ఇక కాదనుకుని తన మనోభావాల్ని గేయరూపంలో పెట్టటం ప్రారంభించాడు. పదిహేను నిమిషాల్లో చక్కని గేయం తయారైంది.
గర్వంగా చదువుకున్నాడు రవి.
అతనికెంతో సంతృప్తి కల్గింది.
తనకి పూర్తి విశ్రాంతి, క్షణ క్షణ జీవన్మరణ సమస్యలాంటి ఈ బ్రతుకుకోసం పోరాటం తగ్గితే అద్భుతమైన కవిత రాస్తానని అనుకున్నాడు.
అయితే వెంటనే అతని అంతరాత్మ హెచ్చరిక వినిపించింది. "మూర్ఖుడా! సమస్యలతో పోరాడుతూ వున్నంత సేపే నీలోని కవి జాగృతం అవుతాడు. అమాయకంగా సుఖ జీవనానికి ఆశపడకు. ఏ కవి కూడా శోకంతోనే శ్లోకాలు రాయగలిగాడు? సుఖంగా సౌఖ్యంగా వున్నవాడు కవిత్వం చెప్పడానికి అనర్హుడు."
నివ్వెరపోయాడు రవి.
తనలోని అంతశ్చైతన్యం చేసిన హెచ్చరిక గురించి ఆలోచించసాగాడు.
సరిగ్గా అప్పుడే శంకరానంద్ వచ్చారు.
గేట్లో రిక్షాని ఆపి, "ఇక్కడే వుండవోయ్! క్షణంలో వచ్చేస్తాను. తిరిగి వెళదాం!" అని రిక్షావాడితో చెప్పాడు.
వాడు తిరుగు బాడుగకూడా దొరికినందుకు సంతోషపడ్డాడు.
"ఊఁ మంచినీళ్ళు కావాలా? చల్లగా వుందిలే కాలం! పోనీ కాఫీ తాగుతావా?" అని అడిగాడు రిక్షావాడిని.
కాఫీ అనగానే రిక్షావాడికి ఆశ కలిగింది. నోరూరింది.
"నా వెంటరా!" అని రిక్షావాడితో సహా వచ్చేశాడు.
"రవీ! రవీ!" అని కేకలు వేసినట్టుగా పిలిచాడు.
రవి గబగబా బయటికి వచ్చాడు.
శంకరానంద్ ని చూడగానే నమస్కారం చేశాడు. ఆయన గొప్ప యిండస్ట్రియలిస్టు. షెడ్యూల్ కాస్టు మనిషి కావటంతో రాజకీయంగా అంతో యింతో పలుకుబడి సంపాదించాడు.
ఎలక్షన్లంటూ వస్తే సమితికి పోటీ చేయాలనే ఉత్సాహం వుంది అయితే ఆయన బుద్ధిమంచిది కాదు. నడతా అంతే!
అందినంతవరకూ దోపిడీ చేస్తాడు. మిత్రుడు, శత్రువు అనే భేదం లేకుండా వచ్చినవాడి నెత్తిపై చేయి పెట్టేస్తాడు.
అందుకే ఆయన్నంత శంకరానంద్ అని కూడా అంటాడు.
"నమస్కారం!" అన్నాడు రవి. "ఆయన ఎలాంటి వాడైనా తన యింటిని వెతుక్కుంటూ వచ్చాడు కదా" అనుకున్నాడు.
"ఊఁ ఈ రిక్షావాడికి కాఫీ కావాలిట! ఉందా?"
బిక్కముఖం వేశాడు రవి. తన యింట్లో కాఫీ తాగమని ఎలా చెప్పగలడు నోరారా!
"లేదా! దట్సాల్! అయినా రిక్షావారికి ఎంతదురాశో చూడు. దప్పికయితే మంచినీళ్ళు తాగాలి లేదా వేసవి అయితే దాహానికి మజ్జిగ అడగాలి. ఇంటల్లుడి తమ్ముడిలా కాఫీలడగటమా?" అన్నాడు.
రిక్షావాడు దిమ్మెరపోయి చూస్తూన్నాడు. వాడికే మనటానికే నోరు రాలేదు. శంకరానంద్ ధోరణీకి విస్తుపోయాడు.
"ఊఁ ఏమిటి విశేషాలు! రాష్ట్రస్థాయిలో బహుమతి కొట్టేశావటగా!"
"అవునండీ!" వినయంగా అన్నాడు రవి.
"నాకు తెలుసోయ్! నీలో ఆ వరిజినాలిటీ వుంది! ఆ షార్ప్ నెస్ వుంది!"
రవి ఏమీ అనలేదు.
"నాకు తెలుసు! మన వూరి కీర్తి నువ్వు నిలబెడతావని!"
"థాంక్స్!"
"ఆఁ చిన్న పని తగిలి వచ్చానబ్బాయ్! రేపు ఒకటవ తేదీ యిక్కడికి మూర్తిగారొస్తున్నారు. ఇంకా ఏ మంత్రి వచ్చేది ఖాయం కాలేదనుకో. మంత్రిరావటం మాత్రం ఖాయం. నువ్వు ప్రశంసా పద్యాలు రాయాలి."
ఆశ్చర్యపోయాడు రవి. "ఎవరొచ్చేదీ తెలియందే పద్యాలు రాయడమెలా?"
"దాందేవుంది? పేరు ఖాళీ వుంచెయ్. తర్వాత యిరికిద్దాం. ఇదిగో నా వద్ద అయిదారు నమూనాలున్నాయి- అన్నీ సమర్పించినవి. వీటినే కాస్త అటూ యిటూ మార్చి రాసెయ్యొచ్చు. నిజానికి ఆ పని నేనే చెయ్యగలను. కానీ నీలాంటి యువకుడిని ప్రోత్సహించి ముందుకు తేవాలని అనుకుంటున్నాను."
రవికి కాస్త బాధ కలిగింది. "ఇదా ప్రోత్సాహం?" అనుకున్నాడు.
"మరో విషయం. నువ్వు ఓ సన్మానం పత్రం కూడా రాయాలి. అందులో మన గ్రీవెన్సెస్ కొన్ని చేర్చాలి." అంటూ కొన్ని విషయాలు గబగబా చెప్పాడు. విధిలేక రవి తలూపాడు.
"మరి వీటిని నాకు ఎప్పుడు ఎక్కడ అందజేస్తావ్?" దర్జాగా బీడీ కాలుస్తూ ప్రశ్నించాడు.
మండిపోయింది రవికి. "ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చినట్టుగా అప్పుడూ రాకూడదూ?" అనుకున్నాడు.
"పోస్టుచేస్తావా? ఊహూఁ వద్దు. ఈ సాయంకాలం మన టౌన్ కాంగ్రెస్ ఐ ఆఫీసు చూళ్ళేదూ - అక్కడ నా పేరు చెప్పి యిచ్చెయ్."
"తనున్నది ఈ మూల! అది టౌన్ కి మరో మూల. వెళ్ళాలంటే కనీసం గంటపడుతుంది. ప్చ్. ముఖమాటం ఎంత పనిచేస్తోంది?" అనుకున్నాడు ముభావంగా తలూపాడు.
"మరి వస్తా." అని రిక్షావాడిని కేకేసి వెళ్ళిపోయాడు.
13
అలాగా చూస్తూ వుండిపోయాడు రవి.
"ఏమిటి ఆలోచిస్తూ వున్నారు."
ఉలికిపాటుతో స్వప్న భంగమైనట్టు చూశాడు రవి.
రాజ్యలక్ష్మి!
దివినుండి భువికి దిగివచ్చినట్టుగా వుంది ఆమె. తలంటి పోసుకుందేమో ముంగుర్లు ఫాలభాగంపై సముద్ర తీరంలో షికార్లుకొట్టే కొంటి కుర్రాడిలాగా ఎగురుతున్నాయి.
పచ్చని దేహఛాయకి బంగారు రంగు పట్టు పరికిణీ, జాకెట్ మరీ అందాన్ని చేకూర్చుతున్నాయి. కవిత్వానికి పరవశించే సహృదయుడిలాగా వెల్వెట్ పైట కదలి కదలి పోతుంది.
తనవేపే తదేకంగా చూస్తూన్న అతన్ని చూసి సిగ్గుపడింది రాజ్యలక్ష్మి.
"నాపై యింకా కోపంపోలేదా? పలుకరించినా ఇంకా మౌనంగా వున్నారు?"