Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 32


    వేకువనే లేచి మామూలుగా పెరటివైపు వెళ్ళిన సుబ్బమ్మగారికి గడియవేయని తలుపులుచూసి అనుమానం వచ్చింది. కొంపదీసి రాత్రి తలుపులు వేయకుండా పడుకున్నానా ఏమిటి అనుకుంది. బాత్ రూం లోకి వెళ్ళివచ్చి ముఖం తుడుచుకుంటూ వంటింటివైపు నడిచింది. అక్కడా అంతే! తలుపులు గడియపెట్టి లేవు కనుబొమలు ముడిపడ్డాయి. ఏదో అనుమానం వచ్చింది.
    కానీ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళేక ఎక్కడి సామాను అక్కడే వుండటం చూసి 'మరీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది' అనుకుంది త్వరత్వరగా వంటిల్లు శుభ్రం చేసింది. స్నానంచేసి మడినీళ్ళు తెచ్చుకొని, కుంపటి రాజేసి కాఫీకి నీళ్ళు పడేసింది. ఎందుకో ఈరోజు ఆమె మనస్సు కాఫీవేపు వెళ్ళింది. పక్కింటికి వెళ్ళి పాలుతీసుకుని వచ్చింది.
    కాఫీ కాచి పాలు కలపబోతూ రవిని కేకేసింది.
    "వచ్చె!" అంటూ వెళ్ళాడు రవి.
    ఇద్దరూ కాపీ తాగేశారు.
    "త్వరగా వంట చేస్తాను. భోంచేసివెళ్ళి బ్యాంక్ లో వేసిరా! ఓ గంటలో వంటవుతుంది. వెళ్ళి స్నానం చేసిరా!"
    "ఈ వేళకి బ్యాంక్స్ తెరవరమ్మా!"
    "తెరవకపోయనా ఫరవాలేదు మళ్ళీ వర్జ్యం అన్నారు సావిత్రమ్మగారు. తొమ్మిదింటికంతా నువ్వు బేంక్ కి వెళ్ళిపో. మేనేజరు ఆ వేళకే వచ్చి వుంటాడుగా. లక్షరూపాయల టికెట్టు ప్రజంట్ చేసే వ్యక్తి అంటే సామాన్యమా! నీకు ముందే స్వాగతం చెబుతాడు. ఎక్కువ వడ్డీ వచ్చే ఎకవుంట్లో వెయ్యి..."
    "ఆ డబ్బు నీ పేర పెడతానమ్మా!"
    "ఏం సంబరం రా బాబూ! నాకెందుకు డబ్బు? నేనేం చేసుకుంటాన వద్దు-మగవాడివి నీ పేరనే వుండనీ---"
    "అమ్మా! నీకు తెలియదు..."
    "ఎందుకు తెలియదురా బాబూ! రేపు కోడలు వస్తే నా పేర డబ్బు వుంటే నన్ను బాగా చూసుకుంటుందని కదూ నీ ఆలోచన? పిచ్చివాడా! రాజ్యలక్ష్మి అలాంటి అమ్మాయి కాదు..."
    ఇంకేం అనకుండా స్నానానికి వెళ్ళాడు రవి.
    అతను వచ్చేసరికి ఆమె వంట పూర్తిచేసింది. తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆ డబ్బు ఎప్పటికీ వాడుకో కూడదనుకుంటూ భోజనం ముగించారు.
    మళ్ళీ వంటిల్లు శుభ్రం చేసింది ఆమె.
    రవి శుభ్రంగా తయారై వచ్చాడు.
    దేవుడి వద్దకు వెళ్ళి నమస్కరించి, ఆయన పాదాలవద్ద వుంచిన టికెట్ కోసం చూశాడు. అది కనిపించలేదు.
    "పిన్నికి ఎంత జాగ్రత్త! చప్పున కనిపించేటట్టు పెడితే ఎక్కడికయినా పోతుందేమోనని భయం" అనుకున్నాడు. "అమ్మా! టికెట్టు యిద్దువుగానీ రా!" అని పిలిచాడు.
    "అక్కడే వుండాలి చూడు!"
    "కనిపించలేదు---"
    "బాగా చూడరాబాబూ! శ్రీనివాసుడి పాదాలవద్దే పెట్టాను రాత్రికూడా వుంది!" అన్నది ఆమె.
    "ఏదీ కనిపించందే!"
    "ఎందుకు కనిపించదూ?" అంటూ ఆమె ఆ సమీపానికి వచ్చింది. శ్రీనివాసుడి పాదాలవద్ద చోటు ఖాళీగా వుంది. ఇంకా భక్తులు సమర్పించే కానుకలకోసం--- అది చూసి ఆమె తెల్లబోయింది.
    గబగబా మందసం అంతా వెదికింది.
    టికెట్ ఎక్కడా లేదు.
    ఆమెలో గాబరా ఎక్కువైంది. "ఏదిరా?" అంటూ ప్రశ్నించింది.
    రవి ముఖంలో కూడా ఆశ్చర్యం తొణికిసలాడింది. టిక్కెట్టు ఎక్కడపోయిందో అతనికి అర్ధంకాలేదు.
    సుబ్బమ్మగారి ఆందోళన వర్ణనాతీతం!
    "పోన్లేమ్మా! ఎలా వచ్చిందో అలా వెళ్ళింది!" అన్నాడు రవి.
    ఆమె అనుమానంగా చూసింది అతనివైపు.
    "అమ్మా! కష్టపడకుండా వచ్చే డబ్బులో సుఖంలేదమ్మా! అది మనకి వద్దు. ఇది ప్రాతిపదికగా చేసుకుని ఏదయినా సంపాదించుకుంటే అదే నాది. అప్పుడు దీన్ని ఏ ట్రస్టుకయినా యిచ్చేద్దాం!" అన్న అతని మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ అతనివైపు చూసింది.
    "నాకు తెలియదమ్మా! నేను తీసి దాచలేదు. ఎక్కడో గాలికి కొట్టుకపోయి వుంటుంది. ఎవరికి దొరుకుతుందో! అనుమానించి చూస్తే దాన్ని అతను మార్చుకోగలడు. ఎవరో పారవేశారని అనుకుంటే మాత్రం అది దండుగే! దండుగలేమిటిలే! ప్రభుత్వానికి మిగిలిపోతుంది!"
    సుబ్బమ్మగారు విలవిల్లాడిపోయారు. "అయ్యో... అయ్యో... ఎంత అన్యాయం జరిగింది. రాత్రి ఎవరో దొంగలు పడ్డర్రా బాబూ! మన పెరటి తలుపులు తెరిచారు. వంటిల్లు తీశారు, నాకు అనుమానం వచ్చింది. అయినా ఏం పోలేదని తృప్తిపడ్డానే కానీ అమూల్యమైన నిధి పోయినట్టు కనుక్కోలేకపోయాను---"
    "నువ్వు బాధపడకమ్మా! సిరిదా వచ్చిన వచ్చును అన్నాడు. అలాగే సిరితాపోయిన పోవును అన్నాడు. అంటే ఏమిటి? మనం దేనికీ బాధ్యులం కాదు. అయినా అది ఎలా వచ్చిందో అలాగే పోయింది. అందుకు దిగులేమిటి? అది నిజంగా మన సొమ్మే అయితే మళ్ళీ వస్తుంది. లేదూ - ఇన్నాళ్ళూ ఆశ కలిగించి పోయిందనుకుందాం! అంతే!" అన్నాడు అతను బయటికి వెళ్ళడానికి సన్నద్ధుడవుతూ.
    కానీ ఆమె మనస్సుని అంత త్వరగా సర్దుబాటు చేసుకో లేకపోయింది. దిగులుగా కూర్చుండిపోయింది.
    ఎన్నడూలేనిది ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "పాపిష్టిదాన్ని! అబ్బాయిని భద్రం చేసుకోమని చెప్పక దేవుడి దగ్గర పెట్టాను! అయినా న వెర్రికానీ దేవుడికంటే భద్రత ఎక్కడుంది, దొంగతనానికి వచ్చినవారు ఎక్కడున్న వెదికి తీసుకొనేవారు" అనుకుంది.
    అలాగే ఆలోచనా శూన్యమైన మనస్సుతో కూర్చుండిపోయిందామె.
                                                                                   22
    ఎక్కడ లైఫ్ బాయ్ వుంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది - అన్నట్టుగా ఎక్కడ సరిత వుంటుందో అక్కడ ఆనందం, ఉత్సాహం కదనుతొక్కుతాయి ఆ అమ్మాయి జీవితాన్ని సవాలుగా స్వీకరించి బ్రతుకుతోంది. బ్రతుకు ఎందుకో కాదు. బ్రతుకు బ్రతుకుకోసమే అన్నది ఆమె నినాదం.
    ఈ జీవితం ఒక వరం. ఇందులో ఎగుడు దిగుళ్ళు వచ్చాయే అనుకో అంత మాత్రాన దిగులుపడిపోవాలా? ప్చ్! లాభంలేదు - అనేది ఆమె ఊపిరి.

 Previous Page Next Page