అయినా నా ఊహ కరక్టయితే ఆయన దీన్ని ఒక లెక్కలోకి తీసుకుని వుండడు! చెప్పానుగా నేలకేసి కొడితే ఆకాశానికి ఎగిరే మనిషని-అంత ధైర్య సంపద, ఆత్మవిశ్వాసం వున్న మనిషిని నువ్వు సెలక్టు చేసుకోవటం నా అదృష్టం-
హాట్ టీ కంగ్రాట్స్--- ప్రొసీడ్" అన్నారు నవ్వుతూ వేడి వేడి టీ కప్పు ఆమె ముందుకి తోస్తూ.
టీ తాగేసి పరుగు పరుగున తల్లివద్దకి వెళ్ళింది. ఆ ఆనందోత్సాహ ఉద్రేకంలో తండ్రికి థాంక్స్ చెప్పనేలేదు.
భర్త చెప్పాడనగానే విజయలక్ష్మి మళ్ళీ బయలుదేరింది.
ఆ యింటిముందు కారు ఆగగానే ముందుగా ఆమె కదిలింది తర్వాత తల్లిని అనుసరించింది రాజలక్ష్మి.
వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే సరిత కోసం స్లోగన్స్ రాయటం ముగించిన రవి వాటిని సరితకి అందించటానికి లేవబోతున్నాడు.
కారు శబ్దం విని సరిత, సుబ్బమ్మగారు వంటింటినుంచి హాల్లోకి వచ్చారు.
"నమస్కారం" అన్నాడు రవి.
చాపమీదే కూర్చుండిపోయింది విజయలక్ష్మి.
"మీకు కూర్చోటానికి కూడా తగిన కుర్చీలు లేవే!" నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు.
"ఏదీ నువ్వు ఆ అవకాశం కలిగిస్తేనా? ఆయన ఇల్లు కట్టించి యిచ్చి, లక్షలు యిస్తానంటే ఊహూ అంటివాయె!" నవ్వుతూ అందామె.
"మా బావకి కొన్ని నియమాలున్నాయండి" అంది సరిత.
"ఏమిటమ్మా అవి."
"ఇతర్ల అకారణ సహాయం కోరడు."
"ఇంకా---"
"ఊరకే వచ్చే డబ్బుని ఆశించడు-"
"ఊరకే కాదుగా... పిల్లతోపాటే యిస్తాంకదా!" చమత్కారంగా అందామె.
"కట్నం అక్కర్లేదు---"
"అయ్యో రాత! మా అమ్మాయికి చీరలు నగలు యివ్వవద్దంటాడా ఏమిటి? తండ్రికి సంతానమంతా ఒకటే కదా! ఆస్తి పంచియివ్వాలి కదా కొడుక్కి. దానికి బదులుగా కానుకలు యిస్తే తప్పా!"
"అది రయిటే అనుకోండి---"
"మరింకేం అభ్యంతరం?" సూటిగా అడిగింది.
"అమ్మా!" కల్పించుకుంది సుబ్బమ్మగారు. "మేం ఎంతో బీదవాళ్ళం. మాకు పూటకే గడవటం కష్టం. లాటరీలో లక్ష వచ్చిందని మీరు యివ్వాలని వచ్చారు. కానీ యిప్పుడు అదీ పోయిందమ్మా తల్లీ - మళ్ళీ మేం మామూలు స్థితికి వచ్చాం!" బాధగా అందామె.
సాక్షాత్తూ ఐశ్వర్యరాయిని శ్రీ లలిత చిరునవ్వుల శ్రీదేవిలాగా నవ్వింది. కటాక్షించే దేవతలాగా నవ్వింది ఆమె ఆప్యాయంగా.
"వదినగారూ!" గొంతునిండా బంధు ప్రేమ, ఆప్యాయత నింపుకుని పిలిచింది ఆమె "మా అమ్మాయి రవిని ప్రేమించి కొన్ని సంవత్సరాలు అయింది. మీకు లాటరీ వచ్చింది వారం క్రితం. ఒకవేళ పోయిందనుకో--- మళ్ళీ రాదా అదృష్టం ఎప్పుడూ నడచే వస్తుందనుకోకండి. అది ఉరుకులు పరుగులమీద వస్తుంది - మా వారు అదే ధైర్యం చెప్పమన్నారు!"
ఆమె మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
రవి చిరునవ్వుతో వింటున్నాడు అన్నీ.
"అందుకనే మావారు ఈరోజు మళ్ళీ పంపించారమ్మా నన్ను."
సుబ్బమ్మగారు కొడుకువైపు చూసింది.
"బాబూ!" ఆప్యాయంగా పిలిచింది విజయలక్ష్మి.
"చెప్పండి!" అన్నట్టుగా చూశాడు రవి.
"మనిషి విలువ నిర్ణయించేది డబ్బుకాదు. ఆత్మవిశ్వాసం, ధైర్యం. లక్షరూపాయలు వచ్చిన రోజున నువ్వు పొంగిపోలేదు. ఆ లక్ష రూపాయలు పోయిన రోజున నువ్వు కృంగిపోలేదు. అదీ వ్యక్తిత్వం - దాన్నే ఆయన అభిమానిస్తారు!"
అతని ముఖం వికసించింది.
"మా అమ్మాయిని యివ్వాలని మీ యింటికి వచ్చాను. కాదనకు. కోరి కాళ్ళు కడగాలని వచ్చిన సంబంధం కాదనుకోకు!"
"పిన్నీ!" వరస కలిపింది సరిత.
"ఏమ్మా!"
"నా షరతులు అన్నీ అంగీకరిస్తే మా బావ తరుపున నేనే ఒకే చేస్తాను---"
"అలాగేనమ్మా. అతను మా అమ్మాయిని చేసుకోవటమే మాకు కావలసింది. అంతేనమ్మా!"
"అయితే మంచిరోజు చూసి యిక ముహూర్తాలు పెట్టించండి!" అంది బావగారి వైపు చూస్తూ. ఆ కళ్ళల్లో ఎన్నో భావాలు, అభ్యర్ధనలు. విజయలక్ష్మిగారు సుబ్బమ్మగారివైపు చూస్తే, సుబ్బమ్మగారు కొడుకువైపు చూశారు.
"మా అమ్మ యిష్టమండీ!" అన్నాడు రవి.
"హమ్మయ్య!" అంది సరిత.
రాజలక్ష్మి ముఖం విప్పారింది.
"మా చెల్లాయి ముఖంలో పెళ్ళికళ తాండవిస్తోంది!" నవ్వుతూ అంది సరిత.
"సరితా! నువ్వు గట్టిదానివే! నువ్వు యీ రోజు రాబట్టే - వాడు ఒప్పుకున్నాడు!" అంది ఆమె తృప్తిగా.
"మరేమనుకున్నావు అత్తా! నేను బావని లక్షాధికారిని చేశాను... ఇప్పుడు ఓ యింటివాడిని చేస్తాను. అది నాలోని గొప్పదనం!" అంది నవ్వుతూ.
"జరిగేవన్నా ఆచారప్రకారంగా, సాంప్రదాయకంగా జరుపుతాము వదినా!" అంటూ లేచింది విజయలక్ష్మి.
"అలాగేనమ్మా!" అంది సుబ్బమ్మగారు నవ్వుతో.
రాజలక్ష్మీ ముఖంలో వేయి శరత్తులు విరిశాయి. సూటిగా కళ్ళెత్తి అతన్ని చూళ్ళేకపోయింది