శివరాత్రి రోజు ఇలా పూజ చేస్తే అద్బుతమే!


మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణ పక్షాన అర్ధరాత్రి వ్యాపించిన చతుర్దశి తిథిలో వస్తుంది. చతుర్దశి తిథి శివునికి ప్రీతికరమైనది.  శివరాత్రి రోజు శివుడు అర్ధరాత్రి సమయంలో కోటి సూర్యసమప్రభతో లింగా కారంలో ఆవిర్భవించడం వల్ల దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. శివుడి పూజ పగటిపూట కాక రాత్రిపూట సాగడం ఈ పండుగ ప్రత్యేకతలలో ఒకటి.. 


ప్రతి నెలలోనూ శివరాత్రి తిథి వస్తుంది. అయితే మాఘమాసంలో వచ్చే తిథికి మహా శివరాత్రి అని పేరు. మహాశివరాత్రి రోజున శివరాత్రి వ్రతం ఆచరిస్తారు చాలామంది. మహాశివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలి అనే  విధానాన్ని లింగపురాణంలో వివరించారు. శివరాత్రి రోజు జాగరణ చేస్తూ నాలుగు జాముల్లోనూ నాలుగు సార్లు శివపూజ సాగిస్తారు. ఇలా ఒక్కొక్క జాములో ఒకో విధంగా సాగే శివపూజ, ఆ శివపూజకు ఉపయోగించాల్సిన వస్తు సామాగ్రి వేరువేరుగా ఉంటుంది. అలాగే పఠించాల్సిన మంత్రాలు కూడా వేరుగా ఉంటాయి. 


శివరాత్రి రోజు మొదటి జాములో శివునికి పాలతో అభిషేకం చేయాలి. పద్మాలతో పూజ చేయాలి. పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి, శివుడికి నైవేద్యం అర్పించాలి. ఋగ్వేద మంత్రాలు చదవాలి.


రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి. తరువాత తులసీ దళాలతో శివుణ్ణి అర్చించాలి. పాయసం నైవేద్యంగా పెట్టాలి. రెండవ జము సమయంలో యజుర్వేద మంత్రాలు పఠించాలి.


మూడవ జాములో నేతితో  అభిషేకించాలి. ఆ తరువాత శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. నువ్వుల పొడి కలిపిన తినుబండారం(చలిమిడి) నైవేద్యంగా సమర్పించాలి. సామవేద మంత్రాలు చదవాలి.

నాలుగవ జాములో తేనెతో అభిషేకం చేయాలి. నీలం రంగు పూలతో పూజించాలి. అన్నం నైవేద్యం పెట్టాలి. అధర్వణ వేద మంత్రాలు చదవాలి. అభిషేకం జరుగుతుండగా శివదర్శనం చేయడం మహాపుణ్య ప్రదమని చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు. కనుక పువ్వులు, పళ్ళు సమర్పించడం కన్నా అభిషేకాలతో శివుడు త్వరగా సంతుష్టుడవుతాడు, 


కాబట్టి శివరాత్రి రోజు జాగరణ చేస్తూ పైన చెప్పుకున్న నాలుగు జాముల అభిషేకాలు స్వయంగా చేయించకున్నా కనీసం నేరుగా శివదర్శనం చేసుకుని అభిషేకాలు చూడటం ఎంతో పుణ్యప్రదం. కనీసం శివుడికి చెంబుడు నీళ్లు పోసి, మారేడు(బిల్వ దళాలు) దళాలను అర్పించి వీభూధితో అర్చిస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. కాబట్టి శివుని కృపకు పాత్రులు కండి.


                                  ◆నిశ్శబ్ద.


More Maha Shivaratri