Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 30


    విజయలక్ష్మిగారు ఏమ్మాటాడుతుందో క్షణంపాటు అర్ధం కాలేదు సుబ్బమ్మగారికి. అర్ధంకాగానే ఆమె మనస్సు ఉరకలు వేసింది. ఇది నిజమా కలా అనుకుంది. ఇంతటి ఐశ్వర్యవంతురాలు ఇంతటి అందాలబొమ్మ? తన యింటికి తెచ్చి యివ్వటానికి వచ్చిందా!
    ఇది నిజంగా రవి అదృష్టమే!
    మొన్న లాటరీలో లక్ష వచ్చింది.
    ఇప్పుడు లక్షాధికారే వచ్చింది.
    "మీరు సంకోచించకండి, మేం ఎంత లక్షాధికార్లమయినా మీ యింటికివచ్చి అడగాల్సిందే! అయినా ఇప్పుడు మీరూ లక్షాధికారే కదా! అబ్బాయికి లాటరీలో లక్ష వచ్చిందని అమ్మాయే చెప్పింది. మేమూ కట్నంగా ఓ లక్ష కానుకగా మరో లక్షదాకా యిస్తాం! మావారు యీ యింటిని ఫాషనబుల్ గా కట్టించి యిద్దాం అన్నారు.
    మాకు ఎంత ఆస్తివున్నా ఎంత ఐశ్వర్యమున్నా ఈ పిల్లని ఎప్పటికయినా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే కదా! ఎక్కడికో యిచ్చేదానికంటే, యిక్కడే యిచ్చుకుంటే అమ్మాయి కళ్ళెదురుగా వుంటుంది. నచ్చినవాడిని చేసుకుని సుఖపడుతుంది. మీలాటి అత్తగారి చేతిలో సుఖపడుతుంది."
    సుబ్బమ్మగారికి ఆనందం తల మునకలవుతుంది. ఏడు కొండలవాడా వేంకటరమణా! నువ్వెంత దయామయుడివి తండ్రీ! ఇంతవరకూ పూటకి గడ్డుగా గడిచే మనుషుల్ని క్షణాల్లో లక్షాధికారుల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తున్నావు. ఇదంతా నీ అనుగ్రహమే తండ్రీ! అనుకుంది.
    సంతోషం ఉట్టిపడే ముఖంతో చూసింది.
    "మిమ్మల్ని చూసి మీతో ముచ్చటించి వెళ్ళాలని వచ్చాను."
    "చాలా సంతోషమమ్మా!" అప్పటికి వెలిగింది ఆమె గొంతు.
    "మీరు ఊఁ అంటారనే యింత దూరం వచ్చాను"
    "చెప్పాను కదమ్మా! రాజలక్ష్మికి ముక్కొంకరా? మూతివంకరా? రోజూచూస్తున్న అమ్మాయే! పైగా అబ్బాయికీ యిష్టం వుండేవుంటుంది. ఇక రాజు యిష్టపడంది మీరు యింత దూరం రారుకదా! ఇద్దరూ యిష్టపడిన సంబంధం ఖాయం చేయటమే పెద్దలుగా మన కర్తవ్యం! నేను చాలా అదృష్టవంతురాలిని." అంది.
    ఆ మాటలకి రాజలక్ష్మీ సిగ్గుతో తలవంచుకుంది.
    విజయలక్ష్మీ తృప్తిగా నవ్వింది.
    కానీ యింతవరకూ తెరచాటున వున్నట్టుగా వుండి, తనగదిలో పడుకుని వింటూ అంతా ఆలోచిస్తోన్న రవి ఉలికిపడ్డాడు.
    అతను ఆమె అంత త్వరగా మాటయిస్తుందని అనుకోలేదు. మా అబ్బాయితో అడిగి ఒకమాట చెబుతానని అంటుందనుకున్నాడు. అతనికి రాజలక్ష్మి నచ్చినా, ఆమె అందచందాలు యింకా నచ్చినా ఆనాటి సంఘటన యింకా మదిలో మెదులుతూనే వుంది.
    అందుకే "అమ్మా!" అంటూ పిలిచాడు హఠాత్తుగ.
    ఆ పిలుపుకి రాజలక్ష్మి ఉలికిపడింది.
    విజయలక్ష్మీ "అబ్బాయి గదిలోనే వున్నాడా! ఒక మాటు రమ్మని పిలవండి. లేదా రాజూ! నువ్వెళ్ళి పిలవ్వే" అంది ఆనందంగా.
    సుబ్బమ్మగారు ఏమీ అనకుండా గదిలోకి వెళ్ళింది!
    ఆమె గదిలోకి రాగానే! "ఏమిటమ్మా" అన్నాడు రవి.
    "నువ్వు మేలుకునే వున్నావా ఆలోచిస్తూ పడుకుని అలాగే నిద్రపోతున్నావనుకున్నాను. అయితే ఆమె చెప్పిందంతా విన్నావా?"
    "అందుకే నిన్ను పిలిచాను."
    "ఇంకేం నా బరువూ తగ్గిపోయింది"
    "అది కాదమ్మా"
    "ఏమిటి బాబూ"
    "నాకీ పెళ్ళి యిష్టంలేదు."
    సుబ్బమ్మగారే కాదు ఆ మాటలువిన్న యిద్దరు శ్రోతలు ఉలిక్కిపడ్డారు.
    "అదేమిటి రవీ!"
    "అదంతేనమ్మా! మనమెక్కడ? వాళ్ళెక్కడ? వియ్యానికి సరిసమానంగా వుండాలమ్మా! అలా లేకపోతే సంబంధాలు, సంసారాలు దెబ్బతింటాయి!"
    ఆమె ఏమీ చెప్పలేకపోయింది.
    "పిల్లని తమకంటే తగ్గుస్థాయినుంచి తెచ్చుకోవాలి. హెచ్చుస్థాయికి యిచ్చుకోవాలి. అదమ్మా కల్యాణ సాంప్రదాయం"
    ఆమెకి నోటిమాట రావటంలేదు. తను క్షణకాలం పాటు కట్టుకున్న విశ్రాంతి మందిరం నేలపై కుప్పగా కూలిపోతున్నట్టుగా అనిపించింది.
    "నువ్వు వాళ్ళతో ఈ విషయం చెప్పేయమ్మా"
    "బాబూ రవీ!"
    ఆమె మాటలు పూర్తికాకముందే రాజలక్ష్మి గదిలోకి దూసుకుని వచ్చింది. ఆమె ముఖం సిగ్గుతో, అవమానంతో, కోపంతో, బాధతో మాడిపోయింది.
    ఆమెనిచూసి రవి స్థాణువయ్యాడు.
    "ఎందుకు మీరిలా మాటాడుతున్నారు."
    రవి సమాధానం యివ్వలేదు.
    "నాకు తెలుసు. మీరు ఆనాటి విషయం యింకా మనస్సులో పెట్టుకుని మాటాడుతున్నారు. మీ మాట ఎంత గట్టిదో నామాట అలాంటిది"
    రవి నవ్వేశాడు.
    "నవ్వు! నవ్వు! నేను నీ యింటికి వచ్చానని నవ్వుతున్నావు కదూ! నన్ను తిరస్కరించగలిగానని నవ్వుతున్నావు కదూ!"
    అతనేం అనలేదు.
    సుబ్బమ్మగారికి అంతా వింతగా ఆశ్చర్యంగా వుంది. "ఇదేదో వీరిద్దరి మధ్య వ్యవహారంలాగా వుంది. తాను త్వరపడి వెళ్ళి విజయలక్ష్మితో సంబంధం వద్దనకూడదు. యువతీ యువకుల తిలక, కలత ఎంతసేపు!" అనుకుని మెల్లిగా బయటకు వెళ్ళి విజయలక్ష్మిగారి వద్ద కూర్చుంది.
    "రవీ!"
    "ఊఁ"
    "పగతీరిందా?"
    "నాకు పగ ఏమిటి? నీ స్థాయికి అంతస్తుకి తూగనని వద్దన్నాను"
    "అబద్ధం - అబద్ధం చెప్పకు! మా స్థాయి ఏముంది? నువ్వే మాకంటే అదృష్టవంతుడివి. చీకూ చింతా లేకుండా లక్షతో హాయిగా గడపగలవు. నన్ను పెళ్ళి చేసుకుంటే వచ్చే రెండు లక్షల కట్నంతోటి నువ్వు మంచి రచయితవై, పబ్లిషరువై, లక్షాధికారివై పోగలవు. ఒక పత్రిక పెట్టొచ్చు. దాంతో వార, మాస పత్రికలు, డిస్ట్రిబ్యూషన్, ప్రెస్సు అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు-ఓ మంచి మిలీయనీర్ కావచ్చు!"

 Previous Page Next Page