"మళ్ళీ కథ మొదటికి వచ్చింది."
ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. "అయితే ఆ టికెట్ చించెయ్. ఫూల్! మా ఫాక్టరీలో ఉద్యోగం యిస్తాను."
రవి సమాధానంగా చూశాడు.
ఆయన కారు ఎక్కాడు తలుపువేశాడు. కారు కదిలింది. మళ్ళీ రివర్స్ చేసి వచ్చి "చూడు! నీకు బుద్ధివస్తే నా వద్దకు రా! రెండు లక్షలూ పట్టికెళ్ళు---లేదా యిలాగే వెళ్ళి ఆ కాలువలో దూకేయ్! పీడ విరగడయిపోతుంది." అన్నాడు.
రివ్వున దూసుకెళుతున్న కారుకేసి అలాగే చూస్తుండిపోయాడు రవి.
"తను కాదని అన్నందుకు ఆయనకెంత కోపం వచ్చింది? నామాట కాదంటే నాకూ అంతేకదా! ఆ మాత్రం లోకజ్ఞానం లేదే!" అనుకున్నాడు రవి. మెల్లిగా రోడ్డు కొలవటం ప్రారంభించాడు అతను.
20
ఖరీదైన కారు ఇంటిముందు ఆగింది.
అంతకంటే ఖరీదైన మనిషి, మరీ ఖరీదైన చీరకట్టి అందులోంచి దిగింది. ఆమె వెనకే రాజలక్ష్మీ దిగింది. ఆ ఖరీదైన మనిషి రాజలక్ష్మి అమ్మగారు విజయలక్ష్మి.
గిట్టినవాళ్ళు ఆవిడ సాక్షాత్తూ విజయలక్ష్మీ అని అంటారు. గిట్టనివాళ్ళు ఆమె పేరు విజయలక్ష్మీ కాదు--- సీతమ్మో చింతాకమ్మో అయితే ఈమె మెళ్ళో ముళ్ళేశాక తనకి అదృష్టం తిరిగిందని ఆమె భర్తగారు ఆమెని తనే విజయలక్ష్మీ అని నామకరణం చేశారు అంటారు.
ఆ మాటా నిజమే! పెళ్ళిచేసుకోక పూర్వం గోడౌన్ గుమాస్తాగా వున్న అతను - ఏటికేడాది పేరుగుతూ - ఆస్తిని పెంచుకుంటూ అతనల్లా ఆయనగారు అయ్యారు. ప్రతి కంపెనీలో షేర్లు - ప్రతి బ్యాంకులో ఎకౌంట్లు - ఇవీ ఆయన దర్జాలు - హోదాలు.
అలవాటైన యిల్లు కాబట్టి గబగబా లోపలికి వచ్చేసింది రాజ్యలక్ష్మి. ఆమె వెనకే విజయలక్ష్మిగారు వచ్చేశారు.
బయట కారు చప్పుడు, ఇంట్లో అడుగుల చప్పుడు విని సుబ్బమ్మగారు బయటికి వచ్చారు.
రాజలక్ష్మి ఆమెని చూడగానే చిరునవ్వు నవ్వింది.
"రామ్మా! రా! ఈ మధ్య మరీ నల్లపూసైపోయావే!" పలకరింపుగా నవ్వుతూ పిలిచారు సుబ్బమ్మగారు.
"నమస్కారమండీ! మా అమ్మగారు వచ్చారు!" అంటూ పరిచయం చేసింది. విజయలక్ష్మి నమస్కారం చేసింది. అసలు సుబ్బమ్మగారిని చూస్తే ఎవరికయినా సరే పూజ్యభావం కలుగుతుంది. చెయ్యెత్తి మొక్కబుద్ధి అవుతుంది. అంతటి పవిత్రత, మంచితనం కనిపిస్తాయి ఆమె ముఖంలో.
"రండమ్మా! మీలాటి వాళ్ళు మా యింటికి రావటం ఎంతో విశేషం!" ఆప్యాయంగా ఆహ్వానించింది.
"అదేమిటి వదినగారూ! నన్ను అంతగా పొగిడెయ్యకండి - నేనూ మామూలు మనిషినే! ఈ ఆస్తి ఐశ్వర్యం ఈ నగలు అన్నీ మావారివి. అంతే!" అంది వరస కలిపేస్తూ.
సుబ్బమ్మగారు నవ్వేశారు ఆ మాటలకి.
ఆమె సమాధానం యివ్వకముందే పనిమనిషి బుట్టల్లో తెచ్చిన పళ్ళూ, పూలు, స్వీట్స్ అన్నీ సుబ్బమ్మగారికి అందించింది.
"ఇవన్నీ ఎందుకమ్మా?" ముఖమాటపడుతూ అంది సుబ్బమ్మగారు. ఆమెకి తన పెరట్లో పండిన కూరగాయలు యితర్లకిచ్చి వాళ్ళనుంచి మరేదో ఆశించటం అలవాటు. అంతేకానీ యిలా ఆయాచితంగా మరీ బొత్తిగా ముఖ పరిచయం కూడా లేనివాళ్ళనుంచి తీసుకోవటం ఆమెకి యిష్టం లేదు.
"చూడండి వదినగారూ! గుడికి, బడికి, గురువు వద్దకి వెళ్ళేప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు మావారు. నేను ఎప్పుడూ ఆయన మాటే వింటాను. దేవాలయంలాంటి మీ యింటికి వస్తూ, దేవతలాటి మిమ్మల్ని చూడవస్తూ ఖాళీచేతులతో ఎలా రమ్మంటారు? ముఖాన్నే పొగిడేస్తున్న ననుకునేరు సుమా! మా రాజ మీ గురించి అంతా చెప్పింది. అబ్బాయి రవిని యింతవాడిని చేసింది మీరేనట కదా - అది చాలదా మీ గొప్పదనానికి. ఇళ్ళు వాకిళ్ళు వుంటేనేనా గొప్ప?" అంది. ఆమె మాటలు గుండె లోతుల్లోంచి వచ్చాయి.
ఆ మాటలు సుబ్బమ్మగారికి ఎలాగో అనిపించాయి. తనేం చేసింది. వాడు కష్టపడి చదివాడు. ఇల్లు ఎలా గడుస్తుందా అని బాధపడకుండా తను సంసారాన్ని లాక్కొచ్చింది. ఉప్పో, ఊరగాయో వేసి పెట్టింది. ఏం పెట్టిందా అని వాడు ఎన్నడూ ఆలోచించలేదు. అదీ వాడి గొప్పదనం. చదివాడు ఫస్టున పాసయ్యాడు.
మరి వాడికి ఉద్యోగం వేయించగలిగిందా తను?
వాడికి పెళ్ళి చేసి ఓ యింటి వాడిని చేసిందా?
తనేం చేసింది?
"వదినగారూ!"
చప్పున ఆ పిలుపుకి ఆలోచనల నుంచి బయటపడింది.
"మీతో ఓ విషయం ముచ్చటిద్దామని వచ్చాను."
"చెప్పండి!"
ఇంతసేపూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే రాజలక్ష్మి కళ్ళు అనిశ్చితంగా అటూ యిటూ తిరుగుతూనే వున్నాయి. ఆమె కళ్ళకి ప్రీతికరమైన మనిషి ఛాయ ఎక్కడా కనిపించలేదు.
"వదినగారూ! నాకు రాజలక్ష్మి ఒక్కటే ఆడపిల్ల. దాన్ని మీలాంటి మంచి మనస్సున్న తల్లి చేతిలో పెడితే అది సుఖపడుతుందని నా ఆశ! దానికి యింత వరకు కష్టనష్టాలు తెలియవు. బరువు బాధ్యతలు తెలియవు. చదువుకుంది పాసైంది. ఇప్పుడు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాం!"
"రాజలక్ష్మి కేమమ్మా! బంగారుబొమ్మ! రతనాల రెమ్మ! అని కవులు అన్నట్టుగా వుంటుంది. మీలాటి తల్లిదండ్రుల పెంపకంలో ఒద్దిగ్గా పెరిగింది. కుదురుగా వుంటుంది. ఎవరయినా కళ్ళ కద్దుకుని చేసుకుంటారు!" నవ్వుతూ అంది సుబ్బమ్మగారు.
అదే ఆమెలోని విశేషం - ఎక్కువగా మాటాడదు. మాటాడిన నాలుగుముక్కలూ తీసి తూచినట్టుగా మాటాడుతుంది.
"అదేనమ్మా నా నమ్మకమూను - ఆ నమ్మకంతోటే నేను వచ్చాను"
సుబ్బమ్మగారికి ఆ మాటలు అర్ధంకాలేదు.
"అంతా మీ చేతుల్లో వుంది! ఈ బంగారు పువ్వుని మీ చేతుల్లో భద్రంగా పెట్టాలని వచ్చాను."
ఆశ్చర్యపోయింది ఆమె.
"మీ రవికి మా పాపని చేసుకోమని అడగాలని వచ్చాను" అంది విజయలక్ష్మి గారు.