"స్వప్నా! ఏమిటిది? వాడు నిన్ను కొట్టాడా?" ఆవేశం, ఆరాటం మేళవిస్తూ అడిగాడు.
"............"
"మాట్లాడు, స్వప్నా! ఈ సుఖం కోసమేనా నన్ను త్యాగం చేసింది? వీడు తప్ప తాగి తన భార్య ఇంకెవణ్నో ప్రేమించిందని వాగుతోంటే మీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలిచాయనే అనుకొంటున్నావా?"
స్నప్న దోసిట్లో ముఖం దాచుకొని ఏడవసాగింది.
స్వరూప్ బరువుగా ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. "నిజానికి నిన్ను కష్టాలపాలు చేసింది నేను. మాధవ్ కి నువ్వు భార్యవయ్యావని తెలియక మన ప్రేమకథ వాడితో వాగాను......."
"ఆ సంగతులు పోనివ్వండి! నా ఖర్మ ఇలా వుంది!" స్వప్న వారించింది. జరిగిన సంఘటనలు అతడి నోటినుండి వినడం ఇష్టంలేనట్టుగా.
"ఇంత అభిమానం ఎక్కడ నేర్చుకున్నావు? దురదృష్టవశాత్తూ ఈరోజు నేను నీకు పరాయివాడిని అయ్యాను. అయితే మాత్రం? ఒక స్నేహితుడిగా నీకష్టసుఖాలు నాతో చెప్పుకోకూడదా?"
"చెప్పుకున్నందువల్ల లాభేమేమీ లేదు."
"చేయలేనని ఎందు కంటున్నావు? ఇదివరకటిలా నిన్ను కోరే అర్హత నాకు లేకపోవచ్చుగాని ప్రేమించే అర్హత మాత్రం ఎప్పటికీ వుంటుంది. ఆ ప్రేమ వున్న చోట ఏమైనా చేయగల శక్తి వుంటుంది?"
"అయితే ఒకపని మాత్రం చేయండి." స్వప్న తలెత్తకుండానే అంది. "మీ రెప్పుడూ మా కళ్ళబడనని మాటివ్వండి!"
"స్వప్నా!"స్వరూప్ షాక్ తిన్నాడు. స్వప్న ఇంత నిర్దయగా మాట్లాడుతుందని అతడనుకోలేదు.
"మీరు మళ్ళీ మళ్ళీ నా కళ్లబడుతుంటే మిమ్మల్ని మరిచిపోయే శక్తిని కోల్పోతాను! మీరు కనిపించినప్పుడల్లా మాధవ్ మన ప్రేమకథ గుర్తు తెచ్చుకొంటాడు. ఈర్ష్యతో రగిలిపోతాడు. ఇలా జరుగుతోంటే మా సంసారం ఏనాటికీ ముడిపడదు."
"అలాగే స్వప్నా!" బరువుగా అన్నాడు. అతడి కళ్లు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. "నేను ఈ ఊరినుండే కాదు, ఈ ప్రపంచంనుండే వెళ్లిపోతాను నీకోసం!"
"స్వ...రూ.....ప్!" మళ్లీ ఏడవసాగింది స్వప్న. "నువ్వు వున్నతుడివి;ఇంకా ఎదిగిపోవద్దు! నువ్వు ఎదిగి పోతున్న కొద్దీ నా భర్త ఇంకా కురచనైపోతాడు. నే నాయన్ని ప్రేమించలేను! నీ మంచితనం గుర్తు చేసుకోవడం లోనే నా జీవితం తెల్లవారిపోతుంది!"
స్వరూప్ లేచాడు. "ఈరోజు. "ఆరోజు... దేవీబాగ్ లో సెలవు తీసుకోవడమే నీ జీవితం నుండి శాశ్వతమైన నిష్క్రమణ అనుకొన్నాను! మళ్లీ ఇలా నీ జీవితంలో అడుగుపెట్టి దుమారం రేపుతాననుకోలేదు! నేను వెళ్లిపోతాను స్వప్నా! నీ జీవితం నుండి నా అడుగుల గుర్తుల తుడిచివేసుకో. నీ భర్తని ప్రేమించు! నీ సంసారనావ ఓ ఒడిదుడుకులూ లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నాను!"