Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు  పేజి 32

           
                                                                                12

    ఉదయం ఎనిమిది గంటలకు మెలుకువ వచ్చింది మాధవ్ కు. తల వేయి సుత్తెలతో బాదుతున్నంత  నొప్పిగా వుంది! శరీరం రౌడీల చేతుల్లో చావుదెబ్బలు తిన్నట్టుగా వుంది!  బెడ్ మీదినుండి లేవాలనిపించలేదు. అలా పడుకునే నిన్నటి సంఘటనలు కలను గుర్తుచేసుకొన్నట్టుగా గుర్తు చేసుకోసాగాడు.  తను స్వప్నని  కొట్టాడు. చదువు, సంస్కారం వున్నతను భార్యను కొట్టాడు.  పెళ్లికి ముందు ఆమె ఒకడిని  ప్రేమించిందని, ఇంకా  అతడిని మరిచిపోలేక విరహవ్యధ పడుతున్నదని ఈర్ష్యలో రగిలిపోతూ కొట్టాడు! తను బ్రహ్మచారి కాదని తనే చెప్పుకొన్నాడామెతో. కాని, ఆవిషయమే ఆమె తనని మళ్లీ ప్రశ్నించలేదు. ఆమెకు లేని ఈర్ష్య తననొక్కడినే ఎందుకు బాధిస్తున్నట్టు?

    మాధవ్ తర్కించుకొంటూ వేళ్లతో నుదురురాచుకోసాగాడు.

    స్వప్నని కొట్టి తను ఆ కోపంతో, తాపంతో బార్ కి వెళ్లాడు. ఎంత సిగ్గు మాలినవాడైపోయాడు! సీసాలు ఖాళీ అవుతుంటే తనలోని బాధను ఎవరోతుడిచి వేసినట్టుగా అయింది. గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. పిచ్చి హుషారు వచ్చేసింది. తరువాత కూనిరాగాలు తీసినట్టు గుర్తు. తరువాత ఇంకేమీ గుర్తురాలేదు. తను ఇంటికి ఎలావచ్చాడు? ఎప్పుడు వచ్చాడు?

    స్వప్నని అడగాలంటే సిగ్గేసింది. అసలు ఆమె ముఖమెదుట పడాలంటేనే అతడిని ముఖం చెల్లడం లేదు.

    కాని, స్వప్నే వచ్చింది అతడిని లేపడానికి.

    "ఆఫీసుకు టైం అవుతూంది. లేవండి!"

    మాధవ్ ఆమె ముఖంకేసి చూశాడు. కందిన బుగ్గ తను పశుత్వాన్ని ఎత్తిచూపినట్లుగా అయింది.

    అభిమానాన్ని చంపుకొని అన్నాడు: "నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు స్వప్నా!"

    బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది.

    మాధవ్ ముఖం కడుక్కువచ్చాడు.

    స్వప్న టీ ఇచ్చింది.

    ఒక్కొ గుక్క తాగుతూ రాత్రి తను ఇంటికి ఎలా వచ్చాడో గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాడు. కాని, గుర్తు రావడంలేదు.

    చివరికి స్వప్నని అడిగాడు.

    "మీ స్నేహితుడు టాక్సీలో తీసుకు వచ్చాడు మీకు ఒంటిమీద స్పృహలేదు."

    రాంప్రసాద్ గుర్తు వచ్చాడు మాధవ్ కు. బార్ లో ఇద్దరూ కలిసే తాగారు! వాడేతీసుకువచ్చి దిగవిడిచాడేమో నని ఇంకేం ప్రశ్నించలేదు మాధవ్. త్వరత్వరగా తయారై ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఆఫీసులో రాంప్రసాద్ వల్ల అసలు సంగతి తెలిసి స్వప్న మీద ఉదయం కలిగిన కరుణ భావం తుడిచి పెట్టుకుపోగా ఉగ్రుడైపోయాడు. రాత్రి ఇంటికి స్వరూప్ వస్తే "నీ స్నేహితుడు" అని ఎందుకు చెప్పింది స్వప్న? స్వరూప్ వచ్చాడని ఎందుకు చెప్పలేదు? ఈదాపరికం ఎందుకొచ్చింది? ఇంటికి అర్దరాత్రి వచ్చినవాడు ఊరికే వెళ్లి వుంటాడా? స్వప్నతో ఏం మాట్లాడకుండానే వెళ్లి వుంటాడా?.... అనుమానంతో కూడిన ఆలోచనలు అల్లిబిల్లి గా పారాడసాగాయి మనసులో.

    సాయంత్రం పని అయిపోయాక ఆఫీసు బయటికి వచ్చాడు మాధవ్.

    స్కూటర్ ఆపుకొని అతడికోసమే వేచి వున్నాడు స్వరూప్.

    స్వరూప్ ని చూస్తూనే యథాప్రకారం చిటపట లాడింది మాధవ్ ముఖం.

    అతడి ముఖంలో అతడి మనోభావాలు చదవగలిగిన స్వరూప్ ముఖం పాలిపోయింది. "నీకు కష్టమైనా ఈ ఒక్క రోజుకు నన్ను భరించాలి. నా మాటలు వినాలి!  ఎక్కు!"

    "ఉహుఁ. ఇంటికి వెళ్లాలి!"

 Previous Page Next Page