Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 29

   
    స్వప్న కళ్లు తెరవలేదుగాని మెలుకువతో వున్నట్టు కదిలింది.

    "ఈ మూగ బాధ , విరహ వ్యధా ఎన్నాళ్లు?" కటువుగా అడిగాడు.

    స్వప్ననుండి జవాబు రాలేదు.


    "ఈ పరిస్థితి ఎక్కువ రోజులు భరించే శక్తి నాకు లేదు. దీనికి పరిష్కారం తొందరగా జరగాలి! అంతగా స్వరూప్ ని మరిచిపోలేనిదానివి నాతో కాపురం చేస్తానని ఎందుకు మాటిచ్చావ్?"

    "....."ఇప్పుడు కూడా స్వప్న నుండి జవాబు రాలేదు.

    మాధవ్ కి కోపం, ఆగ్రహం ఆగలేదు. స్వప్న  భుజాలు పట్టి కుదించి లేపాడు. "బిగుసుకు పడుకొంటే కాదు. నాకు జవాబు చెప్పు!"

    "నాకింత విషం తెచ్చిపెట్టండి. చచ్చిపోతాను!" స్వప్న దీనంగా అంది.

    "ఎందుకు? నేను వెళ్లి జైల్లో కూర్చోడానికా?"

    " కాపురం చేయనన్నానా? చేస్తాను. చేస్తున్నాను."

    " వండడమూ, పెట్టడమూ - దీన్నే కాపురమనేది?"

    "మీ వుద్దేశ్యం అర్దం చేసుకోలేని పసిపిల్లనేం కాదు. మీరు కోరితే ఈ శరీరం మీకివ్వడానికి సిద్దమే."
    "మనసులేని  ఆ శరీరం నాకు శవంతో సమానం. దానితో కాపురం చేసే దిక్కుమాలిన గతి నాకు పట్టలేదు. ఆ సంగతి నీకిదివరకే స్పష్టం చేశాను! స్వరూప్ ని మరిచిపోతా నన్నావు!"

    "దానికి నాకు కొంత టైం కావాలి."

    "కాంతకాలం కాదు. జీవితమైనా సరిపోదు!"

    "మీరింత సంకుచితంగా నన్ను పీడిస్తుంటే నిజంగా  అతడిని మరవడానికి జీవితకాలం సరిపోదేమో!
 మీ దుష్టత్వం ముందు అడుగడుగునా స్వరూప్ మంచితనం గుర్తుకు వస్తూ వుంటుంది! మీరు నిర్దయగా ప్రవర్తించినప్పుడల్లా అతడి ప్రేమ గుర్తువస్తుంది.

    "నా మనసులో ఏ కల్మషం లేకుండా నా మనసు విప్పి చెప్పుకొన్నాను మీ కొకనాడు. నన్నర్దం చేసుకొని సానుభూతి చూపితే ఎంత బాగుండును! స్వరూప్ ని మరిపించేలా మీరు నన్ను ప్రేమించలేరా?"

    ఒకనాడు తనలో చేసుకున్న నిర్ణయమే ఈరోజు స్వప్న నుండి వింటూంటే మండిపోయాడు. "ఈ మాట నువ్వు మన పెళ్లికి ముందే అడగవలసింది ! నేనొక ఉత్తమపురుషుడ్ని ప్రేమించాను. మా అమ్మా, నాన్నా బలవంతంచేత మిమ్మల్ని పెళ్లిచేసుకొంటున్నాను. నా భగ్న హృదయంపట్ల సానుభూతి వ్యక్తం చేసి అతడిని
మరిపించేలా ప్రేమనందిస్తారా అని! ఇప్పుడడిగితే నీ ముఖాన విడాకులు పారేయడం తప్ప ఇంకేం జరగదు నీకు!"

    "ఇంత హృదయంలేని మనిషితో కాపురం చేయటం కంటే ఆ విడాకులే నయమనిపిస్తోంది!" నిర్వేదంగా అంది.

    స్వప్న సుకుమారమైన బుగ్గలమీద బలిష్టమైన అతడి చెయ్యి కసితో  నర్తించింది. "ఆ హృదయం  వున్నవాళ్లనే పెళ్లాడితే నాకీ పీడ పట్టేది కాదుగా? ఛీ ఛీ! జీవితం నాశనం చేశావ్!" రౌద్రంగా అరిచాడు. "తెల్లారేసరికి నువ్వు ఈ ఇంట్లో వుండడానికి వీల్లేదు! ఈ ఇంట్లో నీ సామానేదైనా వుంటే తీసుకొని వెళ్లిపో!"

    మాధవ్ విసురుగా బయటికి నడిచాడు.

                           11

    ఎవరో కాలింగ్ బెల్ అదే పనిగా నొక్కుతున్నారు.

    స్వరూప్ నిద్ర తేలిపోయింది. లేచి టేబుల్ మీదున్న టైంపీస్ చూశాడు. రాత్రి పదకొండు గంటలు
దాటింది. ఇప్పుడు తనకోసం వచ్చింది ఎవరబ్బా అనుకొంటూ షర్ట్ తొడుక్కుని తలుపు తెరిచాడు.

    తన స్నేహితులు రాంప్రసాద్, సత్యనారాయణ!

 Previous Page Next Page