Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 33


    ఆ ఊపిరితోటే ఆమె ఇన్నాళ్ళూ జీవితాన్ని నెట్టుకొస్తోంది.
    సరిత రాగానే సుబ్బమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
    "ఏమయిందత్తయ్యా?" అంది కంగారుగా.
    సుబ్బమ్మగారు మేరువులాటి మనిషి. ఎన్నడూ దేనికీ కంగారుపడి కన్నీళ్ళు పెట్టుకుని ఎరగదు. అలాటి మనిషి, తన కంటే చిన్నది అయిన సరితని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటే సరిత గాబరా పడదూ?
    "చూశావా సరితా!"
    "ఏంటత్తయ్యా?"
    "మనవాడి నంబరుకు ప్రయిజొచ్చిన విషయం నీకూ తెలుసుగా!"
    "ఆఁ"
    "పాపిష్టిదాన్ని! వాడిని వెంటనే బ్యాంక్ లో వేసెయ్యమని తొందరపెట్టలేక పోయాను. దేవుడిచ్చాడు కదా. భద్రంగా వుంటుంది కదా అని భక్తితో స్వామివారి పాదాలవద్ద పెడితే టికెట్టుపోయింది. దేవుడివద్ద పెడితేనే భద్రం లేకుండాపోయింది. అందుకే దేశంలో సుఖం, శాంతి సంతోషం లేవు. ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు...!"
    నిట్టూర్చింది సరిత. ఆ అమ్మాయికి లాటరీ టికెట్టు పోయిందంటే గుండెల్లో దేవినట్టయింది. ఏం కాలంరా దేవుడా? అనుకుంది. కానీ బయటపడకుండా నవ్వేసింది. "అత్తా? నువ్వేం దిగులుపడకు, అదృష్టం అనేది నువ్విచ్చే కాఫీ లాటిది. నువ్వు కాఫీ యిచ్చావు-అది నేలపాలయింది. ప్రాప్తంలేదు అనుకుంటాం అంతే! గుండె పగిలి పోతామా! మళ్ళీ కప్పు కలిపి యిస్తావు. ఇదీ అంతే! నువ్వు నీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తావో, భగవంతుడు కూడా మనుషుల్ని అలాగే చూస్తాడు. ఒక టికెట్టు పోతే మరో టికెట్టు వస్తుంది. అంతే!" అంది ప్రోత్సాహకరంగా.
    సుబ్బమ్మగారి ముఖం ఆశతో వెలిగింది.
    "సరితా! నిజంగా మళ్ళీ లాటరీ వస్తుందంటావా?"
    "తప్పకుండా అత్తా! మనం ఓ బస్సు మిస్సయ్యమనుకో. ఇంకో బస్సు రాదా! ఇదీ అంతే!"
    "ఏమోనే! నాకు నమ్మకం కల్గటంలేదు---"
    "అలా దిగులుపడకూడదత్తయ్యా! ఆశే మనిషికి ఆలంబనం--- ఆశతోనే మనిషి బ్రతుకుతాడు. ఆశే మనిషికి ఊపిరి! ఆశే మనిషికి జీవం! అది లేనినాడు మనిషి మనుగడే గల్లంతవుతుంది!"
    "ఏమోనమ్మా! అంతా ఆ భగవంతుడి దయ!"
    "అత్తా! ఒకమాట చెప్పనా?"
    "చెప్పమ్మా చెప్పు! చిన్నదానినైనా నిన్నటి నుంచి నాలో నాటుకుపోయిన దిగులుని పోగొడుతున్నావు. నిన్నటి నుంచి ఎంగిలి పడాలనిపించటం లేదనుకో - ఏం చేస్తాం ప్రాప్తం!"
    "అత్తయ్యా! టెంకాయలోనికి నీళ్ళెలా వస్తాయ్? ఇదీ అంతే! బావ లక్షాధికారి కావాలని రాసిపెట్టి వుంటే అయి తీరతాడు."
    "భగవంతుడు అలా రాశాడంటావా? ఏమో?"
    "నమ్మత్తా! భగవంతుడు అలా రాసిపెట్టి వుండకపోతే అసలు లాటరీ టికెట్టుకి ప్రయిజ్ వచ్చేదే కాదు."
    "ఏం లాభమమ్మా? కలలో కనిపించిన ఐశ్వర్యంలాగా కరిగిపోయింది కదా! నాకు ఎంత ఆశ వుండిందని-" అంటుండగానే రవి వచ్చాడు.
    "ఎప్పుడొచ్చావు సరితా?" అంటూ నవ్వుతూ పలకరించాడు. అతనిలో ఏ మార్పులేదు. దిగులులేదు. వచ్చిందన్నప్పుడు ఎలా వున్నాడు. పోయిందన్నపుడూ అలాగే వున్నాడు.
    "ఇప్పుడే బావా! అవును టికెట్ దొంగతనం అయిందట కదా!"
    "అవును---"
    "మరి పోలీస్ కంప్లయింటే యివ్వరాదూ?"
    "ఏమని యివ్వాలి?"
    "ఫలానా సీరియస్ లో ఫలానా నంబరు లాటరీ టికెట్టు గల్లంతైంది. అది నేను ఫలానా ఏజంటు వద్ద కొన్నాను - అది నాది - బ్యాంక్స్ లో క్లెయిమ్ కి వస్తే రిపోర్టు యివ్వండి అంటూ కంప్లయింటే యిచ్చి వుండవలసింది---"
    "నిజమే!"
    "అలా చేస్తే దొంగ దొరుకుతాడంటావా?" ఆశగా అడిగింది ఆమె.
    "దొరక్క ఎక్కడికి పోతాడత్తా! పోలీసులు చొక్కా దొరకపుచ్చుకుని లాక్కొస్తారు - అంతే! మన డబ్బు మనకి వస్తుంది?"
    "ఏమోనబ్బా! అంతా పరీక్షయి పంచుకుంటే---"
    "ఛ! ఛ? మిగతా రాష్ట్రాల మాటేమిటో కానీ మన రాష్ట్రంలో పోలీసులు న్యాయంగానే వున్నారు---"
    "సరితా! రవికి పిల్లనిస్తామని వచ్చారు. లక్ష లాటరీలో వచ్చిందనగానే లక్షకట్నం, లక్ష లాంఛనాలు యిస్తామన్నారు. ఆ యిల్లు బాగా కట్టించి యిస్తామన్నారు. గంగాభవాని పూరి గుడిసె ముందు ప్రవహించినట్టుగా అయిందని ఆశపడ్డాను ఏం చెయ్యను. బుద్ధులు భూమిలేలితే అదృష్టం గాడిదలు కాస్తానందిట! వీడు ఊహూఁ అన్నాడు. అంతలో యిది జరిగింది---"
    ఫక్కున నవ్వేశాడు రవి.
    "నవ్వుతావే బావా?"
    "సరితా! అమ్మకి ఓ విషయం తెలియదు. ఓ పెద్ద ధనవంతుడు నన్ను రెండురోజుల క్రిందట ఆ టికెట్ యిస్తే ఎగ్ స్ట్రాగా రెండు లక్షలు యిస్తానన్నాడు! ఇప్పుడు చూడు ఎంత నష్టపోయామో!"
    "ఎట్లెట్లా?" నోరు వెళ్ళబెట్టిందామె.
    "నిజమా?" అడిగింది సరిత.
    "నే నెప్పుడైనా తమాషాకయినా అబద్ధాలు చెప్పానా?" నవ్వుతూనే అన్నాడు రవి.
    "ఎంతపని చేశావురా బాబూ!"
    విలవిల్లాడుతున్న ఆమెని చూసి జాలిపడ్డాడు రవి.
    "అత్తా! ఆ అమ్మాయి ఎవరు?"
    "నువ్వూ చూసే వుంటావు! రాజ్యలక్ష్మి - వీడి క్లాస్ మేటే!"
    రవి వైపు చూసింది సరిత.
    అతను ముఖం తిప్పుకున్నాడు.
    ఆమె మనస్సులో ఒకానొక రోజు తమ యిద్దరి మధ్యా జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.
    "సరితా! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను!" అన్నాడు రవి.
    "ఏమిటి ఈ హఠాత్ దయ?"
    "దయ కాదు ప్రేమ!"
    "ప్రేమ కాదు వెర్రి! వెర్రి బావా! ఏం చెప్పాను నేను. నా మనస్సు ఎప్పుడో ఒకరికి అంకితమైపోయింది."
    "అది విఫలమయిందిగా!"
    "అది విధి నిర్ణయం!"
    "మనం దాన్ని మారుద్దాం!"
    "మన తరం కాదు!"

 Previous Page Next Page