Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 16


    "ఏమిటలా వెదుకుతున్నావ్?"
    "ఉహూఁ ఏం లేదు. నన్ను పెళ్ళి చేసుకునే వరులెక్కడయినా దాక్కున్నారా. వాళ్ళ అడ్రసులేమయినా నీ వద్ద వున్నాయా అని చూశాను."
    విరగబడి నవ్వాడు "మాటకు మాట! భలే చమత్కారివే!" అన్నాడు.
    ఇద్దరి మధ్యా ఓ క్షణం నిశ్శబ్దం.
    "అన్నట్టు బావా! నువ్వే ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు!"
    ఉలిక్కిపడ్డాడు రవి "ఎవర్ని?"
    "ఇంకెవర్ని! నన్నే! ఏం నేను తగనా?"
    "భలేదానివే! నువ్వెందుకు తగవు- నీకేం తక్కువ!"
    "మరెందుకు తగవు - పెళ్ళిచేసుకుంటే పోలా?" అంది నవ్వుతూ ఆమె.
    "ఆహాఁ నువ్వు లాటరీ టికెట్లు అమ్మి సంపాదిస్తూ వుంటే నేను హాయిగా యింటిపట్టున కూర్చుని, కవితలూ, కథలూ రాసుకుంటూ వుండొచ్చు!"
    నవ్వింది సవిత "అమ్మ ఎంత ఆశ! అదేం కాదమ్మా! లాటరీ టిక్కెట్లు అమ్మే బాధ్యత, బరువు తప్పించుకునేందుకే నన్ను చేసుకోమన్నాను. హాయిగా భర్తకి చేసిపెట్టుకుంటూ యిల్లూ పిల్లలతో సుఖంగా వుండటంకంటే ఇంకేం కావాలి?" అంది అరమోడ్పు కన్నులతో.
    "వండర్ ఫుల్! అయితే నన్ను టిక్కెట్లు అమ్మమంటావా?"
    "వైనాట్! నువ్వయితే రోజుకి వంద టికెట్లయినా అమ్మేస్తావు. రోజుకి పాతిక! కవిత్వంవల్ల మరో పాతిక! నెలకి పదిహేనువందలు - అంతకంటే యింకేం కావాలి?"
    "బావుంది! మరింకేమిటి ఆలస్యం!"
    "ఏం లేదు! ఈ టికెట్లు అన్నీ అమ్మేయనీ - ఈ కమీషన్ తో మనం సివిల్ మేరేజ్ చేసుకుందాం! ఇవి అమ్ముడవకపోతే ఎంత నష్టం?"
    "నష్టం ఏముంది? ఆ లాటరీ నీకే రావచ్చుగా!"
    "బావా! ఒక విషయం విను - ఏజంట్లు ఈ టికెట్లకే ముందు ప్రయిజులన్నీ వస్తాయని ఆశపెడతారే తప్ప. ఆశపడరు. వాళ్ళకి కమీషన్ చాలు. అంతే! ప్రింటర్ ప్రింటింగ్ చార్జెస్ తో తృప్తిపడతాడే తప్ప సేల్స్ పై లాభాలని ఆశపడరు. ఇదీ అంతే!"
    అంతలో సుబ్బమ్మగారు కాఫీ తెచ్చారు.
    "ఇంకా కాళ్ళయినా కడుపున్నట్టులేదే!" అంది ఇద్దర్నీ గమనిస్తూ.
    "ఏదీ! నీ మేనకోడలు నన్ను వదిల్తేనా? పెళ్ళి చేసుకోమని ప్రపోజ్ చేస్తోంది పైగా!"
    "అవునత్తయ్యా? నేను బావకి తగనా?" అంది సవిత.
    ఇద్దర్నీ మార్చి మార్చి చూసి నవ్వేసింది సుబ్బమ్మగారు "జంట బావుందే సవితా కానీ మా వాడికేముందని పెళ్ళి చేసుకుంటావే?"
    "ఏం కావాలి అత్తయ్యా! ఈ రోజుల్లో అబ్బాయిగా పుట్టటమే ఓ క్వాలిఫికేషన్!"
    "అన్యాయం! నాకు అంతకంటే క్వాలిఫికేషన్ లేదా!"
    నవ్వేసింది సవిత.
    హాయిగా నిర్మలంగా జోక్స్ వేసుకుంటున్న ఇద్దర్నీ చూసి మురిసిపోయింది సుబ్బమ్మగారు.
                                       12
    ఆపూట సవిత అక్కడే వుండిపోయింది. భోజనానికి అత్తయ్యతో కలిసి శ్రమపడింది. దొడ్లో కాసిన కాకరకాయ వేపుడు, ఆనపకాయ పాలకాయకూర, వంకాయ పచ్చడి, చిక్కటి మజ్జిగ...
    కడుపునిండా భోజనం చేశారు ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ.
    "బావా!"
    "ఏమిటి సవితా!"
    "నాదో సలహా! నువ్వు స్టేట్ బ్యాంక్ వాళ్ళని కలవకూడదూ. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం క్రింద పాడి పశువులో, కోళ్ళ పరిశ్రమకో మరి దేనికయినా డబ్బు యిస్తారు!"
    "సవితా! నేను కవితలు రాయగలనే తప్ప నాతో మరేమీ అవదు."
    "నువ్వేం పశువులకి మేత వెయ్యాలా! పాలు చూసుకోవాలా? పితికినపాలను డెయిరీకి అందజేస్తే చాలు!"
    "అవునురా రవీ! ఓ నాలుగు గొడ్లు కొనుక్కునిరా! మన మంగమ్మని అడుగుదాం! దాని కూతుర్ని జీతానికి మాటాడుకుందాం! దాని ఆలనా పాలనా అది చూస్తుంది. నాకు పాడి చెయ్యడం కూడా వచ్చు!" అంది నవ్వుతూ.
    రవి తల్లికేసి దిగులుగా చూశాడు. "నిన్ను శ్రమపెట్టలేనమ్మా! పాడిపశువుల పోషణ అయినా, పసిపిల్ల పోషణ అయినా ఒకటే! ఎంతో జాగ్రత్త, శ్రమ తీసుకోవాలి."
    "అలాగేలేరా! నా కెలాగూ పసిపిల్లల్ని పెంచే యోగం లేకపోయింది. నిన్నెలాగో పెంచాననుకో పాడి అయినా చెయ్యనీ."
    "అత్తయ్య మహారాష్ట్రలో ఆనంద్ అనే వూరు వుంది. అక్కడ ఒక్కో యింటినుంచి వందలీటరు పాలదాకా పోస్తారట. ఆ ఊరు డెయిరీ ఆసియాలోనే ఫస్టట! మనం వింటున్నామే అముల్ అది అక్కడిదే! ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అన్న పదాల సంక్షిప్తమే అముల్. పాడిపరిశ్రమ అయింది ఈ రోజుల్లో" ఉత్సాహంగా చెప్పింది సవిత.
    "ఇదిగో అమ్మాయ్! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే నాతో ఓ పాడిపశువులమంద ఏర్పాటు చేయించేట్టుగా వున్నావు" నవ్వుతూ అన్నాడు రవి.
    "బావా! నా సైడునుంచి ఏమాత్రం అభ్యంతరం లేదు! అయినా చూడగా చూడగా నువ్వు నాపై మోజు పడుతున్నట్టే వుంది!" అంది నవ్వుతూ సవిత.
    "నీకేం తక్కువే!" అంది సుబ్బమ్మగారు.
    "ఒక్కటే తక్కువ! భర్త! అందుకే మొగుడు అని కలవరిస్తోంది!" కొంటెగా అన్నాడు రవి.
    సవిత తేలిగ్గా నవ్వేస్తూ "బావా! స్లోగన్స్ రాసివ్వమంటే భోజనం పెట్టావు. థాంక్స్! ఈసారి రెండు టికెట్లు యిస్తాను. చూసుకో! వాటికి ప్రయిజ్ గ్యారంటీ---" అంది.
    "సవితా! ఆ రెండూ నీవే ఉంచేసుకోరాదూ! ఎన్ని అమ్మితే కమీషన్ అంత వస్తుంది!"
    "బావా! నిచ్చెన మనిషిని మేడ ఎక్కిస్తుందే తప్ప తానెక్కిపోలేదు!"
    "సరే! సరే! అయినా ఆ డబ్బువస్తే అది మనదే అవుతుందికదా!" మనది అనే పదం నొక్కిపలుకుతూ అన్నాడు.
    "థాంక్స్!" అతనివేపు చూస్తూ అంది సరిత! ఆ చూపులో కోటి ఆరాధనలు కనిపించాయి.
    సవిత మరో అరగంట తర్వాత స్లోగన్స్ రాయించుకుని వెళ్ళిపోయింది.
    కడుపునిండా భోజనం చేసినంత తృప్తి కలుగుతుంది సవితతో మాటాడినపుడల్లా! తన మనస్సు మెలి మెల్లిగా పాదరసంలా అయి ప్రవహిస్తోందా అనుకున్నాడు రవి.
    ఎలాగయినా ఈరోజు కథరాయాలి! జ్యోతి కథల పోటీకి టైం దగ్గరకు వస్తోంది. ప్రయిజ్ వస్తుందని కాదు. పాల్గొన్నాననే తృప్తి అనుకున్నాడు రవి.
    మధ్యాహ్నం నిద్రపోయి, లేచాక కథ రాయటం ప్రారంభించాడు రవి. లోగడ ప్రారంభించిన కథ అలాగే ఎక్కడున్నావే అంటే అక్కడే అన్నట్టుగా ఆగిపోయింది. దాన్ని పూర్తిచేయాలి అనుకోకుండా తన సన్మానం అనుభవాలని కథగా రాయాలని ప్రారంభించాడు.
    అయితే రాసిన ఒకటి రెండు పేజీలు డాక్యుమెంటరీగా వార్తావాహినిలాగా వచ్చింది తప్ప కథ రూపం రాలేదు. న్యూస్ రిపోర్టులాగా వున్న ఆ రెండు పేజీలు రాయటానికి టైమ్ రెండుగంటలు పట్టింది. ఎంతో అలసినట్టుగా అనిపించింది తర్వాత తృప్తికూడా లేదు.

 Previous Page Next Page