శివారాధనతో పొందే ప్రతిఫలం ఏమిటి?


మాఘ మాసంలోని వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. ఆరోజు మహాశివరాత్రి  వ్రతం మనిషిని శివునిగా మార్చడానికి ప్రేరణ కలుగజేస్తుంది. అది యావత్ విశ్వానికీ శివతత్త్వ సందేశాన్ని ప్రసాదిస్తుంది. శివరాత్రి నాడు ఓ వ్యాధుని (వేటగాని) హృదయ పరివర్తన సంబంధమైన పౌరాణిక గాథ మనకు తెలిసిందే. లేళ్ళ మాటలపై విశ్వాసం ఉంచిన వేటగాడు  వాటిని తమ బిడ్డల దగ్గరకు వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఆ లేళ్ళు తిరిగి రావడానికై నిరీక్షిస్తూ ఆ వేటగాడు రాత్రి అంతా ఓ మారేడు చెట్టుపై కూర్చుని ఉంటాడు. అతడు తనకు తెలియకుండానే పగలల్లా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసినట్లయింది. మారేడు పత్రాలను కోసి క్రిందకు పారవేయడం వల్ల ఆ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై ఆ బిల్వదళాలు పడడంతో శివలింగార్చన జరిగింది. ఇవన్నీ ఓ అతనికి తెలియకుండానే జరిగినా అతనికి ఎంతో పుణ్యప్రదంగా మారాయి. ఉదయం అవగానే ఆ లేళ్ళ కుటుంబమంతా తన దగ్గరకు వచ్చి నిలిచి ఉండడంతో అతడి మనస్సు ద్రవించిపోతుంది. ఆ వేటగాడు మూగజీవులు మాట మీట నిలబడి తన దగ్గరకు వచ్చిన విధానంకు అతని మనసు కదిలిపోయింది. వాటికి చేతులెత్తి నమస్కారం చేస్తాడు. ఆ సంఘటనతో అతని మనసు పూర్తిగా మార్పుకు లోనయ్యింది. అతనిలో కూడా శివత్వం సాక్షాత్కరిస్తుంది.


"శివో భూత్వా శివం యజేత్" శివుడవై శివోపాసన చేయాలి. శివుడవు కావాలనుకుంటే శివదర్శనం వల్లనే కుదురుతుంది. శివుడు జ్ఞానమూర్తి. ఆయన ముఖం మీద ఎప్పుడూ జ్ఞానగంగ పొంగుతూ ఉంటుంది. జ్ఞానరాజైన శివుణ్ణి ఉపాసించాలని అనుకున్నవాడు కూడా జ్ఞానపిపాసువు కావాలి. శివుని జటల నుంచి గంగ బహిర్గతమైనట్లు జ్ఞాని అయినవాడు తన విశుద్ధబుద్ధి ద్వారా జీవితంలోని కఠిన సమస్యల నుంచి బహిర్గతుడు కావడానికి ధైర్యంతో ప్రయత్నించాలి.  నిజమైన జ్ఞానం ముందు ఎలాంటి కఠిన సమస్యలైనా నిలబడలేవు. నిజమైన జ్ఞానికి ఎంత కష్టమైన ప్రశ్నలకు అయినా సమాధానాలు సహజంగానే లభిస్తాయి. తెల్లని హిమాలయాల మీద శివుడు ఎంత స్వచ్ఛంగా ఆశీనుడై ఉంటాడో.. అంత స్వచ్ఛంగా ఆయనను ఉపసించే జ్ఞాని ఉండాలి. 


శివుడి కృప లభించాలి అంటే.. ఎన్నో కష్టాలను ఓర్పుగా అధిగమించాలి. కఠిన సాధనలు లేకుంటే శివత్వం లభించదు. నిత్యం కొనసాగించే సామాన్య విషయ సంబంధమైన కార్యకలాపాలను అధిగమిస్తే కానీ శివత్వశోభ లభించదు. శివభగవానుడు త్రిలోచనుడు. తన మూడవ  నేత్రంతో ఆయన మదనుణ్ణి కామదేవుణ్ణి భస్మం చేశాడు. నిజమైన జ్ఞానిపై ఇలాంటి వ్యామోహల ప్రవాహం ఏదీ పనిచేయదు. సరికదా ఆయన తన జ్ఞానంతో ఇలాంటి ప్రలోభాలను మసిచేస్తాడు. 


 పుష్పదంత మహాకవి తన 'శివమహిమ్నః స్తోత్రం'లో ఇలా చెబుతాడు…


 “శ్రీమన్నారాయణుడు శివారాధనలో ఉండగా సహస్ర కమలార్చన సమయంలో ఓ కమలం తక్కువ అవుతుంది. అప్పుడు శ్రీహరి తన నేత్రకమలాన్నే అర్పిస్తాడు" అంటాడు. ఇదొక రూపకం. హరునికి హరినేత్రం కావాలి అంటే జ్ఞాని ప్రేమదృష్టితో సృష్టిని తిలకించాలి. ప్రేమ లేని ఉట్టి జ్ఞానం జగత్తును ఆనంద శూన్యం చేస్తుంది. జ్ఞానం, ప్రేమ ఈ రెండు కలిస్తేనే వస్తువును ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతాం. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అంతే కాదు వస్తు సౌందర్యానందాన్ని పొందగలుగుతాం. ఇదే శివారాధనతో మనిషి పొందే మొదటి ప్రతిఫలం.


                                       ◆నిశ్శబ్ద.


More Maha Shivaratri