"ఏమిటి ఈ బూజుపట్టిన భావాలు - కాలం మారింది. మనుషులు మారుతున్నారు. విలువలు మారుతున్నాయి--- ఎందుకింకా ఈ వెర్రి! ఈ రోజుల్లో విధవా వివాహాలు సర్వ సామాన్యం!"
"బావా! ఆడపిల్లకి ఒకసారి పెళ్ళి కావటమే అందం. మల్లెతీగ పందిరికి ఒకసారి ప్రాకిస్తేనే అందం."
"పందిరి విరిగిపోతే---"
"అది మల్లె భవిష్యత్తు అంతే! దానికి తిరుగులేదు."
"అది తప్పు సరితా! దేవుడుకూడా ఒక్కోసారి పొరపాటు చేసి తప్పులు దిద్దుకుంటాడు. లేకపోతే నన్ను నిన్ను ప్రేమించేట్టు చేసేవాడే కాదు. నీకు తెలియదా నేను నిన్నెలా ప్రేమిస్తున్నానో. నా గుండెల్లో దివ్యంగా వెలుగుతున్న జ్యోతివి నువ్వు. అది నా జీవితాన్ని నడపాలి."
"ఆ జ్యోతి ఆరిపోయింది బావా"
"ఎంతమాట అంటున్నావు సరితా! కరడుకట్టిన ఆ జ్యోతిని తిరిగి మెదిపి వెలిగిస్తాను. నా మనస్సు ఎటు తిరిగీ నీవేపే ప్రసరిస్తోంది. ఏం చెయ్యను?!"
"దాన్ని మళ్ళించు బావా!"
"ప్రవాహాన్ని మళ్ళించాలంటేనే ఇంజనీర్లకి చచ్చిన చావు అవుతుంది. ఇక మనస్సుని మళ్ళించటం సాధ్యమా?"
"నువ్వు పిచ్చివాడివి బావా"
"ఆహాఁ ప్రేమ పిచ్చివాడిని."
"బావా! ఓమాట చెప్పనా! మగాడెప్పుడూ ప్రేమించకూడదు. తనని ప్రేమించేట్టు చూసుకోవాలి. అప్పుడే జీవితం- బ్రతుకు పండుతుంది."
"నవ్వు నన్ను ప్రేమించటం లేదా?"
అది నా తరమా అనుకున్న సరిత సమాధానం యివ్వకుండా లేచి వెళ్ళింది. నిట్టూర్చాడు రవి.
ఇప్పుడు మళ్ళీ అదంతా ఆమెకి గుర్తుకి వచ్చింది.
"రాజ్యలక్ష్మి అయితే మంచి సంబంధం. ఈడూ జోడూ బావుంటుంది"
"ఎవరికి? మనకా? వీడికి నచ్చొద్దూ... లాటరీ విషయంలో అలాచేశాడు. పెళ్ళి విషయంలో ఇలా చేశాడు--- ఆ అమ్మాయి లక్ష్మీదేవిలా ఇంటికి నడిచివస్తే ఊహూ అన్నాడు ఆ రాత్రే దొంగతనం-ఎందుకవాలి! ఎన్నిటెన్నిటికో ఎక్కడెక్కడికో సంబంధం వుంటుంది."
రవి నవ్వటంతప్ప ఏమీ అనటం లేదు.
"పోనీలే అత్తా! ఇంకో టికెట్టు యిస్తాను. ఇది బంపర్ ప్రయిజ్. లక్షల్లో వస్తుంది. అదీ యిదీ అంతా కలిపి వచ్చినట్టే..."
నిరాశగా నవ్వింది ఆమె.
"బావా! మరికొన్ని స్లోగన్స్ రాసిపెట్టు--- ఇదిగో టికెట్టు."
"సరితా! దీనికి ప్రయిజ్ వస్తుందా?"
"ష్యూర్!"
"మళ్ళీ చెబుతున్నా-అంతగట్టి నమ్మకంవుంటే నువ్వే వుంచేసుకో-ఎండనక వాననక తిరగటం తప్పుతుంది. సుఖంగా జీవితం వెళ్ళబుచ్చవచ్చు."
"చెప్పానుగా బావా! అదృష్టం అందరినీ వరించదు. టికెట్లు అమ్మే మేం అన్నీ అదృష్టపు టికెట్లే అంటాం. అనుకుంటాం. అదంతే!"
"బిజినెస్ అన్నమాట."
"ఊహూఁ ఉన్నమాట." అంది నవ్వుతూ.
"అన్నమాటో, తమ్ముడిమాటో! నాకెందుకు గానీ, ఆ బంపర్ ప్రయిజ్ వచ్చేట్టుగా యిచ్చిపోమ్మా" అంది సుబ్బమ్మగారు నవ్వుతూ.
"అనే కదత్తా యిస్తున్నది."
రవి మాటాడకుండా పెన్, పేపరు తీసుకున్నాడు.
"ఇదిగో అత్తయ్యా! ఈ టికెట్ దేవుడివద్దే వుంచు! బావ రాతలో మునిగిపోయాడు. మనం డిస్టర్బ్ చేస్తే వ్యవహారం చెడుతుంది. నమ్మకం అమ్మకానికి మూలం అని రాయటానికి, అమ్మకాలకి మూలం వమ్ముకావటం అని రాసేస్తాడు" అని నవ్వుతూ వంటింటివేపు కదిలింది.
23
కొన్ని కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతవి.
అవి అలా ఎందుకు జరుగుతవో ఎవరికీ తెలియదు. ఆ పరాత్పరుడికి తప్ప! ఒక్కోసారి ఆ పరాత్పరుడికే తెలయదేమో!
రవి వాళ్ళింట్లో దొంగలుపడి గమ్మత్తుగా లాటరీ టికెట్టు మాత్రం దోచుకపోయిన మరురోజు రాజేశ్వరరావు గారు కూతుర్ని తన గదిలోకి పిలిపించుకున్నారు.
"గుడ్ మార్నింగ్ డాడీ."
రాజలక్ష్మి లోపలికి వస్తూనే తండ్రికి నమస్కారం చేసింది.
"గుడ్ మార్నింగ్" అంటూ చూస్తున్న ఎక్స్ ప్రెస్ ని పక్కకి పెట్టాడు. "కూర్చోమ్మా" అని కూతుర్ని మర్యాద చేశాడు అదీ ఆయనలోని గొప్పదనం. కట్టుకున్న భార్యకానీ, కన్నకూతురు, కొడికికానీ వాళ్ళని గౌరవించాలనేది ఆయన సిద్ధాంతం. కుర్చీలో కూర్చోబెట్టి తర్వాత తిట్టిపోసినా అది వేరేసంగతి-ముందు మర్యాద యివ్వటం మాత్రం ఆయన మరియాద.
"థాంక్యూ డాడీ!" అంటూ కూర్చుంది ఆమె ప్రతి పనికీ. ప్రతిఫలం పొందినపుడు థాంక్స్ చెప్పాలనేది ఆయన నేర్పిందే.
"మీ రవి ఇంట్లో దొంగలుపడ్డారటమ్మా!" మెల్లిగా అన్నారాయన. అయినా బాంబు పేలినంత సవ్వడి అయింది.
"వ్వాట్! ఏమంటున్నారు డాడీ. రవి యింట్లో దొంగలా? మీకెలా తెలిసింది. పేపరులో వేశారా?" ఆదుర్దాగా, ఆత్రంగా అడిగింది.
"వెర్రికుట్టీ! వాళ్ళింట్లో దొంగతనం విషయం పేపరులో రావటానికి అతనేం మల్టిమిలీయనీరా? రాజకీయ నాయకుడా? పోలీసాఫీసరా? నాకు యితర్లవల్ల తెలిసింది అంతే!"
అదీ ఆయన తత్త్వం - మనిషి గుండెలోతుల్లోకి చూసి బల్లెం విసుర్తాడు అదంతే.
విలవిల్లాడిపోయింది ఆమె.
అయినా ఏమీ అనకుండా, సంబాళించుకుని "ఏం పోయిందట డాడీ!" అడిగింది మామూలు గొంతుకతో.
పకపక నవ్వేరాయన.
అదే చాలు, అదే సమాధానం.