"అన్నయ్యకు ఏక్సిడెంట్ అయిందటమ్మా...." జేబులోంచి టెలిగ్రాం కాగితం తీసి ఇచ్చాడు.
చదువుకొని కెవ్వమనబోయింది అరుణ.
"అరవకు! మీ అమ్మకు ఈ సంగతి తెలియనీకు? ఆమె అసలే గుండెనొప్పి మనిషి! ఈ వార్త వింటే నిలువునా ప్రాణాలు వదిలేసినా వదిలేయగలదు."
"అమ్మకి తెలియకుండా ఎలా దాచగలం?"
"వాళ్లకు రావడానికి వీలు కాలేదని పెళ్లిచూపులకు నిన్నే అక్కికి తీసుకురమ్మన్నారని టెలిగ్రాం వచ్చిందని చెబుదాం. అయిదు నిమిషాల్లో ఛీప్ ఇంజనీరు కారు పంపిస్తానన్నారు. బట్టలవీ సర్దుకో, అమ్మా!"
14
స్వప్న జ్ఞాపకాలమీద ఒక మరుపు తెర వాలుతున్న సమయంలో స్వరూప్ కి ఏక్సిడెంట్ అయి చావుబ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ హాస్పిటల్ లో పడివున్న సంగతి తెలిసింది. మాధవ్ చూసివచ్చి చెప్పాడీ సంగతి!
మాధవ్ సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు. "సిగ్గులేకపోతే సరి!" అన్నాడు ఛీత్కారంగా.
"అంత సిగ్గు లెంచాల్సింది ఏం కనిపించింది మీ కిందులో?" దెబ్బతిన్నట్టుగా అడిగింది.
"లేకపోతే? అతడిని చూడడానికి హాస్పిటల్ కి వెడతావా?" ఎవరని?"
"ఎవరో మీకు బాగా తెలుసు"
"తెలుసు కాబట్టే, నాకు తెలిసింది ప్రపంచానికి కూడా తెలియడం ఇష్టంలేదు కాబట్టే నిన్ను వెళ్లవద్దంటున్నాను."
"ఒకసారి చూసివచ్చినంత మాత్రాన నా పాతివ్రత్యాని కేమీ భంగం రాదండీ!"
"నువ్వు నన్ను వెటకారం చెయ్యి. నిందించు, ఫర్వాలేదు. నువ్వు మాత్రం అక్కడికి వెళ్లడానికి వీల్లేదు" మాధవ్ స్వరం ఖచ్చితంగా వుంది.
దిగ్రభగా చూసింది. "శాసిస్తున్నారా?"
"భర్తగా నాకామాత్రం అధికారం లేదా?"
"ఈ స్వప్న అధికారానికి లొంగే మనిషి కాదండీ! గతంలో నా కెంతో ఆత్మీయుడు! అతడు చావుబ్రతుకుల మధ్య వుంటే చూసిరావాలనిపించదా? చూడకుండా వుండడం నావల్ల కాదు. చూసివచ్చినంతమాత్రాన నావల్ల జరిగే తప్పేమీలేదు!"
"వెళ్లు! కాని, మళ్లీ రానక్కరలేదు! వచ్చినా నీకిక్కడ చోటువుండదు"
"నాచోటు నాకెప్పటికీ వుంటుంది! నా కెవరూ దయదలచి ఇవ్వాల్సింది కాదిది!"
"ఛీ ఛీ! నీలాంటి ఆడదానితో సంబంధం పెట్టుకోవడం నా తప్పు! వెళ్లు! వాడితోనే వూరేగు!"
"అప్పుడు మీ పరువువుంటుందా?"
"నిన్ను కట్టుకొన్ననాడే నా పరువు గంగలో కలిసింది. మిగిలిందేమైనా వుందంటే నీ ప్రియుడిమీది మోహంతో దాన్ని తగిలేస్తున్నావ్!"
"మీరిన్నాళ్లు ఎన్ని మాటలన్నా కుటుంబగౌరవం కోసం ప్రాకులాడాను. ఆత్మ గౌరవం మంటకలిశాక కుటుంబగౌరవం లెక్కేమిటి? వెడతాను. అలాగే వెడతాను. మీరు నన్ను బెదిరించేది విడాకులిస్తాననే కదా? ఇవ్వండి. తప్పకుండా ఇవ్వండి. క్షణక్షణం ఆత్మగౌరవం చంపుకొంటూ మీతో కాపురం చేసేకంటే విడిపోవడమే నయం!"