పోలీసులు, ఉద్యోగులు, అధికార్లు, రాజకీయవేత్తలు ఎవరంతకు వాళ్ళే హడావిడిగా సీట్లు సర్దుకుంటున్నారు.
ఆఖరికి మంగళ వాద్యాలతో స్వాగతం పలికిన వాళ్ళనీ పిలుచుకెళ్ళారు. కానీ రవి అజా పజా కనుక్కున్న నాధుడే లేకపోయారు.
అతడికి ఉదయం నుంచీ లేని జఠరాగ్ని ఆ సమయంలో ఉవ్వెత్తుగా ప్రజ్వరిల్లినట్టెయింది. తన దౌర్ఖాగ్యానికి నిందించుకుంటూ శంకరానంద్ అవుపడతాడేమోనని అటూ యిటూ చూడసాగాడు.
అతని ఆచూకీ ఏమాత్రం కనిపించలేదు.
నిరాశా నిస్పృహలతో అలాగే పందిరి రాటికి ఆనుకుని ఉన్న రవికి అల్లంత దూరంలో కారెక్కుతున్న మంత్రిగారు కనిపించారు. ఆయన పలుకరిస్తారని ఆశించాడు తను.
పలుకరిస్తే --- హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలిసి ఏదైనా ఉద్యోగం చూపమని ప్రాధేయపడాలనుకున్నాడు రవి!
ఆయనేం రవిలా అనుభవ హీనుడా? చూసీ చూడనట్టుగా చూసి, రవి సమర్పించిన నమస్కారాన్ని కూడా స్వీకరించకుండా కారెక్కి కూర్చున్నాడు.
కారు కదిలింది.
ఆయనతోపాటే శాసన సభ్యులు వెళ్ళారు.
అధికారులూ, అనధికారులూ తమ తమ వాహనాల్లో ఎక్కేరు.
అప్పుడు కనిపించాడు శంకరానంద్.
ఆయన ఓ కారు ఎక్కేస్తున్నాడు. మరో వూళ్ళో మంత్రిగారి ప్రోగ్రాం వుంది. అక్కడిదాకా వెళితే తన అవసరాలు తీరొచ్చు అనుకుంటున్నాడు.
నమస్కారం చేశాడు రవి.
నవ్వుతూ చెయ్యివూపి కారెక్కేశాడు.
నిలువునా కూలిపోయాడు రవి. "ఇంత అన్యాయమా తనకి అన్ని మాటలు చెప్పి, ఆఖరికి భోజనం చేశావు అనికూడా అడగకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత అన్యాయం?" అనుకున్నాడు.
అంతా వెళ్ళిపోయారు.
కాళ్ళీడ్చుకుంటూ కదిలాడు రవి.
టి.బీ. గేటు దాటుతూవుంటే కాలికి ఏదో ఉండ తగిలింది. అప్రయత్నంగా వంగి అందుకున్నాడు.
విప్పిచూశాడు. ఖాళీ ఉండ! సన్మానం సమర్పించిన కాగితం!
"ఇదీ సన్మానాల పద్యాల విలువ!" అనుకుని నిట్టూర్చాడు రవి.
కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు. కాళ్ళు లాగుతున్నాయి. శరీరం తేలిపోతున్నట్టుగా వుంది. నడిచే ఓపిక బొత్తిగా లేనట్టు అనిపించింది. కానీ రిక్షా ఎక్కేందుకు కూడా ఠికాణాలేదు.
భోరున ఏడవాలనిపించింది అతనికి.
కానీ సంస్కారం. చదువు, నవనాగరికత అతన్ని ఏడవనివ్వలేదు. దిగాలుగా, నిరాశగా అలాగా యింటివేపు నడకసాగించాడు. అతనికి తన దౌర్భాగ్యంపై మొట్టమొదటి సారిగా అసహ్యంవేసింది.
15
యుద్ధంలో ఓడివచ్చిన వాడిలాగావున్న కొడుకుని చూడగానే సుబ్బమ్మగారి మాతృహృదయం ద్రవించి "ఏమైంది?" అనుకుంది.
నీరసంగా, నిస్సత్తువగా వచ్చిన అతన్ని చూసి "అలా వున్నావేం రవీ?" అంది ప్రేమగా.
మబ్బుపట్టిన ఆకాశంలో చల్లగాలి వీచినట్టయింది పిలుపు వేడనా శకలం కదిలింది.
"అమ్మా!" అన్నాడు కనుకొలనుల్లో నీళ్ళు నిలిచాయి అప్పటికే.
"ఏమైంది రవీ!" ఆదుర్దాగా అడిగిందామె.
ఆప్యాయతా, అనురాగం రెండూ దొరక్క ఆ పూటంతా అలమటించిన అతని హృదయం చప్పున కరిగిపోయింది.
"ఇక లాభంలేదమ్మా! ఈ సొసైటీలో బ్రతకటం చాలా కష్టం!" అన్నాడు పెదవి విరుస్తూ.
తొలకరి వేళలో ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అని వుండే మేఘశకలంలాగా వున్నాయి అతనికళ్ళు.
"ఏమైంది రవీ! ఏం జరిగింది! సభలో ఎవరయినా అవమానకరంగా మాటాడారా?" ప్రశ్నించింది ఆదుర్దా అంతా వెల్లడయ్యేట్టు.
"సభ జరిగేవరూ ఫరవాలేదమ్మా! సభలో కూడా గొప్ప గౌరవమే చేశారు బాగా మెచ్చుకున్నారు."
"మరి? తర్వాత..."
"తర్వాతేనమ్మా జరిగిందంతా! రవి అనే మనిషి అక్కడ వున్నట్టే మరిచిపోయారు తిన్నావా? తాగేవా ఆ కూడా అజా పజా కనుక్కోలేదు. ఏం మనుషులమ్మా?"
నిట్టూర్చింది ఆమె. ఆ మాటలు వినగానే. ఆమె మాతృహృదయం ద్రవించిపోయింది. "పద బాబూ! భోజనం చేద్దువుగానీ! మధ్యాహ్నంనే నొక్కత్తినేనని మీనాక్షమ్మగారు వంకాయ కూరా, మెంతిపప్పు తెచ్చి యిచ్చారు. కమ్మగా వున్నాయి!" అంది.
"ప్చ్! ఆకలి విషయం కాదమ్మా! ఒక్క పూటకి తిండి లేకపోతే చచ్చిపోతామా? శరీరం ఆయుస్సుని బట్టి, ఆయుస్సు ఆరోగ్యాన్ని బట్టి వుంటుంది. అంతేకాని అన్నంపై ఆధారపడి వుండదు. కానీ ఆ మనుషులి తత్త్వమే నాకు చాలా బాధాకరంగా వుంది!"
"లోకం తీరే అంత బాబూ!"
"లోకం రీతి అలా వుండకూడదమ్మా!"
"స్వార్ధం బాబూ! స్వార్ధం! అదే మనిషిని యిలా ఆడిస్తోంది!"
"ఏం మనుషులమ్మా! నా చుట్టూ అంతగా తిరిగాడా! అంతగా పొగిడాడా? అక్కడ ఏం టెక్కు చూపాడని! రాష్ట్ర ముఖ్యమంత్రో, దేశ ప్రధానో అన్నట్టుగా ప్రవర్తించాడు. ఆప్టరాల్ ఓ ఛోటా రాజకీయ ముర్ దారు. అంతేనా!"
ఆమె ఏమీ అనలేదు.
"నన్నెవరు పిలవమన్నారు? నాతో ఎవరు చాకిరీ చేయించుకోమన్నారు. నన్నెవరు ఆహ్వానించమన్నారు? ఎవరు తిరస్కరించమన్నారు. అతడికి నన్నలా పావులా ఉపయోగించుకునే హక్కు ఎవరిచ్చారమ్మా?"
"అధికారం బాబూ! వాళ్ళంతా వాటికి అలవడ్డారు. మనం అమాయకులం!" నిస్పృహతో అందామె.
"అమాయకులం కాదు. ఆట బొమ్మలం!"
"అంతే బాబు!"