రిసెప్షనిస్ట్ నన్ను గుర్తుపట్టినట్లు నవ్వి, "లోపలికెళ్ళండి! ఎం.డి. గారు ఖాళీగానే వున్నారు" అంది. అంతమందిని బయట కూర్చోపెట్టి నన్ను లోపలికి పంపించడం గర్వంగా అనిపించింది. అయినా గుండె దడగానే వుంది. నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాను. పరిమళంతో కూడిన చల్లని గాలి ఒక్కసారిగా చుట్టుముట్టింది. భయంవల్లో, చలివల్లో తెలియదుకానీ, శరీరం సన్నగా వణికింది. ఎదురుగా పెద్ద టేబుల్, దాని వెనుక ప్రశాంత్ పరేఖ్.
నన్ను చూడగానే ఎదురు కుర్చీవైపు చేయిచూపిస్తూ కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. నిశ్శబ్దంగా కూర్చున్నాను.
"సో... నీ పేరు అచ్చమ్మ!"
"అవును, సార్!"
"బి.కాం. సెకండ్ ఇయర్ చదువుతున్నావు నైట్ కాలేజీలో!"
"అవును, సార్!"
అతడో క్షణం మౌనంగా ఊరుకుని, "మేనేజర్ గా నిన్ను ప్రమోట్ చేస్తే బ్రాంచ్ పనులన్నీ నిర్వహించగలవా?" అనడిగాడు. ఒక్కక్షణం నేను వింటున్నది కలో, నిజమో అర్థంకాలేదు. "సర్...?" అన్నాను అర్థంకానట్టు మొహంపెట్టి.
నా పరిస్థితి అర్థం చేసుకున్నట్టు అయన నవ్వి, "నేను సూటిగానే అడిగాను కదా!" అన్నాడు ఇంగ్లీషులో.
నేను తబ్బిబ్బయ్యాను. అయనా నోరు పెగల్చి, "చేయగలను" అని చెప్పలేకపోయాను. నా పరిస్థితి అంత అయోమయంగా వుంది. గాలిలో తేలిపోతున్న భావన.
ఆయన పేపర్స్ సర్దుకుంటూ అన్నాడు- "ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ మేనేజ్ మెంట్ స్థాయిలో వెనుకబడిన వర్గాలవారిని కనీసం పదిశాతం నింపాలని అనధికారిక సలహా ఇచ్చింది. బయటివాళ్ళని కాకుండా సంస్థలో వాళ్ళనే పైకి తీసుకురావడం మా పాలసీ! ఆ లిస్ట్ లో నువ్వు కూడా వున్నావు".
ఒక్కసారిగా గాలి తీసేసిన బుడగలా అయిపోయింది నా పరిస్థితి. అప్పటి వరకూ వున్న సంతోషమంతా ఎవరో ఉఫ్ న ఊదేసినట్టు ఆరిపోయింది.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
అలా మాట్లాడటం వల్ల నేనొక గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నాననీ, నా యాజమాన్యం నా పట్ల అపార్థాన్ని కలిగించుకునే వీలు కల్పిస్తున్నాననీ నాకు తెలుసు. అయినా కూడా నేనలా అనకుండా వుండలేకపోయాను.
"సారీ సార్! ఇప్పుడు మీరు నాకిస్తున్న ప్రమోషన్ కేవలం నా కులం వల్ల అయితే నా కవసరం లేదు. ఒక చిన్న రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న నన్ను అంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి కేవలం ఒకే ఒక అర్హతగా నా కులాన్ని అడ్డుపెట్టుకోలేను!" అన్నాను.
ఆయన మొహంలో ఓడిపోయిన భావంగానీ, దెబ్బతిన్న ఫీలింగ్ కానీ కనపడలేదు. చిన్న పిల్లాడు మారాం చేస్తుంటే నవ్వుకునే పెద్దరికం కనబడింది. అడాలిసెంట్ యువకుడు అంతా తనకే తెలుసనుకుని మూర్ఖంగా వాదిస్తుంటే- 'సరే, నువ్వు చెప్పదల్చుకున్నదేదో చెప్పు!' అనే అడల్ట్ స్థితప్రజ్ఞత కనబడింది.
కుర్చీ వెనక్కి వాలి నా వైపు చూసి సన్నగా నవ్వి, "మీది గుంటూరా?" అనడిగాడు.
నేను తెల్లబోయి, "కాదు సార్! ఎందుకలా అడిగారు?" అనడిగాను.
"సాధారణంగా గుంటూరు వాళ్ళే అంత ఆవేశంగా మాట్లాడతారు. అదే రాయలసీమ వాళ్లైతే కుర్చీ తన్నేసి లేచి వెళ్ళిపోతారు. తెలంగాణా వాళ్లైతే మీరు చేస్తున్న సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడంలేదు అంటారు. కోస్తా వాళ్ళయితే 'గొప్పతనం ఎక్కడుందో గుర్తించే కళ మీకుంది, సార్!' అని లౌక్యంగా అంటారు".
నేనూ నవ్వేశాను.
ఎక్కడో రాజస్థాన్ లో పుట్టి ఆంధ్ర ప్రజల మనస్తత్వాన్ని ఇంత చక్కగా అంచనావేయగలిగాడు కాబట్టే ఈయనింత గొప్పవాడయ్యాడనుకున్నాను.
"ప్రస్తుతం మీ బ్రాంచ్ మేనేజర్ నా దగ్గరి బంధువే. నీకు తెలుసుగా!"
తెలుసన్నట్టు తలూపాను. మా సంస్థల్లో పనిచేసేవాళ్ళు చాలా మంది ఏదో రూపేణా ఈయన బంధువర్గంలోని వాళ్ళే. పెద్ద పెద్ద సంస్థల్లో సాధారణంగా ఇలాగే వుంటుంది.
"అతను నీ గురించి చెప్పాడు. అచ్చమ్మ అనే పేరు నీకు బాగాలేదనీ, మార్చుకొమ్మనీ ఏదో ఉచిత సలహా పారేశాట్టగా! అప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడినట్టే 'నా పెద్దలు పెట్టిన పేరు పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. దాన్ని మార్చుకొమ్మనే హక్కు మీకు లేదు' అని నిర్మొహమాటంగా చెప్పావట కదా! ఆ విషయం నాకు తెలిసింది. ఎంక్వైరీ చేస్తే మరో గమ్మత్తైన విషయం కూడా తెలిసింది. గత పద్దెనిమిది నెలల్లోను నువ్వొక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. అంతేకాదు, ఒక్కరోజు కూడా నువ్వు ఆఫీసుకి ఒక్క నిముషం కూడా ఆలస్యంగా రాలేదు. అలాంటి టైమ్ సెన్స్ చాలా తక్కువమందికి వుంటుంది".
నేను విస్తుపోయి చూస్తున్నాను.
"నీ సర్టిఫికెట్లు తెప్పించి చూశాను. చాలా మంచి మార్కులు వచ్చాయి. దాదాపు ఫస్ట్ రాంకర్ వి. ఏదో ఒక మిషమీద నిన్ను డిపార్ట్ మెంట్ లో ప్రవేశపెట్టి పరీక్షించమన్నాను. అక్కౌంట్స్ అసిస్టెంట్ సెలవు పెట్టినప్పుడు నిన్నక్కడ వేశారు. ఆరు నెలలనుంచి అడ్జస్ట్ అవని ట్రైల్ బాలెన్స్ పదిరోజుల్లో సరిచేశావు".
నేనింకా విస్మయం నుంచి తేరుకోలేదు.
ఆయన నవ్వాడు- "ఇప్పుడర్థమైండా?. నేను నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశానో?"
అప్రయత్నంగా నా కళ్ళు సజలమయ్యాయి. గద్గద స్వరంతో "థాంక్యూ! థాంక్యూ సార్!" అన్నాను.
ఆయన ఫోన్ చేసి ఎవరినో రమ్మని పిలుస్తున్నాడు.
నేను లేచి, "వస్తాను సార్! థాంక్యూ" అన్నాను. ఆయన కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఈలోగా ఒక యువకుడు లోపలికి వచ్చాడు. ఫుల్ సూట్ లో వున్నాడు. స్ఫురద్రూపి.
"ఈమే నేను చెప్పిన అమ్మాయి!" అని, నా వైపు తిరిగి, "ఇతనిక్కడ హెచ్.ఆర్.డి. ఎగ్జిక్యూటివ్. మూడు నెలలపాటు ఆ డిపార్ట్ మెంట్ లో ట్రైనింగ్ అయ్యాక స్వంతంగా బాధ్యతలు టేకప్ చేద్దువుగాని!" అన్నాడు.
నాకు గంతులెయ్యాలనిపిస్తోంది. పన్నెండో అంతస్థులో నుంచి అలాగే గాలిలో ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఆ మైకంలో ఆయన మాటలు కూడా వినబడటంలేదు. "మిస్టర్ సురేష్! రేపటి నుంచి ఈ అమ్మాయికి మీ డిపార్ట్ మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వాలి".


