Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 30

   
    "ఏమిట్రా? అర్దరాత్రి వచ్చినిద్రచెడగొట్టారు?"

    "నీకు మాధవ్ ఇల్లు తెలుసా?"

    "తాగి ఒళ్ళు తెలియకుండా రోడ్డుమీద పడి వున్నాడు! వాణ్ణి టాక్సీలో వేసుకువచ్చాం. తిన్నగాయింటికి చేరుద్దామంటే వాడి ఇంటి అడ్రస్ తెలియదు."

    "మాధవ్ తాగాడా? వాడికి తాగుడు అలవాటు వుందా?" పిడుగుపడ్డట్టుగా అడిగాడు స్వరూప్.

    "వాణ్ణీ స్థితిలో చూసింది ఈరోజే. ఎప్పుడైనా పార్టీల్లో పుచ్చుకొనేవాడనుకొంటాను!" సత్యనారాయణ అన్నాడు.

    స్వరూప్ కిందికి వచ్చి టాక్సీలోకి తొంగి చూశాడు. వెనుక సీట్లో అస్తవ్యస్తంగా పడుకొని వున్నాడు మాధవ్.

    "రే, మాధవ్! మాధవ్!"

    "........."

    స్వరూప్ అతడిని గిల్లాడు. అతడిలో ఎలాంటి కదలికా రాలేదు. ఎక్కువ డోసే పడిందని గుర్తించాడు.
    "వీణ్ణీ స్థితిలో యింటికి తీసుకువెడితే వీడి భార్య బాధపడుతుందేమో!"

    "కొత్తగా పెళ్లయినవాడు, భార్యను వాటేసుకుని ఇంట్లో పడుకోవలసినవాడు  బార్ లో దూరి తప్పతాగి రోడ్డు మీద పడి వున్నాడంటే ఆ భార్య ఎలాంటిదో. ఆ కాపురం ఎలా సాగుతుందో మనం ఊహించుకోవచ్చు!" రాంప్రసాద్ ఎగతాళిగా అన్నాడు.

    "ఆమె పెళ్లికిముందే ఎవరినో ప్రేమించిందట. వీడితో మనసు లేని కాపురం చేస్తోందట. వాడీ రోజు చాలా వాగాడు. త్వరలో ఆవిడకు విడాకు లిచ్చేస్తున్నానని చెప్పాడు."

    స్వరూప్ తల గిర్రున తిరిగిపోయింది. మాధవ్ ని ఈ రోజు తన దగ్గరే వుంచుకొని పొద్దున వాడికి బాగా బుద్దిగరిపి పంపాలన్న ఆలోచన విరమించుకొని మాధవ్ ని అతడింటింకి తీసుకు వెళ్లడానికే నిశ్చించుకొన్నాడు. పైకి వచ్చి జేబులో కొంత చిల్లర వేసుకొని ఇంటికి తాళం పెట్టి లుంగీతో బయల్దేరాడు.

    రాంప్రసాద్, సత్యనారాయణ అక్కడినుండే సెలవు తీసుకొని వెళ్లిపోయారు
.
     టాక్సీ ఇల్లు సమీపిస్తూంటే స్వరూప్ హృదయంలో అలజడి కెరటం ఉవ్వెత్తుగా  లేచింది. ఈ స్థితిలో మాధవ్ ని తీసుకొని స్వప్న ఎదుట ఎలా పడాలి? ఏమని చెప్పాలి?


    టాక్సీ దిగి తలుపుమీద టకటక కొట్టాడు స్వరూప్.

    స్వప్న తలుపు తీసింది. "మీరా!" భయంతో రెండడుగులు వెనక్కి వేసింది.

    స్వరూప్ టాక్సీవాడి సాయంతో మాధవ్ ని ఇంట్లో పక్కమీదికి చేర్చాడు.

    "ఏమిటి! ఏమైంది ఆయనకి?" కంగారుపడిపోయింది స్వప్న.

    "ఏం లేదు. కాస్త మందు పుచ్చుకొన్నాడు!" టాక్సీ వాడికి డబ్బు లిచ్చి పంపేశాడు.

    స్వప్న ముఖం వివర్ణమైంది. "మీరీయన్ని ఎక్కడ పట్టుకొచ్చారు?"

    చెప్పాడు స్వరూప్.


    స్వరూప్ కూడా పార్టనర్ కానందుకు సగంభారం తీసేసినట్టయింది స్వప్నకి.

    స్వరూప్ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు. "స్వప్నా! వీడు ఈ రోజేనా.........  " అడగలేక అడుగుతున్నట్టుగా అడిగాడు.

    "ఈయన తాగుతారని నాకు తెలియదు! ఈరోజే చూస్తున్నాను"

    "........."

    స్వప్న నుండి జవాబు  రాకపోయేసరికి స్వరూప్ కళ్లెత్తి సూటిగా ఆమెకేసి చూశాడు. ఎర్రగా కంది ఉబ్బిన  " బుగ్గ అతడిని దిగ్గున  కుర్చీలోంచి లేచి ఆమెని సమీపించేలా చేసింది.

 Previous Page Next Page