Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 26

   
    "నా బస్సు వచ్చేసింది" స్వప్న పరుగెత్తింది అప్పుడే ఆగిన బస్సు దగ్గరికి. బస్సు ఎక్కుతూనే కదిలింది.
    ప్రాణంలేని బొమ్మలా చాలాస్పు నిలబడిపోయాడు స్వరూప్.

                                                               10

    "మనుషులింత చిత్రంగా ఎలా మారిపోతారో అర్దం కాదురా! నీ బార్యను తీసుకువచ్చాక నా ఇంట్లో కాపురం పెడతానన్నావు! నాకు హోటల్ తిండి తప్పిస్తానన్నావు! ఆ రోజు వెళ్లి మళ్లీ ముఖమైనా చూపించావా?" కోటీలో షాపింగ్ చేస్తున్న మాధవ్ ని పట్టుకొన్నాడు స్వరూప్.

    "సారీరా! మాకు మంచి ఇల్లు దొరికింది. "

    "మంచి ఇల్లు దొరకదని నా ఇంట్లో వుండమన్నానా? వేరే ఇల్లు తీసుకొనేప్పుడైనా నీకు మన స్నేహం గుర్తురాలేదా!"

    స్వరూప్ చనువుగా నిష్టూరం చేస్తూంటే ఇబ్బందిగా ముఖం తిప్పుకొన్నాడు మాధవ్. ఇంకా ఆ స్నేహం అలాగే ఉందనుకొంటున్నాడు పిచ్చివాడు! తన భగ్నప్రణయం వినిపించిన నాడే పాలు విరిగిపోయినట్టుగా విరిగిపోయింది ఆ స్నేహం! తన భార్య అతడి  ఊహల్లో కాపురంచేసే ప్రేయసి అనిపించినప్పుడల్లా ఒంటికి కారం రాచుకొన్నట్టుగా వుంటుంది!

     "లైట్ గా ఏదైనా తీసుకొందాం" అంటూ మాధవ్ ని తాజ్ లోనికి లాక్కుపోయాడు స్వరూప్.

    "పెళ్లి పార్టీ ఇవ్వనేలేదు! ఈరోజు బిల్లు నీదే!"

    "నీకిష్టమైనది ఆర్డరివ్వు!"

    నాలుగు రకాలకి ఆర్డరిచ్చాడు స్వరూప్. ప్లేట్లు నెమ్మదిగా ఖాళీచేస్తూ "ఉఁ. ఇక చెప్పరా!  మీ ఆవిడకు వంట బాగా చేతవుతుందా?" అని అడిగాడు.

    "హోటల్ తిండి అంత మొహం కొట్టిందా ఏమిటిరా? పెళ్ళిచేసుకొంటే ఆ బాధ తప్పుతుందికదా!"

    " ఈ జన్మకి పెళ్ళిలేదు. ఇల్లాలి చేతి భోజనం తినే అదృష్టం అసల్లేదు! నీలాంటి గృహస్థులు ఒక పూట భోజనానికి పిలిస్తే పరమానంద పడిపోతాను!"

     ".......... "

     "వచ్చే ఆదివారం నీఇంటికి వస్తాను. నువ్వు పిలవాల్సిన అవసరంలేదు. వచ్చి మా ఆవిడతో స్నేహం చేసుకొంటాను. ప్రతి ఆదివారం మా యింటికి భోజనానికి రా, అన్నయ్యా!" అని ఆవిడ నోటినుండి అనిపించుకువస్తాను!"

    "అలాగే రారా!" బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకొంటూ అన్నాడు మాధవ్.  తన భార్య స్వరూప్ ప్రేయసి కాకపోతే, స్వరూప్ తనంతట తను భోజనానికి వస్తాననే పరిస్థితి రానిచ్చేవాడా?వీణ్ణి తమలో ఒకడిగా చేసుకొనేవాడు!

    "మొన్న సాయంత్రం స్వప్న కనిపించిందిరా! పెళ్లి చేసుకొంది. మాట్లాడిస్తే సరిగా మాట్లాడలేదు. బస్సెక్కి తుర్రుమంది. స్వప్న ఇంత తొందరగా నన్ను మరిచిపోగలిగిందంటే,  పెళ్లికూడా చేసుకోగలిగిందంటే  నాకెంత ఆశ్చర్యమనిపించిందో? తాను నన్ను ఎంతో ప్రేమించినట్టే నటించింది! నటనే కాకపోతే  ఇంతతొందరగా మరో మగవాడిని జీవితంలోకి ఆహ్వానించగలదా?"

    "మొన్నంటే?" తనలో కలిగిన కలవరం పైకి వ్యక్తం చేయకుండా అడిగాడు.

    "మంగళవారం సాయంత్రం!"

    స్వప్న ఆరోజు ఇంటికి వచ్చి తలకు గుడ్డచుట్టుకు పడుకోవడం గుర్తువచ్చింది మాధవ్ కి. ఆమె కళ్లు జ్యోతుల్లా ఎర్రబడడంకూడా గుర్తుంది. అయితే ఆరోజు స్వరూప్ కలిశాడన్నమాట స్వప్నకి! ప్రియుడు కనిపించగానే పక్క ఎక్కిన స్వప్నను ఏమనుకోవాలి? ఇక్కడ వీడు ప్రేయసికి దూరమై పిచ్చెక్కి పోతూంటే అక్కడావిడ వీడి ఊహలతో విరహబాధ పడుతూన్నట్టుంది.

 Previous Page Next Page