వీళ్ళు ఒకసారి కలిసినవాళ్లు మళ్లీ కలవకుండానే వుంటారా? కథ మళ్లీ మొదటికి రాకుండానే వుంటుందా? స్వరూప్ తన మనసునుండి అదృశ్యం కావాలంటే ఏడాది గడువు కావాలంది స్వప్న. ఈ లెక్కన జీవితకాలం సరిపోదు.
పిలువకపోయినా వస్తానన్న స్వరూప్ ఆ ఆదివారం రానేలేదు.
పెద్ద రిలీఫ్ ననుభవించింది మాధవ్ మనసు.
మళ్లీ ఆదివారం రానేవచ్చాడు స్వరూప్.
అతడిని గుమ్మలో చూడగానే గతుక్కుమన్నాడు మాధవ్. పెదవులకు నవ్వు అతికించుకొని లోపలికి ఆహ్వానించాడు.
గది నలుమూలలా కలియజూస్తూ "అద్దె ఎంత?" అన్నాడు స్వరూప్.
"రెండు వందలు! మూడు గదులు, కిచెన్ వున్నాయి. అంతా సెపరేట్.
"నీ ఆఫీసుకు దూరం కదా?"
"మా ఆవిడ పనిచేసే స్కూల్ కి దగ్గర!"
"ఓ! ఆవిడ ఉపాధ్యాయిని అన్నావుకదూ?" ఉపాధ్యాయిని పేరు వినగానే తనకి స్వప్న గుర్తుకు వచ్చినట్టుగా అతడి ముఖం విషాదంగా మారింది.
ఆఫీసు విషయాలపై సంభాషణ దొర్లింది. మాధవ్ పనిచేస్తున్న ఆఫీసుకి తనకి ట్రాన్శ్ ఫర్ అయ్యే సూచన లున్నాయని చెప్పాడు స్వరూప్.
తరువాత మాధవ్ లేచి లోపలికి వెళ్లబోతుంటే స్వరూప్ ఆపాడు. "ఈరోజు భోజనానికి వస్తాని నవ్వులాటకి అన్నాను. మీ ఆవిడనేమీ శ్రమపెట్టకు!"
"టీ కూడా తీసుకోవా?"
"దానికేం అభ్యంతరం లేదు."
మాధవ్ వెళ్లి రెండు కప్పులు టీ చెయ్యమని చెప్పి వచ్చాడు. మా ఆవిణ్ని పరిచయం చెయ్యమని స్వరూప్ అడగకపోతే బాగుండును. ఆ టీ తనే తెచ్చి యిచ్చి మాట్లాడి పంపేసేవాడు. ఇప్పటికి గండం గడిచేది. అయినా తనదెంత పిచ్చి? వీళ్ళను ఇప్పుడు కలుసుకోకుండా చేస్తే ఎప్పటికీ చేయగలడా? మనుషుల్ని దూరం చేసినా మనసుల్లో చివుళ్లు వేసే మమతను తన త్రుంచివేయగలడా? ఇదంతా తన ఖర్మకు వచ్చి పడింది!
గత్యంతరం లేనట్టుగా లోపలికి వెళ్లి చెప్పాడు స్వప్నతో. "నా ఫ్రెండు నిన్ను చూస్తానంటున్నాడు ఒకసారి అవతలకి రా, స్వప్నా!"
స్వప్న భుజాలచుట్టూ పమిట కప్పుకొని అతడి వెనకాలే నడిచింది.
"షీ ఈజ్ మై వైఫ్! స్వప్నా, బి. ఎ, బి. ఇడి" ఉద్వేగరహితంగా పరిచయం చేయాలనుకొన్నాడు గాని మాధవ్ బయటపడిపోయాడు.
కప్పు టీపాయ్ మీద పెట్టి చేతులు జోడించబోయాడు స్వరూప్. పెద్ద మెరుపుతో పిడుగు రాలినట్టుగా అయింది.
స్వరూప్ ని చూసి ఒక్క క్షణం ఆగలేదు స్వప్న. లోపలికి పారిపోయింది.
"చూశావుగా? ప్రతి ఆదివారం భోజనానికి రా, అన్నయ్యా! అని ఆవిడచేత పిలిపించుకోవూ?" ఒక విధమైన కసితో, వ్యంగ్యంతో అడిగాడు మాధవ్.