Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 18


    "ఊఁ! అహఁ అదేంలేదు!" తడబడ్డాడు రవి
    "హమ్మయ్యా! బ్రతికించారు. నా ఉత్తరాన్ని సాంతం చదివారన్నమాట. మరి సమాధానం కూడా రాయలేదేమిటండీ?" నిష్ఠూరంగా అంది ఆమె.
    "లేదు! సన్మానానికి వెళ్ళొచ్చానుగా! ఆ పనిలో తీరికలేదు!"
    "అవును పేపరులో చూశాను! వెయ్యిన్నూట పదహార్లు యిచ్చారట కదా! హార్టీ కంగ్రాట్స్?"
    నవ్వాడు రవి. జరిగింది చెప్పాడు.
    "ఎంత దారుణం! వేదికపైన్నే కడిగెయ్యలేక పోయారా?" అంది ఉక్రోషంగా. ఆమెకి ఆశ్చర్యంగానూ వుంది. ఆవేదనగానూ వుంది.
    "ఎలా? అప్పుడు తెలియదుకదా! పైగా అదీ ఓ వ్యాపారంలాటిదై పోయింది. డబ్బుతో కీర్తిని కొనుక్కోవటం ఈ రోజుల్లో చాలా మామూలై పోయింది!"
    ఇంకేం అనలేదు రాజ్యలక్ష్మి.
    ఇద్దరి మధ్యా ఛేదించలేని నిశ్శబ్దం
    "ఈ మధ్య కథలేమయినా రాశారా?"
    "కథలా! ఇక ఆ విషయం వదిలెయ్యటం మంచిది. ఇక నాతో కథలు రాయటం కానేకాదు!"
    "అదే?" తెల్లబోయింది.
    "అదంతే! చెప్పానుగా. ఒక్కొక్కరు పౌరాణిక పాత్రలకి నప్పినట్టు సోషల్ లో నప్పరు. ఇదీ అంతే! నేను గేయాలూ, పద్యాలు రాసుకోవాలి దట్సాల్!"
    కొన్ని క్షణాలాగి వాలెట్ తెరిచి ఓ ఉత్తరం ఇచ్చింది రాజ్యలక్ష్మి.
    తెరిచి చూశాడు. అది ఓ సుప్రసిద్ధ వారపత్రిక నుంచి వచ్చింది. ఓ సంస్థ వాళ్ళు ఆ పత్రిక తోడ్పాటులో నిర్వహించిన గేయాల పోటీలో రాజ్యలక్ష్మి కవితకి ప్రధమ స్థానం లభించింది.
    "హార్టీ కంగ్రాట్స్! ఇంకేం వాళ్ళడిగినట్టుగా ఫోటో అదీ పంపు వివరాలు కావాలిట కదా!" హృదయపూర్వకంగా చేయిచాచాడు.
    ఒక్క క్షణంలో సగం తడబడి చేయి అందించింది.
    కరచాలనం చేశాడు రవి.
    అతని చేతి స్పర్శ నరనరానా సోకి హృదయం దాకా తీపి తలపుల్ని పరిగెత్తించింది. ఆమె ఒడలు పులకరించింది. కనులు అరమోడ్పులయ్యాయి. తొలి పరపురుష స్పర్శలోని తీయదనం తెలిసింది. సిగ్గుల మొగ్గ అయింది రాజ్యలక్ష్మి.
    అయితే రవిలో ఏ చలనమూ లేదు. అతను అతి మామూలుగా ఉన్నాడు.
    ఆమెకి మాత్రం అతని కౌగిలిలో ఒదిగిపోవాలనిపించిందీ. అతనితో ప్రేమ - అనుభవం పంచుకోవాలనిపించింది.
    కానీ ఆమెకి ఆ క్షణంలో తన ఐశ్వర్యంకానీ, తన స్టేటస్ కానీ, అతని బీదతనం, అతని స్థితికానీ గుర్తులో లేవు.
    ఒక పురుషుడు - ఒక స్త్రీ.
    ప్రేమ-అభిమానం-పెళ్ళి-ఇవే గుర్తున్నాయి.
    "మళ్ళీ ఏమయినా రాశావా!" అతనే అడిగాడు.
    "ఆఁ ఓ కథ రాశాను!"
    ఆశ్చర్యపోయాడు రవి, "కథ రాశావా?" అన్నాడు నమ్మలేనట్టుగా.
    "అంతా మీ ఆశీర్వాద బలం!" అంది తను తను అతని శిష్యురాలన్నట్టు.
    "నో! నో! ఐ డోంట్ క్లెయిమ్ యూ టు బి మై డిసైడిల్! నీలో ఆ జీల్ వుంది. రాసేస్తున్నావు అంతే! రాజ్యలక్ష్మిగారూ! స్వతహాగా శక్తిలేనివాడిని ఎంత దూరం నడిపించగలం చెప్పండి!" అన్నాడు.
    "ఒక చిన్న రిక్వెస్టు"
    "చెప్పండి!"
    "నన్ను రాజలక్ష్మిగారూ అని అంత గొప్ప చేయకండి. రాజూ అను లక్ష్మీ అనో పిలవండి!" అంది వినమ్రంగా.
    నివ్వెరపోయాడు రవి? ఆ మాటల్లో ఆ చూపుల్లో అతనికి ఆమె ఆరాధనా భావం ప్రస్ఫుటంగా కనిపించింది. "నేనలా పిలవలేను!" అన్నాడు పొడిగా.
    ఆమె రెట్టించలేదు.
    కొన్ని క్షణాలు ఆగి కధ అందించింది.
    ఆమె ఎదుటే చకచకా చదవసాగాడు. ఆమె కది ఎబ్బెట్టుగా అనిపించినా అతనాసాంతం చదివేశాడు. ఆ పది నిమిషాలూ ఆమెకి ఎలాగో అనిపించింది.
    కథ యిచ్చేశాడు ఆమె చేతికే.
    అతని పెదాలు విచ్చుకున్నాయి. ఆ పూర్తి చేయగానే అతనికి నవ్వొచ్చింది. "చూడండి! నా ఉద్దేశ్యం చెప్పమంటారా? కథలు రాయటం చాలా తేలిక! అలాగే మంచి కథలు రాయడం చాలా కష్టం! కథ రాయాలంటే మనిషిలో ఒక స్పందన కలగాలి! దానికి మంచి రూపాన్ని యివ్వాలి! కథలో మలుపులు, మెళుకువలు, ముగింపు, ప్రారంభం యివన్నీ ఒక ఎత్తు!
    శైలి ఒక్కటే ఒకెత్తు."
    ఆశ్చర్యంగా వింటోంది రాజలక్ష్మి.
    "మీకు పెళ్ళి గురించిన అభిప్రాయం ఏమిటి?"
    సిగ్గుపడి తల వంచుకుంది ఆమె.
    "అంత సిగ్గా? అయితే ఎలా రాశారు? అంత ధాటిగా చెప్పారే?"
    "అది ఆమె మనో భావన."
    "కానీ ఆమె మీ ప్రతిబింబం! ఆ వర్ణన మీదే! ఆ భావాలు మీవే! మాటాడే పద్ధతిమీదే."
    రాజలక్ష్మి సమాధానం చెప్పలేదు.
    "ఇంకో విషయం - కధకులు అలా కథల్లో దొరికిపోకూడదు. అది నేర్చుకోవలసిన ఫస్టు టెక్నిక్ ---" తలూపింది.
    "మీరు ప్రేమ వివాహానికి యిష్టపడుతున్నారా?"
    చప్పున కళ్ళు విసాలం చేసి అతనికేసి చూసింది. అందులో అతని ప్రతిబింబం ఫలించింది. ఇదే నా సమాధానం అన్నట్టుగా చూసింది.
    "మనస్సు వేరు - ప్రపంచం వేరు - ప్రేమ వేరు - పెళ్ళి వేరు. వీటికి నిత్యజీవితంలో లంకె కుదరదు. పెళ్ళయ్యాక భార్యాభర్తల ప్రేమ వేరు. దానికి ఎన్నెన్నో లింకులుంటాయి. కానీ పెళ్ళికి ముందు ప్రేమ ఫలించటం చాలా అరుదు. మన కథలు, నవలలు చాలా మటుకు యివే చెబుతాయి---"
    రాజ్యలక్ష్మి వింటోంది.
    రవి చప్పున ఆపేశాడు చెప్పడం.
    "మిమ్మల్ని ప్రేమిస్తున్నాను - ఈ కధలో హీరో మీరే - నేనే హిరోయిన్ని - నన్ను పెళ్ళిచేసుకోండి!" అని అన్నట్టుగా అనిపించింది రవికి, దాంతో మూగవాడైపోయాడు.
    కొద్ది నిమిషాలయ్యాక "కధ దిద్దిపెట్టండి" అంది.
    "నాకేం రాదు - మీరే మరోసారి చదువుకోండి. రచయితగా కాక, పాఠకురాలిగా చదవండి. లోపాలు తెలుస్తాయి."

 Previous Page Next Page