Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 24


    బుంగమూతి పెట్టింది సరిత. "బావా! చూస్తోండు. ఎప్పటికైనా నీకు లాటరీలో ప్రయిజ్ వస్తూంది!"
    "ఎంత?"
    "ఎంతయితేనేం బావా! డబ్బు డబ్బే!"
    "ఓ లక్ష!"
    "లక్షేమిటి? అక్కడ యు.పి. లో ఫస్టు ప్రయిజ్ పదిహేను లక్షలు!"
    "అమ్మో!" కళ్ళు విశాలమయ్యాయి.
    "అవును బావా! ఆశిస్తే అలాగే ఆశించాలి! చూడు లక్ అంటే ఎంతయినా లక్కే! కోరేది హయ్యెస్టు కోరదాం! యూనివర్శిటీ ఫస్టు కోరకుండా ఒట్టి ఫస్టుక్లాస్ కోరతారా ఎవరయినా!"
    పకపక నవ్వేడు రవి.
    "ఏం?"
    "అసలు పాసవుతానా అనుకునేవాడికి---"
    "బావా?"
    "ఏం మరదలా?"
    "కోరికలు ఎప్పుడూ గొప్పగా వుండాలి తెలుసా?"
    "కోరికలే గుర్రాలైతే---"
    "ఆకాశందాకా ఎగరొచ్చు!"
    "చప్పున నేలపడనూ వచ్చు!"
    "అలాగే స్వర్గానికి ఎగర్లేమా?"
    "ఇదిగో సరితా! ఈ భూమ్మీద లేని సుఖాలు యింకెక్కడా లేవు."
    "ఎలాగా?"
    "చెప్పనా? సపోజ్ పాతాళానికి వెళదామనుకో... అక్కడంతా నాగలోకం కాబట్టి పాములే! పేరుకి భోగాలే అయినా వాళ్ళ తిండేమిటి గాలి --- అదేగా? నిధి నిక్షేపాలకి నిలయమే అయినా - రత్నాలు పడగల్లో పొదుక్కున్నా - బుస్ - బుస్ మంటూ ఊదుకోవాలి - అంతేనా?"
    విరగబడి నవ్వింది సరిత "ఊఁ ఇంకా?"
    "ఇక స్వర్గం విషయం తీసుకుందాం. వాళ్ళకి మంచి నీళ్ళు లేవు గంగానది పారుతోన్నా దప్పికయి చావదు కదా! ఆకలి లేదుకదా! అమృతం తాగి చచ్చారు కదా! ఇక తిండి మన యజ్ఞాల్లో స్వాహా అని యింతపడేస్తే తప్ప దిక్కులేదు. అదీ ఎటిండెన్సులో నుండి ఎవరిపేరు పిలుస్తారో అన్నట్టుగా క్యూలో నుంచుని చావాలి-మనం కిరసనాయిల్ కి క్యూలో నుంచున్నా షూరిటీ వుంది దొరుకుతుందని - ఏదీ వాళ్ళకి గ్యారంటీ ఏది! ఈ మధ్య యజ్ఞయాగాదులు బొత్తిగా శూన్యమయిపోయాయి కదా!"
    "ఊఁ ఇంకా---"
    "మనం రకరకాల గుడ్డలు కట్టుకుంటున్నాం - ఆ సుఖం వాళ్ళకెక్కడిది?"
    "అదేం?"
    "నాగలోకంలో అసలు ఆ ప్రశ్నేలేదు. ఇక స్వర్గంలో బట్టల విషయం తెలుసుగా --- దేవతావస్త్రాలు! కావాలా నీకు?"
    ఆ జోక్ కి సరిత ముఖం ఎరుపెక్కి సిగ్గు నరనరానా యింజక్టు అయినట్టుగా బుగ్గలు కందిపోయాయి.
    "ఇంకా చెప్పాలా."
    "అక్కర్లేదులే!"
    "ఊఁ ఇంకేమిటి విశేషాలు?" నవ్వుతూ అడిగాడు.
    "ఒక ఊళ్ళో నేను అమ్మిన టిక్కెట్టుకి యాభయ్ వేల రూపాయల ప్రయిజ్ వచ్చింది. అతను ఎలిమెంటరీ స్కూలు టీచరు. ఆ సమితి ప్రెసిడెంటు టికెట్టు యిచ్చెయ్ బ్లాక్ మనీ యిస్తానన్నాడట! చాదస్తుడు ఊఁ అంటే సరిపోయేది ఊహూఁ అన్నాడు. బేరం లక్షదాకా వెళ్ళింది. ఊహూ అంటే ఊహూ అన్నాడు."
    "ఊఁ మరేం జరిగింది?"
    "ఏం జరుగుతుంది?" ట్రెజరీలో సబ్మిట్ చేయటానికి వెళుతుంటే ముసుగువీరులు చావదన్ని కళ్ళు మూసు లాక్కెళ్ళారు---ఏం చేస్తాడు? చచ్చినట్టు నోర్మూసుకుని తిరిగొచ్చాడు. మనోవ్యాధితో మంచంపట్టి వారం తిరక్కుండా చచ్చాడు. సంతాప సభలో ప్రెసిడెంటుగారు పదివేలు విరాళం యిచ్చారు. ప్రజలంతా ఆయన ధర్మబుద్ధిని కొనియాడారు. కథ పత్రిక్కి మనం ఇంటికి.
    రవి ముఖంలో విషాదం తారట్లాడింది.
    "ఏమిటి బావా?"
    "చూశావా! నీ లాటరీ ఓ మనిషి ప్రాణాల్ని బలి తీసుకుంది"
    "హుఁ ఈ దేశంలో తిండిలేక, రక్షణలేక, వైద్యంలేక ప్రతిరోజూ ఎందరు చస్తున్నారో తెలుసా బావా నీకు? అలాటి చావుల్లో యిదీ ఒకటి. అంతే!"
    రవి మాట్లాడలేదు.
    "సర్లే! యింకేమిటి కబుర్లు - ఆమధ్య బట్టల కొట్లో ఉద్యోగం చేశావటకదా!"
    రవి తలూపాడు.
    "ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళు. మానేశావేం?"
    "మానెయ్యలేదు. తీసేశారు!"
    "మంచిపని చేశారు. లేకపోతే నువ్వేమిటి? బట్టలకొట్లో ఉద్యోగమేమిటి? ఏ టెన్ తో తప్పినవాడో చేయాల్సిన జాబ్ అది!"
    "సిరతా ఈ రోజుల్లో చదువుకి విలువలేదు. డిగ్రీలున్న వాళ్ళు క్లీనరుగా సర్వర్లుగా పనిచేస్తున్నారు!"
    సరిత మాట్లాళ్ళేదు.
    "మనిషి బ్రతకటమే ఒక ప్రాబ్లం అయిపోయింది!"
    "ఏం లేదు బావా! ఇదంతా మిడిల్ క్లాస్ థియరీ - ఈ మధ్య తరగతి పట్టణాల్లోనే ఈ బాధలన్నీ - అదీ నీలాంటి నాలాంటి వారికే. రిక్షా లాక్కూనే వారికి మూటలు మోసుకునే వారికి యీ చింతలేదు. రోజుకి పది రూపాయల గిరాకీ వస్తే చాలు - అద్దెకి ఖర్చుకి పోగా యింటికి అయిదో ఆరో తీసికెళితే చాలు అనుకుంటారు. పల్లెల్లో మరీ! ఒక రోజు కూలి దొరికి - మూడు రూపాయలు చేతికొస్తే చాలు. అదే గొప్ప అనుకుంటారు. ఒక యింట్లో అయిదుగురున్నారనుకో - వాళ్ళకి ఆ డబ్బు చాలు అనిపిస్తుంది."
    "పద! అయితే పల్లెకే వెళ్ళిపోదాం!"
    "అది నీతో నాతో కాదులే!"
    "ఎందుకు?"
    "అక్కడికి వెళ్ళినా నువ్వు కూలీకి వెళ్ళలేవు!"
    నవ్వేడు రవి.
    "బావా! నువ్వు యిక్కడ వుండ తగవు."
    తెల్లబోయాడు రవి "అదేం?"
    "అదంతే! విజయవాడ చెక్కెయ్! లేదా హైదరాబాద్ లేదా మద్రాసు - అంతే! అక్కడ బ్రతకటానికి ఎన్నో మార్గాలు---"
    "ఏదో ఒక మార్గం చెప్పు."
    "ఏ ప్రెస్సులోనయినా ప్రూఫ్ రీడరుగా చేరొచ్చు! దాంతో కొంత వస్తుంది. కథలు, నవలలు రాయటం మొదలుపెడితే ఏకంగా ప్రెస్సులోనే యివ్వచ్చు. అదీ కొంత---"
    "సరితా! ఆ ఊళ్ళలో నాలాటి వాళ్ళు లేరంటావా!"

 Previous Page Next Page