసుగుతన్ని పడుకుంది సరిత. తనలో తను నవ్వుకుని పడుకుంది సుబ్బమ్మ గారు.
* * *
ఎంత ప్రొద్దుపోయి పడుకున్నా వేకువనే లేవటం సుబ్బమ్మగారికి అలవాటు? ఆ రోజు కూడా అలాగే లేచింది. ఒళ్ళెరగకుండా నిద్రపోతున్న సరితకి దుప్పటి సరిగ్గా కప్పి "ప్రొద్దున్నే దీని ముఖం చూశాను. ఏమి అదృష్టం పఠిస్తుందో!" అనుకుంది.
లేవబోతూ మరోసారి చూసి "పిచ్చిపిల్ల? దీని మనస్సులో రవి వున్నాడని నాకు చెప్పాలని ఎంత తహతహలాడింది" అనుకుంది.
లేచి బెడ్ లైట్ ఆర్పి, వెళ్ళబోతూ "సరితా! నువ్వు అభాగ్యురాలివే! అయినా ఒకరకంగా అదృష్టవంతురాలివే! నాచిట్టి తండ్రికి కూడా నువ్వంటే అభిమానమే! అదే ప్రేమ!" అనుకుంది.
ఆమె మామూలుగా పెరట్లోకి వెళ్ళబోతూ తలుపులు తీసి వుండటం చూసి ఆశ్చర్యపోయింది. మధ్య నిద్దర్లో ఎప్పుడో సరిత లేచి, తీసిన తలుపులు వేసి వుండదు అనుకుంది.
ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళబోతూ. అదీ తీసి వుండటం చూసి ఆశ్చర్యపోయింది. భయపడింది. ఆరోజు యిలాగే జరిగి టికెట్ పోయింది. మరి ఈరోజు ఏం జరిగిందిరా భగవంతుడా అనుకుంటూ లైట్ వెలిగించి, చప్పున దేవుడి ముఖం చూసింది ఇల్లంతా చూడకుండా!
మంచో,చెడో ముందు భగవంతుడిని చూడాలనుకుని అటు చూసిన ఆమెకి అక్కడ కనిపించింది చూసి తల తిరిగినట్లయింది.
కళ్ళు నులుముకిని చూసింది.
నమ్మకం కుదరలేదు.
కలా? భ్రమా? నిజమా? అనుకుంది.
దగ్గరగా వెళ్ళింది. కల అయితే అది మాయమవుతుంది. కళ్ళకి పొరలు కమ్మే మాయ అయితే తొలగిపోతుంది. నిజమే అయితే యదార్ధం తెలుస్తుంది అనుకుంది.
ఆమె కళ్ళు మరోమారు మిరుమిట్లుకొలిపాయి.
డబ్బు!
కుప్పగా శ్రీనివాసుడి శ్రీ చరణాల ముందు కుప్పగా వుంది.
"భగవంతుడా!" అనుకుంది.
మరికాస్త దగ్గరిగా వెళ్ళి చేతితో తాకి చూసింది.
నిజమే!
అది యదార్ధంగా డబ్బే!
"సరితా! రవీ!" అంటూ గట్టిగా పిలిచింది.
నిద్రపోతున్న రవీ, నిద్రకీ మెలుకువకీ మధ్య బార్తరులో వున్న సరితా ఉలిక్కిపడి లేచారు.
"రవీ--- సరితా--- యిలా రండి!" మరోమారు పిలిచింది.
క్షణంలో సగంలో అన్నట్టుగా వచ్చారిద్దరూ గాబరాగా. ఇద్దరికీ ఆమె పిలుపు ఆందోళననే కలిగించింది.
ఒకేసారి వంటింట్లోకి వచ్చారిద్దరూ "అమ్మా, అత్తయ్యా!" అంటూ.
"రండర్రా!" సంభ్రమంగా పిలిచిందామె.
ఆమెలోని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, సంభ్రమాన్ని గుర్తించారు. అటు చూసిన ఇద్దరూ దేవుడి పాదాలవద్ద కుప్పగా వున్న డబ్బుని చూసి ఆశ్చర్యపోయారు.
"రండర్రా! చూడండి చిత్రం!"
"అవునమ్మా! ఏమిటిది?"
"అత్తయ్యా! అది డబ్బే!"
"నేను వేకువనే లేచి వచ్చానా! పెరటి తలుపులు, వంటింటి తలుపులు తీసివుంటే చూసి భయపడ్డాను. మొన్న యిలాగే జరిగింది కదా! అంచేత యీరోజు ఏం పోయిందోనని గాబరాపడి వచ్చాను చూస్తే యింకేముంది డబ్బు - వెంటనే మిమ్మల్ని కేకేశాను."
రవి సమీపంగా వచ్చాడు.
"దేవుడు దయామయుడురా అబ్బాయీ--- మొన్న టికెట్ తీసుకున్నాడు. ఈరోజు ఏకంగా డబ్బేయిచ్చాడు."
"మీరు మార్చుకోలేరని తనే మార్చిపెట్టాడత్తయ్యా!"
"వేళాకోళంకాదే అమ్మడూ--- ఇది శ్రీనివాసుడి మాయ కాకపోతే యింకేమిటంటావ్?"
"ఇదేదో దొంగతంతు---" అన్నాడు రవి.
"అపచారం--- అపచారం--- లెంపలేసుకో"
"ఎంతుందో లెక్కపెట్టత్తయ్యా---"
ఆమె జాగ్రత్తగా డబ్బు తీసి లెక్కపెట్టింది లక్ష!
"సరిగా లక్ష!" అంది కోడలి ముఖం చూస్తూ.
"ఇంకేమత్తయ్యా... మీకు పన్ను రాయితీ కూడా యిచ్చేశాడ. మీరు దాన్ని బ్యాంకులో మార్చుకుని వుంటే దానకి టాక్సులు అవీ చాలా తీసేసుకునేవారు ఇప్పుడు ఆ బెడదులేదు."