Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 31


    "ఎద్దేవా చేస్తున్నావా?"
    "ఎంతమాట? నాకంత శక్తి వుందా? ఇంటికి వచ్చి అవమానించడం, యింటికి వస్తే అవమానించడం మీకే చేతనవుతుంది!" బాధగా అంది.
    "రాజలక్ష్మీ! మొదటినుంచీ నువ్వే నన్ను అపార్ధం చేసుకుంటున్నావు."
    "ఏ విషయంలో?" తీవ్రంగా అడిగింది.
    అతను సమాధానం యివ్వలేదు.
    "రవీ... ఒక్కమాట చెప్పండి! నువు పెళ్ళిచేసుకోవా!"
    "హుఁ యిప్పుడది ఒక్కటే తక్కువ--- నాకేం వుంది? ఆస్తి లేదు. ఉద్యోగం లేదు---"
    "కానీ సాధించటానికి యత్నిస్తే పెట్టుబడికి లక్ష రూపాయలుంది. అది చాలు! నన్ను పెళ్ళి చేసుకుంటే మరో రెండు లక్షలు వస్తాయి. అన్నిటికి మించి నీకు ఆత్మస్థయిర్యం వస్తుంది---"
    "మళ్ళీ మొదటికి వచ్చావు---"
    "కాక - నువ్వు ఎక్కడియినా పెళ్ళిచూపులకి వెళితే ఆ క్షణంలో అమ్మాయిని ఎంతవరకు స్టడీ చేయగలవ? అంత మాత్రం నన్ను అర్ధం చేసుకోలేవా?"
    "అసలు పెళ్ళే---"
    "వద్దంటావా? పోనీ ఎప్పుడు చేసుకున్నా నన్ను చేసుకుంటావా? నన్నే చేసుకుంటావా?"
    ఆ అభ్యర్ధనకు అతను ఆశ్చర్యపోయాడు. విభ్రాంతుడయ్యాడు.
    "ఒకటి గుర్తుంచుకో - మనస్సు ఎవరికయినా ఒక్కసారే అర్పించుకుంటాం మేం. మీ మగాళ్ళకి లాగా మాది ఎయిర్ బస్ కాదు---" అని చివాలున వెనుదిరిగింది.
    ఈలోగా అక్కడ విజయలక్ష్మిగారికి మాట యిచ్చేసింది సుబ్బమ్మగారు.
    బయటికి రాగానే ముఖాన్ని ప్రసన్నంగా మార్చుకుంది రాజలక్ష్మి -  కాబోయే అత్తగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
    విజయలక్ష్మి గారి మనస్సు కుదుటపడింది.
    ఇటు రవి, అటు రాజలక్ష్మీ మాత్రం మనస్సులో మధనపడుతున్నారు.
                                                                                    21
    వాళ్ళటు వెళ్ళిపోయిన అరగంట దాకా బయటికి కాలేదు రవి. తర్వాత సుబ్బమ్మాగారు వంట పనిలో మునిగిపోయాక, మెల్లిగా ఆమెకి ముఖం చూపకుండా బయటికి వెళ్ళిపోయాడు రవి. తన మామూలు చెట్టుక్రింద కూర్చుని బాగా చీకటి పడ్డాక యింటికి వచ్చాడు.
    "ఎక్కడికి వెళ్ళావు రవీ! నీ కోసం ఎవరో వచ్చి వెళ్లారు. అయిదారు రోజుల్లో పెళ్ళిట! ఇదిగో పత్రిక యిచ్చి వెళ్ళారు. పద్యాలు కావాలిట!" అంది పత్రిక అందిస్తూ.
    నిర్వికారంగా పెళ్ళి పత్రిక అందుకున్నాడు. అమ్మాయి సామ్యవేదం-అబ్బాయి కృష్ణమూర్తి అమ్మాయి తండ్రి ఎవరో ప్రసిద్ధ రాజకీయవేత్త! మాజీ ఎం.ఎల్.ఏ. సామ్యవాదంలో నమ్మకం వుండి కూతురి పేరు సామ్యవాదం అని పెట్టుకున్నట్టున్నాడు. "సరస సౌభాగ్య గుణ రమ్య సామ్యవాద" పత్రిక అందుకోగానే పద్యాలు దొర్లుకొస్తున్నాయి అనుకున్నాడు.
    "రేపు ఉదయం వస్తాడట! పంచరత్నాలు కానీ నవరత్నాలు కానీ---"
    ఆమె మాటలు వింటూ వుంటే నవ్వొచ్చిందతనికి. నవరత్నాలు, పంచరత్నాలు ఎంత చవుకయిపోయాయి అనుకున్నాడు. పద్యరచన ఎంత తేలికయిపోయింది. అమృత వాక్కు వంటి కవివాక్కు ఎంత చౌక అయిపోయింది అనుకున్నాడు.
    "భోజనం చేస్తావా?"
    "వడ్డించమ్మా!" అన్నాడు.
    భోజనాలు ముగిశాయి. పడుకోబోతూ వుంటే "రవీ పిలిచి పిల్లనిస్తామంటేనే వద్దనకూడదన్నారు. అలాటిది యింటికొచ్చి యిస్తామంటే తల అడ్డంగా వూపటం మరీ ధర్మం కాదు" అంది.
    "అమ్మా!" ఆర్తిగా పిలిచాడు రవి. "నాకూ నిన్ను ఇంటి బాధ్యతలనుంచి తప్పించాలనే వుంది. కానీ ఏదీ నాకు ఓ స్థిమితం చిక్కితేనా?" అన్నాడు.
    "ఒరేయ్! నువ్వు అందరికీ చెప్పినట్టు నాకు చెప్పొద్దు. నాకు తెలీదనుకోకు నీ మనస్తత్వం. దేవుడి పుణ్యమా అంటూ మనకి లాటరీలో డబ్బొచ్చింది. దాన్ని రేపు వెళ్ళి బ్యాంకులో వెయ్యి. ఇంకా ఎన్నాళ్ళు ఆలోచిస్తూ వుంటావు."
    "అలాగే రేపు వేస్తాన్లేమ్మా"
    "రవీ! ఆ డబ్బుతో వచ్చే వడ్డీ మనకి ఎక్కీ తొక్కి! హాయిగా కధలూ, నవలలూ రాసుకో. పబ్లిషర్సు ఇచ్చినంత తీసుకో-ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యి - దొరికేదాకా మనకి బాధలేదుకదా ఇవన్నీ పట్టవంటే బిజినెస్ చెయ్యి."
    "బ్రతికించావు బాబూ! రవీ! నాకు యింకేం కావాలి చెప్పు నీవొక యింటివాడవై నీ కడుపున ఒకటో రెండో నలుసులు కాస్తే వాళ్ళని ఆడిస్తూ కాలం గడుపుతాను. నువ్వు రాజ్యలక్ష్మిని పెళ్ళి చేసుకో బాబూ!"
    "అమ్మా!"
    "నా మాట విను! అమ్మాయిగుణం బహుదొడ్డది. వినయం, విద్య, వివేకం వున్నాయి. చక్కని మనిషి. మీరిద్దరూ నడుస్తూవుంటే ఈడూ జోడుగ వుంటుంది!"
    నవ్వేడు రవి.
    "ఒరే! నీకు కట్న కానుకలు అక్కర్లేదనుకుంటా చెప్పు. వాళ్ళిష్టం. అమ్మాయికి ఏదయినా యిచ్చుకోనీ"
    "రెండింటి అర్ధం ఒకటేనమ్మా!"
    "సరేలే! ఎంత తేడావుందో నీకేం తెలుసు కాయను మాగెయ్యటానికి, దానికై అది మాగటానికి ఎంత బేధం వుందో నీకు తెలుసా? ఈసారి రాజ్యం వస్తే ముహూర్తాలకి రమ్మని చెబుతాను"
    "వద్దమ్మా!" గాబరాగా పిలిచాడు రవి. "నువ్వు తొందరపడకు నే చెబుతానుగా!" అన్నాడు.
    "ఏం చెబుతావు బాబూ! అందరూ నన్ను, సవతి తల్లి కాబట్టి యింకా పెళ్ళి చెయ్యలేదని ఆడిపోసుకున్నాక చెపుతావా?"
    ఆ నిష్ఠూరానికి విలవిలలాడిపోయాడు. "అమ్మా! నేను నిన్ను ఎప్పుడైనా ఆ దృష్టితో చూశానా? నాకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం అన్నీ నీవే!" అన్నాడు ఆర్తిగా.
    ఆమె మనస్సు కరిగిపోయింది-అయినా పైకి ఏమీ తెలవదు. గాఢంగా నిద్రపట్టిందతనికి. అంతదాకా అతని మనస్సునిండా ఆలోచనలే! ఎలా ఎలా అనేదే అతనికి తేల్లేదు.
    కొడుకుని అదలించో, బెదిరించో దారికి తెచ్చుకోవచ్చుననుకున్న సుబ్బమ్మగారు మాత్రం హాయిగా నిదురపోయారు.

 Previous Page Next Page