"నేను ఎప్పటికప్పుడు మంచిగానే ఉండాలనుకొంటాను! కాని, మగజాతికి ఇదేం బుద్దిపెట్టాడో భగవంతుడు - నిన్ను చేరాలనుకొన్నప్పుడల్లా నువ్వు ఒంటరిగా కనిపించవు నాకు! నీతో స్వరూప్ గుర్తువస్తాడు! వాడి ఉనికితో ఈ శరీరంలో వేడంతా చల్లబడిపోతుంది! ఏం చేయను? దీనికి పరిష్కారం ఎప్పటికో నాకు తెలియడంలేదు!"
"నేను సుమిత్ర దగ్గరికి వెడుతున్నాను. తలుపు వేసుకో!" మాధవ్ బట్టలు వేసుకొని వెళ్లిపోయాడు.
సుమిత్ర!
ఈ సుమిత్ర ఎవరో కొద్దిరోజుల క్రితం మాధవ్ వల్లే తెలిసింది. సుమిత్ర మాధవ్ కి చదువుకొంటున్న రోజుల నుండీ పరిచయం. పెళ్లయింది. పిల్లలు కూడా. మగడి కంట్లో కారంకొట్టి ఇష్టమైన మగవాళ్లతో తిరుగుతూ వుంటుంది. తిరుగుతుంది. తిప్పుకుంటుంది. అలా తిరిగే మగాళ్లలో మాధవ్ కూడా ఒకడు!
అలా అడ్డమైన వాళ్లతో తిరిగే ఆడదానితో సంబంధం పెట్టుకోవడానికి లేని అభ్యంతరం , కేవలం మనసు పారేసుకొన్న భార్యతో పెట్టుకోలేడా?
ఏమిటి ఈ మగవాడు? ఏమిటి ఇతడి మనస్తత్వం?
మగవాడికి ఒక ధర్మసూత్రం, ఆడదానికి ఒక ధర్మసూత్రమూనా?
ఎవరు వ్రాశారు ఈ సూత్రాలు?
ఉదయం తిరిగివచ్చిన మాధవ్ -
"స్వప్నా! మనం ఈ ఊరినుండి ట్రాన్సఫర్ చేయించుకొని దూరంగా, ఈ జ్ఞాపకాలకు దూరంగా వెళ్లిపోదాం! కొత్త జీవితం ప్రారంభిద్దాం!" అన్నాడు.
"అలాగే. మీరెంతదూరం తీసికెళ్లినా వస్తాను. కాని, స్వరూప్ పేరెత్తారో మిమ్మల్ని చంపి నన్ను చంపుకుంటాను!"
"ఆడదంటే అదీ! ఆల్ రైట్!"
మళ్లీ సహృదయత తెచ్చిపెట్టుకోవడం మొదలైంది.
13
నీలాకాశంలో ఒంటరి తెలిమబ్బు నెమ్మదిగా కదిలిపోతూంది! డేగలు కొన్ని రెక్కలు విప్పుకొని గుండ్రంగా తిరుగుతున్నాయి ఆకాశపు కప్పుకింద!
రాత్రి, పగలు పెరట్లో నైట్ క్వీన్ చెట్టుపక్క ఈజీ చెయిర్ లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ గడపడం అలవాటైంది స్వరూప్ కు. సెలవుపెట్టి సాగర్ కి వచ్చిన ఈ రెణ్ణెల నుండి. స్నేహితులు లేరు, సరదాలు లేవు. ఇంట్లో మాట్లాడేది కూడా తక్కువే! స్వప్న తనది కాకపోయినా నాటి బాధకంటే, ఆమె కాపురం కలతలపాలు కావడం అతిగా బాధిస్తున్నదతడిని.
స్వరూప్ ముఖంలో గూడు కట్టిన విషాదానికి వెనుక కథతో పాటు, ఇప్పుడు అతడు ఎందుకు సెలవుపెట్టి వచ్చాడో కూడా తెలుసు ఇంట్లో అందరికీ. ఓదార్పులతో తొలగించే బాధ కాదు కాబట్టి, అతడిని కాలానికే వదిలిపెట్టి ఊరుకొన్నారు.
ఏ పరిస్థితితలోనూ స్వప్న ఉండగా సిటీకి వెళ్లకూడదనుకొన్న స్వరూప్ కు సిటీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. సటీ కాపురస్తులు, చెల్లెలు అరుణను చూసుకోవడానికి వస్తున్నారు. జీపు తీసుకెళ్లి వాళ్లను తీసుకురావడం మర్యాదగా వుంటుందని తండ్రి పురమాయించాడు.
మరునాడు.
పెళ్లివాళ్లకోసం ఫలహారాలు వగైరా సిద్దంచేసి ఎదురుచూస్తున్న సమయంలో ఆఫీసునుండి ఆదరా బాదరాగా వచ్చాడు స్వరూప్ తండ్రి సూర్యనారాయణ.
"అమ్మా, అరుణా! ఇలారా!" ఆయన గొంతు వణుకుతోంది.