Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 34

   
    మాధవ్ ఆలోచనలో పడ్డాడు. నిజంగా తను స్వప్న గురించి అలా వాగాడా?

    స్వప్నని దబాయించబోయి ఇప్పుడు స్వప్న దబాయింపుకు లొంగాల్సి వచ్చింది మాధవ్. కాని, రాత్రి స్వరూప్ యింటికి వచ్చి వెళ్లాడంటే మనసులో ముల్లు సెలవేసినట్టుగా వుంది. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ నడిచి వుంటుంది? వేడి వేడి నిట్టూర్పులు ఎన్ని వదులుకున్నారో?

     ఈ సంఘటన తరువాత మాధవ్ కి బయటి వాతావరణం కొంచెం సంకటప్రాయంగా తయారైంది.  రాంప్రసాద్ ఏం చెప్పాడో ఆఫీసులో కొలీగ్స్ గుసగుసలు  పోతున్నారు. పరిహాసపు మాటలు విసురుతున్నారు. మొత్తానికి తనుచాలా చులకనైపోయినట్టు ఫీల్ కాసాగాడు మాధవ్.

    దీనికంతా కారణం ఆ రాత్రి తను తాగి వాగడమే కదా? తానై తాను బయటపెట్టుకొన్నాడు. పెళ్ళికి ముందు తన భార్య నడిపిన ప్రేమాయణం! పరిహాసపాత్రమైపోయాడు ఈ ప్రంపంచం దృష్టిలో!

    స్వరూప్ చెప్పినట్లు తను కొంచెం సహృదయత చూపగలగితే స్వప్న తన గతాన్ని
మరిచిపోగలుగుతుందేమో? అందరు భార్యాభర్తల్లా కలిసి జీవించవచ్చునేమో! అవును. తను కాస్త సహనం చూపాలి! తను కాస్త సహనం చూపగలిగితే స్వప్న తన కనుకూలమైన భార్య కాగలదన్ననమ్మకం తనకుంది. స్వప్నని కాదని మరొక తెనుపెళ్లాడినా అది మాత్రం పతివ్రత  అని గ్యారంటీ ఏమిటి? స్వప్న ఒకనాడు అన్నట్టు  ఏదో ఒక క్షణంలో మనసు చలించని ఆడదీ, మనసు పారేసుకోని మగాడూ వుంటాడా? వయసు సహజమైన ఆకర్షణనుండి తప్పుకోవడానికి తను నేర్చుకున్న విజ్ఞానం చదువుకొన్న చదువూ ఎందుకూ పనికిరావప్పుడు! ఆ ఆకర్షణ సుడిగుండంలో పడ్డామంటే గిరగిరా తిరగాల్సిందే!స్వప్నదేం తప్పు?

    కాని, ఎంత సహృదయత కొనితెచ్చుకున్నా ఆమె తొలివలపు తనదికాదన్న సత్యం అతడిని తక్కువ బాధించడంలేదు.

    అయినా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోడానికి సాధ్యమైనంత గా ప్రయత్నించసాగాడు మాధవ్. ఆమెను గాయపరిచే, రెచ్చగొట్టే మాటలేవీ అనడంలేదు.

    కలిసి షాపింగ్ కు వెడుతున్నారు. కలిసి సినిమాలకు వెడుతున్నారు. తమ మధ్య ఒక స్నేహబంధాన్ని ప్రతిష్టించుకొనే ప్రయత్నంలో  ఇద్దరూ వున్నారు.

    ఆ రాత్రి పిక్చరు చూసి వచ్చి భోజనం చేశారు.

    స్వప్న తన గదిలోకి వెళ్ళబోతుంటే మాధవ్ ఆమె రెక్కపట్టుకొని ఆపాడు. "ఈ రాత్రినుండి నీపక్క అవతలి గదిలో కాదు."

    తలదించుకొన్న స్వప్న నుండి ఎలాంటి ప్రతిఘటనా వ్యక్తం కాలేదు. మాధవ్ ని తన గుప్పిటలో పెట్టుకోడానికి అతడి నోరు మూతపడడానికి తన శరీరాన్నిఎరవేయడానికి సంసిద్దంగానే వుందామె.

    స్వప్నని నెమ్మదిగా మంచం దగ్గిరికి నిపించుకుపోయాడు. ఆమెని తన బాహుబంధంలో చుట్టి ఆమె పెదవులకు తన పెదవులు చేర్చుతూ, "స్వప్నా! నీకిది మొదటి అనుభవమేనా?" అని అడిగాడు.  మాధవ్ కి ఎప్పటికప్పుడు చెప్పుకొనే బుద్ది అంతా ఎక్కడికి పోయిందో?

    "అంటే?" దెబ్బతిన్నట్టుగా  అడిగింది స్వప్న.

    "ఏకాంతంలో స్వరూప్ నిన్ను చూపులతోనే వదిలిపెట్టాడా?"

    ఒక్క విదిలింపుతో అతని కౌగిటినుండి విడివడింది.

    "కోప్పడకు! మనసైన పిల్ల ఏకాంతంలో దొరికితే ఏ మగాడు ఊరుకుంటాడు! ఊరుకున్నాడే అనుకో! అతడిని పరీక్షకోసం డాక్టరు దగ్గరికి పంపాలి!"

    ఆ క్షణంలో అతడిమీద తనకి కలిగిన అసహ్యమంతా కళ్ళలో గుమ్మరించింది స్వప్న. "నీచపు బుద్దికి అంత నీచంగానే కనిపిస్తుంది!" ఛీత్కారం చేసింది."

 Previous Page Next Page