Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 35


    అయినా ఆయన తీరని కసి ఆయనతో "ఆ యింట్లో ఏముందమ్మా పోవటానికి" అడిగాడు.
    ఇది మరో విషలిప్తబాణం.
    సూటిగా గుండెల్లోనే దూసుకుపోయింది.
    ఆయనకి కూతురంటే పంచప్రాణాలు. కూతురికోసం ఆయన ఏమయినా చేయగలడు దేన్నయినా వదిలేయగలడు. సిగ్గు, మానం, అభిమానం, దేశాభిమానం ఒకప్పుడుండేవి. పెళ్ళి చేసుకున్నాక, పిల్లలు కలిగాక, అందునా కూతురు పుట్టేక ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. డబ్బు గడించాడు కుడి ఎడమలు చూసుకోకుండా.
    అంత ప్రాణప్రదంగా చూసుకున్న కూతురు బాధ పడుతూవుంటే చూళ్లేకపోయారాయన.
    "లాటరీ టికెట్టు ఎత్తుకెళ్ళారటమ్మా!" అన్నాడు నవ్వుతూ.
    నవ్వుతూ చెబితే అది తీపివార్త అవుతుందా? అవతలి వాడికి మట్కాలో వెయ్యి రూపాయల బ్రాకెట్ తగిలిందని ఏడుస్తూ, మొత్తుకుంటూ, గుండెబాదుకుంటూ చెప్పినంత మాత్రాన అది దుర్వార్త అవుతుందా?
    ఆ మాటలు వినగానే రాజలక్ష్మి చప్పున లేచి నుంచుంది.
    "ఎక్కడికమ్మా! కూర్చో అక్కడికేనా? ప్రాణం పోయిందని తెలిశాక ఎప్పుడు వెళితేనేం తల్లీ. దహనం అయ్యేలోగా వెళితే చాలదూ. ఇదీ అంతే. పదినిమిషాలు ఆగి వెళుదువుగానీ-రెండు మాటలు చెబుతాను."
    బంధం వేసినట్టుగా ఆగిపోయింది ఆమె.
    "రాజూ!" నెమ్మదిగా పిలిచాడాయన. కూతురిపై ప్రేమ పొంగిపొరలితే అలాగే పిలుస్తాడు ఆయన. ఇంతక్రితం మాటలతో ఆమెని ఎంతగా గాయపరిచాడో, ఇప్పుడు అంత ఆత్మీయంగా మాట్లాడసాగాడు. "నువ్వు ఎవరివి లక్షాధికారి రాజేశ్వరరావు బిడ్డవి. బియ్యే చదివావు. నువ్వు కార్పెట్ మీద కాళ్ళు పెట్టావు. కార్లలో ప్రయాణం చేశావు. ఏ.సి. రూంలో పెరిగావు. డాబా గార్డెన్స్ లో తిరిగాడావు" ఆయన ఎఫెక్టుకోసం ఆగాడు.
    "ఇప్పుడవన్నీ ఎందుకు డాడీ?"
    "అవసరమమ్మా! ఆడపిల్లని కనగానే సరిపోతుందా? ఆమె అదృష్టాన్ని కనుగొనగలగాలి! నిన్ను కోటీశ్వరుడికి యిచ్చి చేద్దామనుకున్నాను. ఫ్లెయిట్ లో ఫారిన్ తిరిగే వాడికి యివ్వాలని ఆశపడ్డాను. ఏ మినిస్టరు సంబంధమో, ఏ ఐ.ఏ.యస్ అబ్బాయికో యివ్వాలనుకున్నాను"
    "డాడీ!" అడ్డొచ్చింది.
    "నా మాటలకి అడ్డురాకమ్మా-నన్ను నా బాధ చెప్పుకోనీ-నా ఆశలనీ, ఆశయాలనీ నీవు గుర్తించలేదు. అది నీ తప్పుకాదు. నీది తప్పు అనీ అనలేను. కానీ నా దృక్పధంలో అది తప్పే. అయినా ఎన్ని హోదాలు, ఎంత ఐశ్వర్యం వున్నా ఆడదానికి తను మనసిచ్చినవాడితో కళ్యాణం కావటం గొప్ప తల్లీ! నువ్వు ప్రేమించావు. అది నాతో నిర్భయంగా చెప్పగలిగావు. చెప్పకుండా నువ్వు మనసులో దాచుకుని, నా ఆజ్ఞకి లోబడి, నా అరుపులకి భయపడి, నేను చెప్పినవాటకి ఒడబడి ఎవడినో చేసుకుని వుంటే నువ్వు జీవితకాలమంతా నాకు పడి ఏడ్చేదానివి. అలా జరగలేదు. అందుకు భగవంతుడికి థాంక్స్!"
    ఆయన ఆగ్గానే చురుగ్గా చూసింది ఆమె.
    ఆయన నవ్వేడు, "నువ్వు అతడిపేరు చెప్పగానే నా ప్రాణం విలవిల్లాడింది, నా గౌరవం, నా హోదా, నా ఐశ్వర్యం, నా పలుకుబడి అంతా కట్టకట్టుకుని నాశనమై పోయినట్లుగా అనిపించింది---
    కానీ...
    ఆ అబ్బాయి యోగ్యుడు-మంచివాడు-క్రమశిక్షణ కలవాడు. ఏటికి ఎదురీదేవాడు. కాలాన్ని జయించగలిగిన వాడు. అన్నిటికి మించి పట్టుదల కలవాడు. ఇంకేం కావాలి. అలాటివాడు తలుచుకుంటే ఓడిపోయిన ఇందిర మళ్ళీ పునఃప్రతిష్టితమైనట్టు దేన్నయినా సాధించగలడు.
    అందుకే ఒప్పుకున్నాను."
    ఆయన మాటలకి అడ్డొస్తూ "మరోమారు థాంక్స్! డాడీ" అంది.
    కనుబొమలు ముడివేశారాయన. "నువ్వు వరించావు. నేను వాడి జీవితాన్ని సవరించాలనుకున్నాను. యింతలో అదృష్టదేవత వాడిని మనసారా వరించింది. నిజంగా లక్కీ ఫెలో అనుకున్నాను. మీ అమ్మ-విజయలక్ష్మి ఈ రాజలక్ష్మితో సహా వాడింటికి పంపేను-"
    మళ్ళీ ఆగాడు ఆయన.
    "సస్పెన్స్ థ్రిల్లర్" అనుకుంది రాజలక్ష్మి.
    ఆయన పెదాలు బిగించి "అప్పుడూ అతగాడు ఎగిరి సంబరపడలేదు" అన్నాడు.
    ఫోన్ మ్రోగితే ఎత్తి "కాస్త ఆగు!" అని చెప్పి, క్రెడిల్ చేసి మళ్ళీ అన్నాడు. "అదీ అతని గొప్పతనంగానే భావిస్తున్నాను ఇప్పుడు అతని ఐశ్వర్య కారణం కరిగిపోయింది. అతనిప్పుడు సస్మరంతిగాడు. కోన్ కిస్కాగాడు. బజారులో దమ్మిడీకి చెల్లికాడు. వాడి మంచితనం, వాడి డిగ్రీ, వాడి కవిత్వం అంతా అప్టరాల్!..."
    "డాడీ!---" కోపంగా పిలిచింది ఆమె.
    "ఆగమ్మా! కోపగించుకోకు-సినిమా అంతా చూస్తే కానీ ముగింపు తెలియనట్లు పజిల్ సాల్వ్ చేస్తేకానీ అన్ని క్లూలూ తెలియనట్లు, హారతి ఎత్తితేకానీ పూజ పూర్తికానట్టు-నా వాక్యాలు పూర్తిగా వినకుండానే కోపగించుకుంటే ఎల్లా? నీకతను ప్రేమికుడయితే-నాకు కాబోయే సన్-ఇన్-లా బాగా గమనించు" అన్నాడు.
    ఆ మాటతో ఆమె ముఖం విప్పారింది. "థాంక్స్" అన్నట్టుగా చూసింది, నోటితో అనలేదు.
    "సరస్వతి వున్నచోట లక్ష్మి నిలవదమ్మా! కానీ ఒక్కొక్కరి అదృష్టం.వాడిని-సారీ-అతన్ని ముందుగా నలువ చెలువ వరిస్తే- చూశావా నాకూ కవిత్వం వాసన పట్టేసింది-" అని నవ్వేశారు. మళ్ళీ పుంజుకుని "తర్వాత సాక్షాత్తు శ్రీదేవిని-ధిక్కృత తారా సౌందర్య మహాదేవిని- కరెక్టేనా- ఏమో ఎప్పుడు చదువుకున్న తెలుగు-అల్లుడిగారి పుణ్యమా అంటూ మళ్ళీ నాలుకచివర నృత్యం చేస్తోంది. లేకపోతే ఇంట్లో తప్ప- ఫోన్ లో అంతటా ఇంగ్లీషు మాటాడుతూ- తెలుగే మరిచిపోయిన నేను తెలుగు దంచేస్తున్నాను అతన్ని వరించావు నువ్వు---
    అదే అతని అదృష్టం...
    నువ్వు వరించి అతన్ని అదృష్టవంతుడిని చేస్తానంటే నేను అడ్డుపడగలనా? అతని రాతని మార్చగలనా? అది నా చేతుల్లో వుందా?
    అందుకే---
    ఇప్పటికీ మన ఆఫర్ అలాగే వుంచు---
    నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పు--- ఓదార్చు-లక్షకి రెండు లక్షలు కట్నం రేటు పెంచు-దిగాలు పడిపోయిన ఆ యింట చైతన్యాన్ని నీ సిరి సిరి మువ్వలతో వెలిగించు.

 Previous Page Next Page