"బావా! తెనాలి రామలింగడు ఆవుని పెంచటం కథ తెలుసుగా! అందరూ పాలుపోస్తారు. మధ్య మన నీళ్ళు కలిసిపోతాయనుకోవటం - దానికిది వ్యతిరేకం - రైల్లో రోజు వందలకొద్దీ ప్రయాణిస్తారు. బస్సులోనే అంతే! సినిమా హాళ్ళయినా అంతే! అయినా ఎవరి టికెట్ వాడిది. ఎవడి సీట్ వాడిది!"
రవి జాలిగా చూశాడు. "సరితా! ఇక్కడ తలదాచుకుందుకి యీ యిల్లు వుంది - పిన్ని పండించే కూరగాయలు అంతో యింతో తిరిగిపెడతాయ్. వీటిని విడిచేసి వెళితే అక్కడ ఉండటానికి యిల్లు వుండదు. తినటానికి తిండి వుండదు. అంతే!"
"పోనీ ఓ పనిచెయ్ బావా!"
"ఏమిటి! ఇంకో ఊహనా!"
"ఆఁ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీంక్రింద పాడిపరిశ్రమ పెట్టు. లేదా ఫాల్ట్రీ పెట్టు"
"ఆ పనులన్నీ ఎవరు చేస్తారు?"
"కూలీలు - నీతోపాటే నలుగురు బ్రతుకుతారు."
తలూపాడు రవి.
హఠాత్తుగా అడిగింది మళ్ళీ "మొన్న ఏదో ఖాళీ పడిందని వెళ్ళావే! ఏమైంది?"
"అది రిజర్వ్ డ్ వాళ్ళకే - కేండిడేట్ లేడని పోస్టు అలాగే పెట్టేశారు. మన జిల్లాలో వంద పోస్టులున్నాయట అలా ఖాళీగా!"
"బావుంది! అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అని ఎవరు బావా గవర్నమెంటుకి ఈ అయిడియా యిచ్చింది. కేండిడేట్స్ వస్తే వాళ్ళకి ఉద్యోగం యివ్వటంలో ధర్మం వుంది. తరతరాలుగా వాళ్ళని నెగ్లెట్ చేశారని - ఏదో చెయ్యాలనుకోవటం మంచిదే కానీ యిది పద్ధతి కాదు బావా!"
"సరితా! మనకి రాజకీయాలొద్దు - అవి అన్నీ పాలసీ మేటర్స్ - ఓట్లకోసం పుట్టిన సూత్రాలు!"
"ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి!" అంది నిరాశగా.
రవి నవ్వేడు.
కొన్ని క్షణాలు మళ్ళీ నిశ్శబ్దంలో కలసిపోయాయి.
సుబ్బమ్మగారు వచ్చి వంటైంది భోజనానికి రమ్మని కేకేసింది. ఇద్దరూ నిశ్శబ్దంగా వెళ్ళి మౌనంగా భోజనంచేశారు. దొడ్లో కాసిన కూరలు, పెంచిన ఆకుకూర, పులుసుకూర, చిక్కటి మజ్జిగ-తృప్తిగా భోజనం చేసింది సరిత.
వెళ్ళబోతూ ఓ లాటరీ టికెట్ యిచ్చింది సరిత.
"ఇదెందుకే? నాకేం ఆశల్లేవు!" నవ్వుతూ అందామె.
"అత్తయ్యా! మనవాళ్ళు ఏ పుట్టలో ఏ పామువుందో అనేవాళ్ళు వెనుకటికి. ఏ నెంబర్లో ఏ లాటరీ వుందో ఎవరికి తెలుసు! అత్తా! అదృష్టం అనేది చెప్పరాదు. హఠాత్తుగా వచ్చేస్తుంది!"
"మాటలు నేర్చిపోయావే!" కోడలి మాటలకి మురిసిపోయింది ఆమె. ముఖం నిండా నవ్వులు వెలిగాయి!
"ఏదయినా అంతే అత్తా! నువ్వు స్వంత అత్తివి, నేను కోడలిని అయివుంటే మనలో ఒకరిలో ఒకరికి లోపాలు కనిపించేవి! కన్నకొడుకులో అందం. వినయం కనిపించదు కానీ ఎదురింటి అబ్బాయిలో ఎక్కడలేని అందచందాలు, ముద్దు కనిపిస్తాయి అది అంతే!"
18
సీజన్ మార్పిడి తప్ప అన్ని రోజులూ సూర్యుడొకేలాగ ఉదయిస్తాడు ఒకేలాగ అస్తమిస్తాడు. అయితే మనుషులకి వాళ్ళవాళ్ళ అనుభవాల్ని బట్టి, అనుభూతుల్ని బట్టి ఉదయం అస్తమయంలాగా, అస్తమయం ఉదయంలాగా, ఉదయం ప్రభాతంగా ఉంటుంది.
ఆరోజు రవీంద్ర యింట్లో బాలభానుడు వెలుగు దోరగా వెలుస్తాడని అనుకోలేదు. పదిగంటలవేళ సరిత ఉరుకులు పరుగులతో వచ్చింది.
ఆ అమ్మాయి రిక్షానుంచి దూకేసినంత వేగంగా దిగి, పరుగెత్తి లోపలికి వచ్చేసింది "అత్తా!" అంటూ.
తనగదిలో మంచంపై పడుకుని దిగులుగా పైకి చూస్తోన్న రవీ, తన వంటగదిలో మండని పొయ్యి ముండని తిట్టుకుంటున్న సుబ్బమ్మగారు ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డారు.
"ఏమే! ఏమైంది!" అంటూ గాబరాగా బయటికి వచ్చింది.
"అత్తా! అత్తా!" సంతోషం, సంభ్రమం ముఖంనిండా పొంగిపొరలుతూ వుండగా పిలిచింది మళ్ళీ.
"నే నేనే! నేను మీ అత్తనే! ఇంతకీ ఏమిటి?"
"మరే! మరే! బావ ఎక్కడ?"
"హుఁ వారం తిరగలేదు కబుర్లు చెప్పి వెళ్ళి మళ్ళీ యింతట్లోనే ఏమిటీ ఈ హడావిడి!"
"హడావిడి కాదత్తా! శుభవార్త! శుభవార్త!" కొంచెం తగ్గిన ఆందోళనతో ఆయాసంతో అంది సరిత.
"ఏమిటి శుభవార్త? ఏమిటది?"
"ఉహూఁ అంత సులభంగా చెప్పను! మీరిద్దరూ ఉండాలి యిక్కడ! అప్పుడే చెబుతాను!"
"సరే! రవీ!" అంటూ పిలిచిందామె.
అరచెవిగా వింటున్న రవి గదివిడిచి బయటికి వచ్చాడు.
"హార్టీ కంగ్రాచ్యులేషన్స్! చేయందించు!"
సరిత చాచిన చేయినిచూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ గుంభనంగా, దూరదూరంగా వుండే సరిత చేయి కలుపమంటుంది అనుకున్నాడు.
"కలుపు బావా చెయ్యి!"
చేయి చాచాడు రవి.
ఊపేసింది సరిత.
ఆమె ఉత్సాహానికి అవధుల్లేవు.
"ఊఁ ఏమిటీ? ఆ సంబరం ఏమిటో చెప్పు?"
"బావా! జాగ్రత్తగా విను! హఠాత్తుగా విని గుండె దడ హెచ్చేను! మూర్ఛ వచ్చేను! నీకు లాటరీలో ఫస్ట్ ప్రయిజ్ వచ్చింది. ఇదిగో ఫలితాలున్న పేపరు" అంటూ జిప్ తెరిచి బాగ్ లోంచి తీసి పేపరు అందించింది.
ఒక్క క్షణం రవి కళ్ళు పేపరువెంట పరిగెత్తాయి. కంఠతా పట్టినట్టుగా ఆ నెంబరు బాగా గుర్తే! అండర్ లైన్ చేసి నేర్చుకున్న ఏనిమేషన్ లాగా ఆ నంబరు గుర్తొచ్చింది.
నిజం!
అతనికొక్క క్షణం తానున్న భూమి గుండ్రంగా తిరిగినట్లయింది.
"ఏమిట్రా అదంటున్నది నిజమేనా?" కంగారుగా, వణుకుతోన్న గొంతుకతో, అదురుతున్న గుండెలతో అడిగింది సుబ్బమ్మగారు. ఆమెకి అంతా మాయగా, విచిత్రంగా ఉంది.
తలూపేడు రవి!
"ఆఁ" ఆనందంగా కేకేసింది ఆమె. "మాస్టరుగారూ! ఏడుకొండలవాడా! వెంకట్రమణా! సూర్యనారాయణమూర్తి! ఎంత దయ స్వామి మీకు! దేవుడా ఎన్నాళ్ళకి కరుణించావయ్యా తండ్రీ" అంది ఆనందోత్సాహాలు నిండిన కళ్ళతో.
రవికదంతా కలలాగా వుంది.