"అయినా సరే నేను ఆ పది పర్సెంట్ లోనే చేరతాను."
ఇప్పుడు సమేద్ నవ్వేడు.
"అప్పుడే రాఖీ వచ్చిందా?" కంకణాలని చూసి అడిగాడు రవి.
"ఒకటివ్వు" అన్నాడు మళ్ళీ.
"ఈ రోజే పూర్ణిమ!"
సమద్ మాటలు విని నవ్వుకున్నాడు రవి! తను హిందువు - తనకి యీ రోజు తిధి తెలియదు. సమద్ ముస్లిమ్. అయినా తిధి వారాలు తెలుసు. కాలం ఎంత మారిపోయింది?
"ఎవరికి కట్టాలి?"
"ఆడవారి చేతికి!" గంభీరంగా అన్నాడు రవి.
"తెలుసులే భాయ్!" నవ్వుతూ అన్నాడు సమద్.
"దీని ఖరీదు---"
రవి మాట పూర్తి కాకముందే "ఉండనీ - నీకు జాబ్ వచ్చాక యిద్దువు. ఖాతా రాసుకుంటా!" అన్నాడు నవ్వుతూ.
"అయితే నీ డబ్బులు వసూలు కావు-"
"ఏం?"
"నాకు యిప్పట్లో ఉద్యోగం రాదు..."
"బ్రతికించావ్ - ఎప్పటికయినా వస్తుంది కదా?"
"ఊహూఁ యప్పుడు రిజర్వేషన్ ల వల్ల రాదు. మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే ఏజ్ బారవుతుంది. నేను ఎంతగా తిట్టుకుని శపిస్తాడో తెలుసా?"
నవ్వాడు రవి మాటలకి. "రవీ! ఎప్పుడో విన్నట్టు గుర్తు! కాళిదాసో, భారవో మరెవరో గొప్పవాళ్ళే చెప్పారట - కాలం అనేది బండిచక్రంలాంటిదని ఒక ఆకు పైకి వెళితే మరో ఆరు క్రిందికి వెళుతుంది. అది సహజం..."
సిగ్గుపడ్డాడు రవి. సమద్ క తెలిసిన విషయాలు తనకి చాలా తెలియవు అనుకున్నాడు.
"ఎక్కడిదాకా?"
"దార్లో ఏదయినా అదృష్టం కనిపిస్తే పట్టిద్దామని!"
"అదృష్టమంటే ఈ రోజుల్లో అన్యాయాలే! అంతే!"
"అయితే నాకు అక్కర్లేదు!" అని రాఖీ జేబులో వేసుకుని కదిలాడు ముందుకి.
* * *
యదాలాపంగా నడుస్తూన్న రవి అనుకోకుండా రాజ్యలక్ష్మి వాళ్శింటి ప్రాంతానికి వెళ్ళేడు.
రాజేశ్వరరావుగారింటి ముందు హఠాత్తుగా ఆగాడు.
అతని మనస్సులో ఏదో ఊహ హఠాత్తుగా వెలిగింది. రాజ్యలక్ష్మి కనిపిస్తుందేమోనని అక్కడే ఆగి ఎదురు చూడసాగాడు. ఆలోచనలు పరిపరివిధాల పరిగెడుతున్నాయి ఇలా చెప్తే - భలే! అనుకున్నాడు.
అతని నిరీక్షణ ఫలించింది.
కారిడార్లో ప్రత్యక్షమైంది రాజ్యలక్ష్మి.
రోడ్డుపై నుంచుని తమ బిల్డింగ్ వైపే చూస్తోన్న రవిని చూడగానే ఆమె ముఖం వికసించింది. గబగబా మేడదిగి, వాన్ దాటి, గేటుదాటి వచ్చింది.
"అలా నుంచున్నారేమిటి? లోపలికి రండి!" అంటూ సంభ్రమంగా పిలిచింది.
మృదువుగా నవ్వేడు రవి.
"లెటజ్ గో!" అంది మళ్ళీ.
ఆమెని అనుసరించాడు రవి.
తొలిసారిగా ఆ ఖరీదైన భవనంలోకి అడుగుపెడుతూ వుంటే అతనికి శరీరం పులకరించినట్టయింది.
పాలిష్ స్ రాళ్ళతో అందంగా, శుభ్రంగా, నున్నగా వున్న నేల... డిస్టెంబర్ వేసిన గోడలు... తెరలు వేసిన కిటికీలు, వాకిళ్ళు, గోడలకి నిలువెత్తు ఛాయాచిత్రాలు... ఎప్పుడూ మందంగా వెలుగుల్ని చిమ్ముతున్న నీలిబల్బులు.... రాజభవనంలా అనిపించింది అతనికి.
హాలులో ఓ మూలగా వున్న మెట్లమీదుగాపైకి వెళ్లేరు. మెట్లమీద, పైన కారిడార్ లో ఖరీదైన కార్పెట్ --- రెండు గదులు దాటి మూడో గది ముందు నుంచుని "ఇదే నాగది! లోపలికి రంజి!" అంది నవ్వుతూ.
ఒక్కక్షణం అతని గుండెలు టపటప కొట్టుకున్నాయి, బలహీనమయిన పక్షి రెక్కలకిమల్లే.
డోర్ కర్టెన్ కి పక్కకి తప్పించింది.
అతను లోపలికి అడుగుపెట్టాడు.
ఓ వారగా ఖరీదైన చెక్క చేప మంచం ... దాని మీద డన్ లప్ పరుపు, దోమతెర... నీలి బెడ్ షీట్... మడిచిన దుప్పటి చూసింది క్షణమే అయినా మనస్సులో ముద్రపడిపోయాయి.
"కూర్చోండి!"
కుషస్ కుర్చీలో కూర్చున్నాడు.
మంచినీళ్ళకి అయిదు మైళ్ళు వెళ్ళి వందగజాల లోతు బావిలో నీళ్ళు చేదుకుని తెచ్చుకునేవాడు. సముద్రాన్ని చూసినట్లుగా వుంది అతనికి.
ఎంత భోగం అనుకున్నాడు.
తనూ మరో కుర్చీలో కూర్చుంది.
మెత్తగా హాయిగా వుంది కుర్చీ తలెత్తి చూశాడు. ఎదురుగా గోడకి రెండు పటాలున్నాయి. అలాఅలా చూస్తే ప్రతిగోడకీ తగిలించి వున్నాయి. చిత్రపటాలు అందానికి అందం, రమ్యతకి రమ్యత - మంచి టేస్టే అనుకున్నాడు.