"ఏం తీసుకుంటారు!"
ఆమె మామూలుగా అడిగినా అతనికి స్టెయిలిష్ గా ప్రశ్నించినట్టు అనిపించింది. "ఏమీ వద్దు!" అన్నాడు నవ్వుకున్నాడు.
ఎదురుగా వున్న టేబిల్, దానిపై క్లాత్, వాటిమీద అందంగా అమర్చివున్న పుస్తకాలు, దానిపైన్నే రాక్, ఓ మూల టైం పీస్ టిక్---టిక్--- మంటూ. ఇలా ఇన్ని సౌకర్యాలు వుంటే వద్దన్నా వస్తుంది చదువు అనుకున్నాడు.
బెల్ నొక్కింది రాజ్యలక్ష్మి. మరో రెండు నిమిషాలకి యింటి పనికుర్రాడు రాగానే "రెండు కాఫీ! పట్రా!" అంది. వాడు తలూపి వెళ్ళిపోయాడు.
"చెప్పండి!" అంది నవ్వుతూ.
రవికి ఎందుకో తెలియని కసి ఏర్పడింది. మనస్సులో తనకి లేనిదే కాక, ప్రపంచంలో తనలాటి కోట్లాది మనుష్యులకు లేనిదంతా ఇలాటి వాళ్ళు దోచుకోవడం వల్ల, దాచుకోవడం వల్ల ప్రపంచం ఇలా తయారైపోయింది అనుకున్నాడు. అతనిలో ఆమెని ఏడ్పించాలనే ఊహ మెదిలి, అది గట్టి పడింది.
చప్పున జేబులోంచి తను సమద్ వద్ద కొన్న వస్తువు తీసి గుప్పిట్లో పట్టుకున్నాడు.
"ఏమిటి?" మళ్ళీ నవ్వుతూ అడిగింది.
"నీ చేయి యిలా యివ్వు!"
"ఎందుకు?" చాస్తూ అడిగింది.
చప్పున చేయి తెరిచాడు.
అది చూసి రాజ్యలక్ష్మి తెల్లబోయింది.
చప్పున చేయి లాక్కోబోయింది.
ఆమె ముంజేయి పట్టుకున్నాడు రవి.
అతని స్పర్శకి ఆమె శరీరం పులకరించింది.
అతను రాఖీ అందుకున్నాడు.
"రాఖీ..."
"అవును!" అంటూ కట్టబోయాడు.
విదిలించుకుంది రాజ్యలక్ష్మి. ఆమె తీవ్రంగా చేయి లాగేసరికి యదాలాపంగా పట్టుకున్న అతని చేయి పట్టు విడిచింది.
ఆమె ముఖం సిగ్గుతో, కోపంతో ఎర్రబడింది. "రాఖీ కడతావా!" అని అడిగింది. ఆమె కంఠం కూడా కోపాన్ని ప్రకటించింది.
"ఊఁ" ఎక్కడినుంచో పలికినట్టయింది శబ్దం.
"ఛీ! రాఖీ ఎవరికి కడతారో కూడా తెలియదా!"
"తెలుసూ - తెలిసే కట్టాలని వచ్చాను"
తెల్లబోయింది ఆమె.
"నా మనస్సులో ఉన్న ఆలోచన---"
"స్టాపిట్ - లెట్ యువర్ ధాట్ గో టు హెల్! ఏమనుకుంటున్నావు నువ్వు. నన్ను అవమానించాలనే ఉద్దేశపూర్వకంగా వచ్చావా! ప్లీజ్ రిమెంబర్ - నీ ఆలోచన ఎప్పటికీ నెరవేరదు."
పాలిపోయిన ముఖంతో బలహీనంగా నవ్వేడు అతను.
"ఇంతదాకా నా మనస్సులో నీపై ఎలాటి ఊహ లేదు. ఏదో అభిమానం తప్ప మరో ఆలోచన లేదు. కానీ యిప్పుడు చెబుతున్నాను విను. నేను నిన్ను పెళ్ళిచేసుకుంటాను."
"పెళ్ళా?" తెల్లబోయాడు రవి.
"అవును! ఏం? నేను నీకు తగనా?" కోపంగా అడిగింది.
అతనేం మాటాడలేకపోయాడు.
"నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో ఎప్పుడు చేసుకుంటానో---"
"మంగమ్మలా ప్రతిజ్ఞ చేస్తున్నావా?" హేళనగా అడిగాడు ఆమె మాటలకి అడ్డేస్తూ.
"ప్రతిజ్ఞ కాదు - పట్టుదల - నేను నిన్ను అభిమానించాను. ఆరాధించాను. అందులో స్వార్ధంలేదు. మరో ఉద్దేశ్యమూ లేదు. కానీ నువ్వే నన్ను రెచ్చగొట్టినట్టుగా మాటాడావు నన్ను రాఖీ కట్టి అవమానించాలనుకున్నావు. అది నీ అహంకారం నువ్వు తెలివిగలవాడివి, కవివి! కానీ మనిషిని అర్ధం చేసుకోలేకపోయావు"
"రాజ్యలక్ష్మీ..."
"ఊరికే అరవకండి! ఏ వుద్దేశ్యం లేని నాకు ఏవో భావాలు అంటగట్టి నన్ను అవమానించారు. అందుకే యిప్పుడు ఈ క్షణంలో నా మనసులో ఏర్పడిన భావాలు మీకు వెల్లడించాను."
అతనేం అనలేదు.
"రాజ్యలక్ష్మీ అని పిలుస్తోన్న మీతోనే రాజూ అని పిలిపించుకుంటాను. రాఖీ కట్టబోయిన మీ చేతులతో తాళి కట్టించుకుంటాను. చూస్తూ వుండండి. ఈ భవంతి నుండి ఆ పాత యింటికి నేను రావటమో--- ఆ యింటి నుంచి మీరు యిక్కడికి మకాం మార్చెయ్యటమో తప్పదు---"
అతని ముఖం ఎర్రబడింది. "థాంక్స్!" అని యింకేం మాటాడకుండా విసవిసా వెళ్ళిపోయాడు.
అలాగే చూస్తూ వుండిపోయిన రాజ్యలక్ష్మి కుర్రాడు కాఫీ తెచ్చేదాకా ఈ లోకంలోకి రాలేదు. వాడు టేబిల్ పై కప్పులు పెట్టేసి వెళ్ళగానే తనే రెండు కప్పులూ తాగింది.
17
మనస్సుకి గాయం తగిలితే అది అంత సులభంగా మానదు. చేసేదేం లేదు. కొన్ని జబ్బులకి కలమే మందు. అలాగే అనుభవించటం తప్ప మార్గంలేదు. బాధపడినా, భయపడినా ఫలితం మాత్రం శూన్యమే!
మనస్సు ఎడారిలాగా అయిపోయిన సమయంలో తొలకరి చినుకులాటి ఏ ఒక్క చిన్ని పలుకు అయినా అది ఎంతో హాయిగా వుంటుంది.
ఆరోజు నుంచీ రవి మనస్సుకొంత స్తబ్దతలో పడిపోయింది. చదువుకోవటంలో తప్ప మరో ఆనందం కనిపించటంలేదు. సుబ్బమ్మగారే గుళ్ళా మళ్ళా పది ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తూ వుంది. తొలకరి చినుకుల ధర్మమా అంటూ పెరట్లో కూరగాయలు బాగానే కాస్తున్నాయి. అప్పుడు నాటిన మొక్కలు తర్వాత వర్షాలు బొత్తిగా ఎగబెట్టినా ఫలాన్ని మాత్రం బాగానే యిస్తున్నాయి.
హఠాత్తుగా సరిత ప్రత్యక్షమైంది ఓరోజు.
సరిత వచ్చిందంటే ఉత్సాహం దూకుతూ వచ్చినట్టే.
"హాయ్ బావా ఏమిటి విశేషాలు?"
కొందరి ప్రకృతే అంత. అద్దంలా స్వచ్ఛంగా నిర్మలంగా వుంటారు. ఎదుటి వాళ్ళనీ అలాగే వుంచేస్తారు. సరితని చూడగానే నెలలకొద్దీ ఘనీభవించిన మంచు సూర్యుడి కిరణాలకి తప్తమై ప్రవహించినట్టు యిన్నాళ్ళు స్తబ్దంగా వున్న రవిలో చైతన్యం కదలాడినట్టయింది.
"హాయ్ సరితా!"
"ఊఁ లాటరీ తగిలినట్టుందే!"
"నీచేతి మాత్ర వైకుంఠయాత్ర అన్నట్టు నీవద్ద టిక్కెట్టు కొనటం మళ్ళీ లాటరీలో తగలటమా!"