మనస్సు పనిచేసే తీరు ఎలా ఉంటుందంటే!

"వేయిమంది ధీరులను వేయి యుద్ధాలలో వేయి సార్లు ఓడించిన వారికన్నా మనసును ఒక్క క్షణమైనా నియంత్రించగలవారే పరాక్రమవంతులు.” మనసును అదుపు చేసే మహత్కార్యానికి మనలను ప్రేరేపించే గౌతమ బుద్ధుడి బోధ ఇది. మనసుతో పోరాటాన్ని ఎవరైనా, ఎప్పటికైనా ఎదుర్కోక తప్పదు. అనివార్యమైన ఈ పోరాటాన్ని సులభం చేయాలంటే మనస్సు పనిచేసే తీరును మనం తెలుసుకోవాలి.

మనఃశక్తి స్థాయిలు : మనసు మూడు స్థాయిల్లో పనిచేస్తుంది. 

1. సూక్ష్మ చైతన్య స్థాయి 

2. చైతన్య స్థాయి 

3. మహా చైతన్య స్థాయి 


మన నియంత్రణలో ఉన్న మనఃశక్తి చైతన్య స్థాయిలో ఉంటుంది. మన నియంత్రణలో లేని శక్తి సూక్ష్మచైతన్య స్థాయిలో ఉంటుంది. ఆలోచనలు, ప్రవృత్తులు సూక్ష్మచైతన్య మనసులో నిద్రాణమై, అణిగి ఉంటాయి. ఇవి నేరుగా మన చేత పని చేయించలేవు. అవే ఆలోచనలు చైతన్య స్థాయిలో సంకల్పాల రూపం ధరిస్తాయి. పని రూపంలో వ్యక్తమవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ రెండు స్థాయిలను వేరు వేరుగా వివరించడానికి సాధ్యం కాదు. ఒక దానిపై మరొకటి ఆధారపడి ఈ రెండు రూపాలు పనిచేస్తాయి. రెండింటిని కలిపి అర్థం చేసుకుంటే మనసు ఎలా పనిచేస్తుందో మనకు అర్థం అవుతుంది.

సూక్ష్మం నుండి స్థూలానికి: 

సూక్ష్మ చైతన్య స్థాయిలో అణిగి ఉన్న ఆలోచనలు నిరంతరం చైతన్యస్థాయిలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటాయి. వీటిలో కొన్ని ఆలోచనలు కోరికలుగా మారి చైతన్య స్థాయిలోకి ప్రవేశిస్తాయి. కోరికలలో బలహీనమైనవి ఈ స్థాయిలో అణిగిపోయి, బలమైనవి సంకల్పాలుగా మారుతాయి. మనం వీటికి అనుగుణంగా పని చేస్తాం. ఈ విధంగా సూక్ష్మమైన ఆలోచన ఎన్నో స్థాయిలు దాటి మనం చేసే పనిగా స్థూలరూపం ధరిస్తుంది.

మనం చేసే అన్ని పనులకు మూలం మన సూక్ష్మచైతన్య స్థితిలో ఉందని దీని వల్ల మనకు తెలుస్తుంది. ఈ మనస్థితి ఎక్కడనుండి ఉత్పన్నమైంది? చైతన్యస్థాయిలో మనం చేసే ప్రతి పని ఆలోచనరూపాన్ని ధరించి తిరిగి సూక్ష్మచైతన్య స్థితిలో నిక్షిప్తమౌతుంది. ఆలోచనలకు స్థూలరూపం మనం చేసే పనులు. చేసిన పనులు తిరిగి సూక్ష్మరూపంలో ఆలోచనలుగా నిలువ అవుతాయి.

బాధకు బాధ్యత:

మనం చేసే పనులకు బాధ్యత మనది కాదని తప్పించుకునే అవకాశం ఇక్కడ ఉంది. నిజమే! పనికి కారణం మనం కాదు!! కాని చేసేపనులు ఫలితాన్ని అనుభవించాల్సింది మనమే!! బాధ మనదీ, బాధ్యత మనసుదీ! దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో బంధం అన్నారు. మనసు చేసే ఈ మాయ నుండి తప్పించుకునే ఆశేలేదా!! అంటే ఉంది.

సూక్ష్మంలో మోక్షం:

ఆలోచనా సంకల్పంగా సంకల్పంతో చేసిన పని తిరిగి సంస్కారంగా మారే అంతులేని చక్రాన్ని ఆపటమే దీనికి తరుణోపాయం. ఆలోచన కోరికగా, తరువాత సంకల్పంగా మారకుండా జాగ్రత్తపడాలి. ఆలోచన సంకల్పంగా మారి చైతన్య స్థాయిలో పని మొదలైన తరువాత మనసును నిగ్రహించడం చాలా కష్టం. సూక్ష్మచైతన్య స్థాయిలో ఆలోచనలను నిగ్రహించడం అభ్యాసం చేస్తే చైతన్య స్థాయిలో మనం చేసేపనులు వాటంతట అవే నిగ్రహింపబడుతాయి.

ఇది సాధ్యమేనా!! అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆలోచనను ఆదిలోనే గమనించే అప్రమత్తతను మనం పెంచుకుంటే, వాటిని నిరోధించి నాశనం చేసే నైపుణ్యాన్ని తేలికగానే సాధించవచ్చు.

                                 ◆నిశ్శబ్ద.


More Subhashitaalu