"సరే! మీరెవరో నాకు పరిచయం లేదు. ఊరకే టౌన్ లో చూస్తున్నాను. మీ హోదా తెలుసు. కానీ యోగ్యత యిలాంటిదని తెలియదు."
"ఊఁ నీ యిష్టం - తిట్టు - కానీ నాకు ఆ టికెట్ కావాలి."
"అదే ఎందుకు?"
"రవీ! కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు!"
"సారీ - నన్ను వదిలెయ్యండి! నేను యివ్వను!"
ప్రహ్లాదుడిలా మొండిపట్టుపట్టిన ఆ వ్యక్తిని చూసి ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది.
"విషయం చెప్పి తీరాలా?" అని అడిగాడు.
"ఆఁ"
"బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు."
కనుబొమలు ముడివేశాడు రవి.
"అంతే - అంతకు మించి అడక్కు"
రవి సమాధానం యివ్వలేదు.
"రవీ- నన్నర్ధం చేసుకో... నీకు డబ్బు ఎలా యిచ్చినా ఫరవాలేదు. ఎలా వచ్చినా ఫరవాలేదు. లాటరీ టికెట్టుని ఏ బ్యాంక్ లోనయినా కేష్ చేసుకోవచ్చు --- కానీ మా విషయం అలాకాదు---"
"మీరు ప్రబుత్వాన్ని మోసం చేస్తున్నారు."
"అవును - మోసం చేయంది డబ్బు సంపాదించలేం" అది నీకు తెలియదు. న్యాయంగా సంపాదిస్తే మిగిలేది నీలాగే. సంపాదన అంతా టేక్స్ కట్టటానికే సరిపోతుంది. అందుకే మేం ఎకౌంట్స్ చూపం. టాక్సు తప్పించుకుంటాం. అదే బ్లాక్ మనీ---"
"అన్యాయం కాదా?"
"న్యాయం అన్యాయం---ఏ సూత్రాలతో నిర్వచిస్తావు నువ్వు. నీ స్కేలు వేరు. నా మెజర్ మెంట్స్ వేరు--- నీ నా దృక్పధాలు వేరు. మరి నువ్వు నన్నెలా అర్ధం చేసుకోగలవు?"
"హుఁ దోపిడీ దార్లంతా అంతే"
"వాదనలొద్దు - ఆ టికెట్ యివ్వు-"
"అయాం సారీ - నేను చదువుకున్నవాడిని..."
"నేనూ చదివాను నువ్వు గ్రాడ్యుయేట్ వి అంతే! నేను పోస్టుగ్రాడ్యుయేట్ ని!"
"నేను కవిని సర్ - నాకు మనస్సు వుంది. నీతి, నియమం వున్నాయి. సంఘంలో మీలాటి చీడపురుగుల్ని వేలెత్తి చూపాలి నేను. నేను క్రాంతిదర్శిని, సమదర్శిని, కార్యదర్శిని, సంఘవాదిని, సమసమాజవాదిని."
"కవిత్వం వ్రాసుకో- కాదన్ను- కానీ దమ్ముంటే డబ్బు సంపాదించు. ఊరికే కవిత్వం రాసి, నినాదాలు రాసినంత మాత్రాన నో యూజ్ - నువ్వు వెధవవయినా డబ్బుంటేనే యోగ్యుడివి---"
"ఆ యోగ్యత నాకు అక్కర్లేదు---"
"నువ్వు ఫూల్ వి అన్నమాట - లక్షకిపైగా లక్ష-టికెట్ మార్చితే నీకు లక్షకూడా రాదు. అలాటిది రెండు లక్షలు యిస్తానంటే నీకు చేదుగా వుంది!"
ఆశ్చర్యపోయాడు రవి! "రెండు లక్షలా?"
"యస్ టూ లాక్స్-ఇందాక వేలం అన్నావే... ఆ పెంచింది అసలు కాక పై డబ్బు అన్నమాట---"
"అయినా సరే! వద్దు"
"రే అబ్బాయ్! నీకు పెద్దవాళ్ళు ఎవరూ లేరా?"
"మా అమ్మ వుంది."
"అమ్మని అడక్కు - దేశానికో అమ్మ తయారై చచ్చిపోతున్నాం మేం-నీకూ ఆ పిచ్చిపట్టింది. నా మాటవిను. నీకు ముఖ్యులు అనుకునే వాళ్ళని అడుగు. ఆ సలహా పాటించు బావుపడతావు."
"సర్! మీరు తిట్టినా, అసహ్యంగా మాటాడినా ఎంత ప్రలోభ పెట్టినా లాభంలేదు - మీ మాటల్లో చెప్పాలంటే నో యూజ్. నాకు ఊరికే వచ్చే డబ్బు అక్కర్లేదు... అసలు లాటరీ టికెట్టు నేను కొనలేదు. బలవంతంగా ఊరికే ఇచ్చి వెళ్ళింది మా మరదలు-అది అదృష్టవశాత్తు పేలింది"
"యస్! అదృష్టం ఒక్కోసారి కాలితో తంతుంది. ఫుట్ బాల్ లాగా వెళ్ళి లక్కీ గంపలో పడ్డావు."
"కానీ అది నాకిష్టంలేదు. అందుకే నేను వెళ్ళి బ్యాంక్ లో వెయ్యలేదు యింకా. ఆలోచిస్తూ వున్నాను. ఏదయినా ఛారిటీస్ కి యిచ్చేద్దామా అనికూడా ఆలోచిస్తూ వున్నాను"
పకపక నవ్వేడు ఆయన. వెర్రివాడిని చూసినట్టు చూశాడు.
"మరి యిక మీ డబ్బెందుకు"
"ఒరే కుర్రాడా! నువ్వు డబ్బు ఎందుకు అని ప్రశ్నిస్తున్నావు. తినటానికి, కట్టటానికి, అనుభవించటానికి డబ్బుకావాలిరా."
"నాకు అవసరాలకి చాలు."
"చాలు. ఆమాత్రం ఒప్పుకున్నావు. అదయినా ఎలా వస్తుంది!"
"కష్టపడి పనిచేస్తాను"
"మూటలు మోస్తావా?"
రవి సమాధానం చెప్పలేదు.
"రిక్షా తొక్కుతావా?"
రవి జవాబు యివ్వలేదు.
"సర్వ్ చేస్తావా?"
రవి తీవ్రంగా చూశాడు.
"పొలాల్లో కష్టపడతావా?"
"ఉద్యోగం చేస్తాను"
"నీకు ఉద్యోగం ఎవరిస్తారు?"
"ప్రయత్నిస్తున్నాను..."
"ఈ జన్మలో దొరకదు. ఉత్తర దక్షిణ ధృవాలు లేంది బ్రతుకులేదు. నువ్వు యింకా భూమధ్య రేఖ వద్దే వున్నావు. పైగా అగ్రకులంవాడివి. రిజర్వేషన్ కూడా లేదు."
రవి సమాధానం యివ్వలేదు.
"కాబట్టి నా మాట విను. రిక్షాతొక్కి, బస్తాలు మోసి, సర్వింగ్ చేసి, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిననాడు ఎవడూ లేడు ప్రపంచంలో. వ్యాపారం చెయ్యాలి. ప్రభుత్వాన్ని దగా చేయాలి. ప్రజల్ని మోసంచేయాలి. అప్పుడే నీవు డబ్బు కూడబెట్టగలవు. మరోమార్గంలో నీవద్ద నిలవదు అంతే! ఇది జీవన సూత్రం గుర్తుంచుకో..."
"థాంక్స్ నాకు అక్కరలేదు."
చప్పున అడిగాడు ఆయన. "ఉద్యోగం యిస్తాను చేస్తావా?"
అతని కళ్ళలో ఆశ తళుక్కుమంది.
"చెప్పు-సరేనంటే---ఆ టికెట్ యిచ్చెయ్... రెండు లక్షలు బ్యాంక్ లో వేసేస్తాను. దాంతో నీకు బ్యాంక్ లోనే ఉద్యోగం వస్తుంది"