"ఇంటిమీద, ఇల్లాలిమీద నీకెంత ప్రేమో నాకు బాగా తెలుసుగాని పద!" రెక్కపట్టుకు లాక్కుపోయి స్కూటర్ మీద కూలేశాడు.
నేరుగా హోటల్ కి తీసికెళ్లి మాధవ్ ని కూర్చోబెట్టాడు. స్వరూప్ టిఫిన్ కి ఆర్డరివ్వబోతే వారించాడు. మాధవ్. "ఏమీ వద్దు ఇప్పుడు! ఏం మాట్లాడతావో మాట్లాడు."
ఈసారి టీకి మాత్రమే ఆర్డరిచ్చి తెప్పించాడు స్వరూప్. "రాత్రి ఏం జరిగిందో నీకు ఉదయం తెలిసిందనుకుంటాను!" అంటూ మొదలుపెట్టాడు.
"నువ్వేదో ఆడదానివల్ల మోసపోయినవాడిలా నిన్ను నీవే దీనావస్థకు దిగజార్చుకొని బారుల్లో దూరి త్రాగుబోతుగా ఎందుకు మారాలనుకొంటున్నావు? తప్ప తాగి రోడ్డుమీదపడితే నీ బాధ తీరిపోతుందనుకున్నావా?"
"జీవితంలో నేను మోసపోలేదా?" ఉక్రోషంగా అడిగాడు.
"సహృదయతకి చోటివ్వగలిగితే అది మోసమనుకోవు. చెదిరిన ఒక జీవితాన్ని సరిదిద్దినవాడివవుతావు! సానుభూతికి బదులు ప్రతీకారానికి పునాదే. ఇది నన్నెంత బాధపెడుతున్నదో తెలుసా!"
"నేనున్నచోట నువ్వుంటే నా బాధేమిటో నీకు తెలిసేది!"
"నీ చోట నేను లేకున్నా ఊహించలేనా? నీలాంటి బాధ కాకపోయినా దాన్నిమించిన బాధనే అనుభవించానురా నేను! స్వప్న నాది కాదనుకొన్నరోజు ఆత్మహత్య చేసుకు చచ్చిపోవాలనిపించింది. కాని, చచ్చిపోవాలనిపించినంత మాత్రాన చచ్చిపోలేం. అంతర్లీనంగా వున్న జీవితేచ్చ మనని అడ్డగిస్తుంది! సరే. ఆ బాధ మరిచిపోదామని నేనూ నీలాగా బార్ వరకూ వెళ్లినవాడినే. కాని, అది పాతాళబిరంలోకి అడుగువేయడమని నాకు తెలుసు! త్రాగకుండా వెనక్కి వచ్చేశాను!"
"అందరికీ నీకున్న ఆత్మస్థయిర్యం, సంస్కారం వుండవు!" ఎత్తిపొడుపుగా అన్నాడు.
"అవి ఎవరికీ వుండవు. మనల్ని మనం పరీక్షకు పెట్టుకోవడంవల్ల ఏర్పడతాయివి! జీవితాన్ని పాఠశాలను చేసుకోగలిగితే మనం నేర్చుకొనే అధ్బుతమైన పాఠాలెన్నో నీ బాధకి కారణం నేను ఒకనాడు చెప్పిన కథే కారణమైతే, ఆ ప్రేమకి స్వప్న గుండెలమీద మాంగల్యాలు కనిపించిన రోజే చితిపేర్చడం జరిగింది. ఇక స్వప్న సంగతి కూడా నేను చెప్పగలను. అగ్నిసాక్షిగా ఒకరికి ఇల్లాలై మరొకరిని ఆరాధిస్తూ కూర్చొనే అజ్ఞాని కాదామె. అందుకే నేను చెబుతున్నాను. స్వప్ననీ నన్నూ కలిపి ఆలోచించడం మానెయ్యి! అనవసరమైన అనుమానాలతో నీజీవితం నరకం చేసుకోవద్దు! స్వప్నని నిండు మనసుతో స్వీకరించు. ప్రేమించు!"
"హితబోధ అయిందనుకొంటాను!" మాధవ్ విసుగ్గా లేచాడు.
తన మాటలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిందని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు స్వరూప్ కి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు.
* * * * *
ఇంటికి వెడుతూనే స్వప్నతో గొడవ పెట్టుకున్నాడు మాధవ్. "రాత్రి వచ్చింది ఎవరు?"
"స్వరూప్."
"నీ స్నేహితుడని ఎందుకు చెప్పావ్?"
"ఇప్పుడు చెబుతున్నాను కదా? స్వరూపే వచ్చాడు. ఏమిటంటారు?" సహనం చచ్చినట్టు అడిగింది స్వప్న.
"ఏం మాట్లాడాడు!"
"మీరు తప్పతాగి ఒళ్లు తెలియకుండా మీ భార్య ప్రేమగాథ డప్పువాయించిన సంగతి మీ కొలీగ్ చెప్పాడట. ఆ సంగతే చెప్పాడు. మీ భార్య పెళ్ళికి ముందే ప్రేమాయణం నడిపిందని అందరికీ చెప్పుకోవాలనే వుంటే దానికోసం బార్ కి వెళ్లి తప్పతాగనే అవసరం లేదండీ! "నా భార్య పెళ్ళికి ముందే ఒకణ్ణి ప్రేమించింది" అని బోర్డు వ్రాయించి ముఖానికో, వీపుకో కట్టుకొంటే చాలు సమాజం ముండి మీకు బోలెడంత సానుభూతీ, సన్మానం లభిస్తాయి!" తీక్షణంగా అంది స్వప్న.