"ఏం బావా!" నవ్వుతూ పిలిచింది సరిత.
"థాంక్యూ సరితా."
"థాంక్సెందుకు బావా! అది నా డ్యూటీ! భగవంతుడు నిన్ను లక్షాధికారిని చేయమనే నన్ను సృష్టించేడు! దట్సాల్."
"ఓసి నీ అసాధ్యాంకూలా!" నవ్వింది సుబ్బమ్మగారు.
"మరేమిటత్తయ్యా? మొన్న నేను ఏమన్నాను! అదంతే! మన మాటంటే ఎప్పుడో ఓసారి పేలిపోవాలసిందే? చూశావా నా నాలికిమీద మచ్చలు" నాలిక బయటపెడుతూ అంది.
"పోదూ బడాయి!" నవ్వుతూ అంది ఆమె.
"ఇంకేమిటి బావా! ఈ లక్షతో ఏం చేస్తావ్?"
ఇంకా సందేహంగానే వుంది అతనికి. ఒక్క నిమిషం ఏదో ఆలోచించి తన గదిలోకి వెళ్ళి ఆ లాటరీ టికెట్ చూసి తీసుకొనివచ్చి మరోసారి చూశాడు.
పకపక నవ్వింది సరిత! అది ధనలక్ష్మీ గజ్జల మ్రోతలా అనిపించింది రవికి.
"రవీ! ఆ టికెట్టిలాతే!"
రవి అందించగానే అది తీసికెళ్ళి దేవుడి అరలో స్వామి పాదాలముందు పెట్టేసింది. భక్తితో పదే పదే లెంపలేసుకుంటూ నమస్కారాలు చేయసాగింది.
"ఊఁ ఏమిటి బావా! చూశావా మన వాక్కు ఫలించింది. అబ్బ! ఎంత ఎగ్జియటింగ్ ఉంది! నేను అమ్మిన టికెట్లు నిన్ను లక్షాధికారిని చేసింది. ఏం బిజినెస్ పెడతావు బావా!"
"ఆలోచించనీ. ముందుగా దాన్ని బ్యాంక్ లో వేయాలి. ఫిక్స్ డ్ చేసినా ఏడాదికి పదివేల వడ్డీ వస్తుందేమో కదా!"
"బావా!" కళ్ళు చిట్లిస్తూ అంది. "నువ్వు సోమరిపోతువి కాకూడదు. ఏదయినా ఇండస్ట్రీ పెట్టు. డబ్బు పిల్లల్ని పెట్టాలి బావా. అప్పుడే దానికి సార్ధకత. బంగారం కొనేసి పెట్టినా రేటు పెరుగుతుందిలే అనుకోకూడదు తెలుసా?"
"సరితా! నన్ను పరుగు పెట్టించకు. ఆలోచించుకోనీ"
"బావా! లోకం జెట్ స్పీడుతో పరుగెడుతోంది. మనం దాంతోపాటే వెళ్ళాలి లేదా వెనుకబడిపోతాం అంతే!"
"ఎగ్రీడ్!" అన్నాడు నవ్వుతూ.
అంతలో ఎలా తెలిసిందో రవి ఫ్రెండ్స్ అంతా పోలోమంటూ వచ్చేశారు. అభినందనలు చెప్పారు. ఆకాశానికి ఎత్తేశారు. గిర్రున తిప్పేరు.
"ఒరేయ్ రవీ! నా మాటవిని బడ్డీకొట్టు పెట్టరా."
"ఒరేయ్ నీ బుద్ధి ఎప్పుడూ అంతేరా. నువ్వు పెట్టావు చాలదూ?"
"నీకేం తెలుసురా దాని మహిమా?"
"ఆహాఁ మహిమ తెలియవశమా."
"అయితే బుక్ షాపు పెట్టరా."
"వీడు చదువుతాడా? అమ్ముతాడా?"
"చదువుతూ అమ్మేస్తాడు."
"రేయ్! మిఠాయికొట్టువాడు తీపు తినరాదురా."
"బట్టలకొట్టువాడు గుడ్డలేసుకోడట్రా?"
"మందుషాపువాడు మందు కొట్టడట్రా?"
"అరే అరేయ్. ఇంట్లో మా అమ్మవుంది" అరిచాడు రవి.
కాకిగోల అణిగింది తాత్కాలికంగా.
"అయితే పబ్లికేషన్స్ పెట్టు"
"ముందు వాడి కవితా సంపుటం వేయాలా?"
"ఒరేయ్ నే చేయమంటున్నది బిజినెస్ రా. యద్దనపూడి నవల వేయమను కరెన్సీ వేసుకున్నట్టే."
"ఫ్రెండ్స్. నేను బిజినెస్ ఏది ప్రారంభించినా మీ అందర్నీ ఓ కమిటీగా వేసి మీ ఏకగ్రీవ తీర్మానాన్ని అమలు పెడతాను సరేనా?"
"థాంక్యూ" గొంతుకలన్నీ ఒక్కసారి లేచాయి.
చిరునవ్వు నవ్వేడు రవి.
"ఇదిగో రవీ. నువ్వు షాపింగ్స్ కాంప్లెక్స్ లో లాగా ఓ బడ్డీకొట్టు, ఓ బుక్ షాపు, ఓ కిరాణా కొట్టు, ఓ చిన్న ఫ్యాన్సీ షాపు పెట్టేయ్. ఏదయినా నష్టం వచ్చినా మరొకటి ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది."
"అన్నీ నష్టం వస్తే."
"నోర్ముయ్యరా అపశకునప్పక్షీ."
"ఆలూలేదు - చూలు లేదు, కొడుకుపేరు సోమలింగమట. అలావుంది మీ వ్యవహారం ముందు డబ్బు రానివ్వండి"
"నువ్వు మరీ వెధవ్వి. రాక ఎక్కడికి పోతుంది బ్రదర్. టికెట్టువుంది. రిజల్టు వుంది. ప్రభుత్వం గ్యారంటీ వుంది."
"నువ్వో వెధవ్వి ఉన్నావు."
"ఫ్రెండ్స్. మనం అందరం వెధవలం" రవి ఆర్ధోక్తిలో ఆగాడు.
"ఆఁ" అంటూ నోర వెళ్ళబెట్టారందరూ.
"లేదు-కాబట్టి ఇక చర్చ యింతటితో విరమిద్దాం."
ఫక్కున నవ్వేశారు అందరూ.
"బాబూ!" సుబ్బమ్మగారు పిలిచారు. రవి లోపలికి వెళ్ళాడు. ఓ నిమిషం తర్వాత అందరికీ టమోటా జ్యూస్ తెచ్చాడు.
"బ్రదర్స్. ఆనందం అందరం పంచుకున్నాం. ఇవి మా పెరట్లో కాసిన టమోటాల జ్యూస్. ఇదే ఆపిల్ జ్యూస్ అనుకుని తాగెయ్యండి" అందరికీ పంచిపెట్టాడు.
అమృతంలాగా ఉన్న ఆ పళ్ళరసం తాగేసి వెళ్ళిపోయారంతా.
"అమ్మయ్య - గాలివాన వెలిసింది" అంటూ వచ్చింది సరిత.
19
వాసన అన్నది సర్వసామాన్య పదం. అది చెడుకీ మంచికీ కూడా వుంది. దుర్వాసన ముక్కుపుటాల్ని బద్దలు కొడుతుంది. దుర్వార్త మనిషి పరువుని బద్ధలు కొడుతుంది.
అలాగే విశేషవార్త - అందునా ఒక అల్పజీవికి లాటరీలో లక్ష రావటం అందరికి ఆశ్చర్యంగా వుంది. అసూయగా వుంది. కవిగా కూడా అంతో యింతో కొందరికి వుంది.
"నాపేరు---" ఇంటిముందు కారు ఆగిన శబ్దం విని బయటికి వచ్చిన రవికి తన విజిటింగ్ కార్డు యిచ్చాడు అతను.
ఫుల్ సూట్ - చేతిలో పైపు తల్లి గర్భంలోనుంచే హుందతనం తెచ్చుకున్న వాడిలాగా వున్నాడు ఆ వ్యక్తి.
"నమస్తే!" వినయంగా అన్నాడు రవిని.
"నేను మీ యింట్లోకి రాలేను!"