"కానీ తిరగబడాలమ్మా! ఈ పర్యాయం వస్తే-"
"నేనే ముఖాన పేడనీళ్ళు కొడతాను!"
"నాకు ఆ సన్మానం వాళ్ళు దగా చేసినా బాధపళ్ళేదు. డబ్బు యిచ్చినట్టు నటించారే తప్ప- సన్మానమూ, సత్కారమూ గొప్పగా చేశారు. అది ఆర్ధక విషయం అని సరిపెట్టుకున్నాను-"
"వాళ్ళూ దోషులే రవీ!"
"కావచ్చు! కానీ యిది ఏరు దాటి తెప్ప తగలేసేరకం అమ్మా! ఇలాంటి వాళ్ళని సహించకూడదు. ఇతర్లని చదరంగంలో పావుల్లా వాడేస్తారు---
అతని మనసులోని వ్యగ్రతని గమనించి మనస్సుని మార్చాలని "మళ్ళీ మాటాడుకుందాం! అవకాశం రాకపోదు! మళ్ళీ రాదా! చెప్పానుగా పేడనీళ్ళు ముఖాన చల్లుతానని- ముందు భోజనం చేద్దువు పద!" అంది.
"నాకు భోజనం మీద రుచి పోయిందమ్మా---"
"రవీ! అలా అనకూడదయ్యా!"
"ఆ మాటకి వస్తే నాకు బ్రతుకుమీదే రుచి పోయిందమ్మా!"
నిరాశగా అతననేసరికి షాకయింది సుబ్బమ్మగారు. "రవీ" అంది గాబరాగా.
"దారిలో వస్తూ స్టేషన్ లో ట్రయిన్ క్రింద పడదానూ అనిపించింది. మళ్ళీ ఏట్లో దూకేద్దాం అనిపించింది. ఆఖరికి ఏ లారీక్రిందో బస్సు క్రిందో పడి పోదామనిపించింది- కానీ---"
"రవీ- ఆత్మహత్య మహా పాతకం!"
"అందుకేనమ్మా తాత్కాలికంగా వాయిదా వేశాను!"
"రవీ- చావుని అలా ఎప్పుడూ వరించకూడదు---"
"కూడక- బ్రతుకులో ఏం తీపి వుందమ్మా? చూస్తున్నావుగా- బాల్యం అలా- యవ్వనం అలా- చదువులో అలాగా- ఉద్యోగం ప్రయత్నంలో ఇలాగా- అన్నిట్లో దెబ్బలే! అంతా ఎదురుపోట్లే- ఎన్నాళ్ళమ్మా ధైర్యం- ముసురుపడితే- చీకటి కమ్ముకుంటే- మళ్ళీ సూర్యుడు వస్తాడనే ధైర్యం నమ్మకం వుంటే ఫర్వాలేదు- కానీ శాశ్వత ప్రళయంలాంటి బ్రతుక్కి వెలుగెక్కదమ్మా!" ఆవేశంగా అన్నాడు రవి.
నిట్టూర్చింది ఆమె. అతనిలో నైరాశ్యం తగ్గిందనీ దాని స్థానంలో ఆవేశం చోటుచేసుకుందనీ గ్రహించుకుంది. అందుకే అంది "ఏదీ శాశ్వతంకాదు. కష్టాలెప్పుడూ ఉండవు. చీకటి కొన్నాళ్ళు- వెలుగు కొన్నాళ్ళు-"
ఆమె మాటలు పూర్తి కాకముందే "హుఁ ఆఁ ఆశే లేకపోతే యీ రోజు యింటికి తిరిగి వచ్చేవాడిని కాదమ్మా! రేపు నా చావు తెలిసేది నీకు---" అన్నాడు.
"ఆ ఊహే మంచిది కాదు రవీ. చచ్చి ఏం సాధించగలం చెప్పు- బ్రతికి వుండిన సుఖములు పడయవచ్చు- అదీ మన సిద్ధాంతం!"
నవ్వాడు రవి! "వెర్రి తల్లీ!" అనుకున్నాడు. బ్రతికి వుంటే అన్ని కష్టాలే! అన్నీ చిక్కులే! అన్నీ బాధలే అని చెప్పాలనిపించింది. కానీ ఆమెని నొప్పించదలుచుకోక మౌనం వహించాడు.
"పద భోజనం చేద్దాం!"
"నాకు బొత్తిగా ఆకలి చనిపోయిందమ్మా"
"మాట చూడు ఎంత నీరసంగా వస్తోందో! శరీరాన్ని కష్టపెట్టకూడదు రవీ! మంచి అయినా చెడు అయినా భవితవ్యాన్ని అనుభవించేందుకు ఈ శరీరం వుండాలి! తప్పదు!" అంది.
నిట్టూర్చాడు రవి. "ఏముంది బ్తుకులు! అన్నీ నిట్టూర్పుల మయం!" అనుకున్నాడు.
మెల్లిగా తల్లిని అనుసరించాడు.
పెరట్లోకి వెళితే శ్రావణ మేఘాలు ఆకాశం నిండా అల్లీ బిల్లీ ఆడే అమ్మాయిల్లా గుంపులు గుంపులుగా వున్నాయి. సమ్మెకట్టిన ఎన్.జీ.వో. లాగా గాలి కదలటం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ వాళ్ళు బంద్ పాటిస్తోన్నట్టుగా చుక్కలు మినుకు మినుకు మనటం లేదు. అవి ఘెరావో చేసినట్టుగా చంద్రుడు ఎక్కడో దాక్కున్నాడు.
16
క్షణ క్షణ యుద్ధం.
దినగండం నూరేళ్ళ ఆయుష్షు అని ఓ సామెత వుంది. ఆయువేమో నిండు నూరేళ్ళు కానయితే ప్రతిరోజూ నూరేళ్ళు నిండుతాయా అన్నంత గండం. ఎందుకా గండాలు? ఎందుకా పూర్ణాయుర్దాయం. ప్రతిరోజూ ఎప్పుడు చస్తామో అన్నంత భయంతో బ్రతుకే ఆ బ్రతుకు ఎందుకు? భూమికి భారం ఇంటివాళ్ళకే భారం.
ఇప్పుడు రవి కుటుంబ స్థితీ అలాగే వుంది.
ఏపూట కాపూటే తిండికోసం వెతుక్కునే పరిస్థితి ఎంత ప్రయత్నించినా చిన్న ఉద్యోగమయినా దొరకలేదు.
ఓ రోజు సాయంకాలం తన ఫ్రెండ్ వద్దకి వెళ్ళేడు రవి.
సమద్ స్నేహ విచ్ఛలంగా ఆహ్వానించాడు.
"ఎలా వుంది?"
"బిజినెస్సా? బ్రహ్మాండంగా వుంది. సిగరెట్లు హానికరం అని ఎంతగా మొత్తుకున్నా జనం పట్టించుకోరు. రీలు పొడవునా అలసిన వేళల్లో మీకు కావలసింది ఫలానా సిగరెట్ అని హీరోని చూసినట్టుగా నిండు ఆరగ్యంగా, దర్జాగా, షోగ్గావున్న వ్యక్తిని చూసి, ఆఖర్న ఒక లైన్ సిగరెట్టు త్రాగటం హానికరం అంటే ఎవరు పాటిస్తారు. కళ్ళారా చూసిందే మనస్సులో నిలుస్తుంది కానీ-ఆ మాటకివస్తే దేశంలో చదువురాని వాళ్ళే ఎక్కువ- వాళ్ళసలు చదువుకోలేరు... కాబట్టి త్రాగే జనం వున్నన్ని రోజులు నా బిజినెస్ కి ఏం ఢోకాలేదు----"
నవ్వేడు రవి.
"నా మాట విను! బ్రతకటానికి సిగ్గుపడకూడదు. నువ్వు ఓ కిళ్ళీ కొట్టు ప్రారంభం చెయ్! రోజుకి వందరూపాయల సేలు గ్యారంటీ అందులో పదికి తక్కువ మిగలదు."
నవ్వేడు మళ్ళీ.
"పోనీ యింకో సులువైన మార్గం చెప్పవా?"
"వద్దంటే ఆగుతావా - చెప్పు!"
"మట్కా బుక్కర్ గా చేరిపో - లేదా ఓ నంబరు చూసి డబ్బుకట్టు - ఒకటికి ఎనభయ్..."
"ఛ! ఛ! ఎంతమంచి సలహా చెప్పావు - థాంక్స్!"
"ఎందుకా కోపం?"
"జూదం బ్రతుకు బ్రతకమంటావా నన్ను?"
"రవీ! ఒక మాట చెప్పనా? పాతికేళ్ళనాడు తాగుడు పెద్ద నేరం! ఈ రోజుల్లో చాలామంది తాగందే బ్రతకమనే స్థితికి వచ్చారు. అదో సోషల్ స్టేటస్ అయిపోయింది. పేక అనేది సామాన్యం! ఇక యిప్పుడు బ్రాకెట్ జోలికి వెళ్ళి దానికి అంటుకోని మనుషులు పది పర్సెంట్ కూడా వుండరు!"