ఓంకారాన్ని ప్రణవం అని ఎందుకంటారు!

భారతదేశంలో మనం తరచూ పలికే అత్యంత పవిత్రమైన శబ్దం 'ఓమ్'. పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం. ఓంకారం సర్వమంత్రాలకూ అధిపతి అని పవిత్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓంకారమే బ్రహ్మజ్ఞానం. అదే పరమాత్మ. ఓంకార ఉచ్చారణ శరీరం మీద, మనస్సు మీద, పరిసరాల మీద ప్రగాఢమైన ప్రభావం చూపుతుంది. అనేక మంత్రాలు, వేద ప్రార్థనలు, అన్ని శుభకార్యాలూ ఈ ప్రణవ ఉచ్ఛారణతోనే ఆరంభమవుతాయి.

ఓంకారమే బ్రహ్మ స్వరూపం కాబట్టి, ఓంకారాన్ని పూజించడమంటే, సాక్షాత్తూ పరబ్రహ్మను పూజించడం కిందే లెక్క. అందుకే. 'ఓం'కారాన్ని మంత్రంగా జపించడం, ధ్యానించడం కూడా కద్దు. 'అ' కార, 'ఉ' కార, 'మ'కారాల సమ్మేళనం 'ఓం'కారం తొలి - వేదమైన ఋగ్వేదంలోని మొదటి మంత్రపు మొదటి అక్షరాన్ని (అ), రెండో వేదమైన యజుర్వేదంలోని మధ్య మంత్రంలోని మధ్యాక్షరం (ఉ)తో కలిపితే, 'అ + ఉ = ఓ' అవుతుంది. దానికి (ఓ), చివరి వేదమైన సామవేదంలోని చివరి అక్షరాన్ని (మ్) జత చేరిస్తే, మొత్తం కలిపి మూడు వేదాల సారమే - 'ఓమ్'.

నిజానికి, వేదాలు మూడే. అందుకే, వాటికి 'త్రయి' అని పేరు. అధర్వ వేదమనే నాలుగో వేదం ఆ మూడింటిలో నుంచి వేరు చేసినదే! కాబట్టి, అన్ని వేదాల సారం ఆ 'ఓమ్' శబ్దంలోనే ఉంది. 'ఓమ్' అని ఉచ్చరిస్తే, మూడు వేదాలనూ ఉచ్చరించినట్లే! అందుకే, ఏ నామానికైనా ముందు 'ఓంకారం' చేరిస్తే, అది వేదమంత్ర సమానం అవుతుంది.

'ఓమ్' అనేది అన్ని మతాలకూ, ధర్మశాస్త్రాలకూ మూలం లాంటిది. అందులోని 'అ'కారం అశ్వం లాగా మానవాళిని మోసుకు వెళుతుంది. ఇక, 'ఉ'కారం స్థలాన్నీ, పరిస్థితినీ సూచిస్తుంది. 'మ'కారం జీవితంలోని లయకూ, శ్రావ్యతకూ సూచిక. అలా పవిత్రమైన 'అ,ఉ,మ' కారాల సమ్మేళనంగా 'ఓమ్' అవతరించింది. 'అ'కారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు గొంతు లోపలి భాగం నుంచి స్వరం వస్తుంది. ఇక, 'ఉ'కారం ఉచ్చరిస్తున్నప్పుడు పెదవులు రెండూ దగ్గరకు వస్తాయి. పెదవులు మూసుకున్నప్పుడు 'మ్' అనే ఉచ్చారణ వస్తుంది.

నిజానికి, ఓంకారంలోని ఈ మూడు అక్షరాలూ 'జాగ్రత్, స్వప్న, 'సుషుప్తి' అనే మూడు అవస్థలకూ ప్రతీకలు. అలాగే, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులకూ, మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకూ అవి సంకేతాలు. ప్రపంచానికి ఆధారభూతులు సృష్టికర్త (అ = (బ్రహ్మ), స్థితికారకుడు (ఉ = విష్ణువు), లయకర్త (మ్ = శివుడు) మాత్రమే అని ఓంకారం చెబుతుంది.

అంతేకాక, ముల్లోకాలైన భూలోక, భువర్లోక, 'భూ', 'భువః', 'సువః' ప్రతీకలని చెబుతారు. ఇవన్నీ భగవంతుడే! వీటికి అతీతమైనదీ భగవంతుడే!! రెండు ఓంకార ఉచ్చారణల మధ్యనున్న నిశ్శబ్దం - రూపరహితుడూ, గుణ రహితుడూ అయిన బ్రహ్మ స్వరూపమే! న భగవంతుణ్ణి స్తుతించే శబ్దం కావడంతో, ఓంకారాన్ని 'ప్రణవం' అని పేర్కొంటారు.

                                    ◆నిశ్శబ్ద.


More Subhashitaalu