భక్తి, జ్ఞాన మార్గాలు ఎందుకు అవసరం?


అధ్యాత్మికతలో జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండు ముఖ్యమైనవి. అయితే చాలామంది ఇవి రెండూ ఎందుకు వ్యర్థం లేనివి ఇవి, ఆధ్యాత్మిక మార్గంలో సాగి మోక్షం సాధించాలంటే ఇవి రెండూ అవసరం లేదు కదా అని అనుకుంటారు. అయితే ప్రారంభ దశలో జ్ఞాన, భక్తి మార్గాలు వేరువేరుగా కనపడతాయి. భక్తుడు తనకీ, భగవంతునికీ మధ్య వ్యత్యాసం ఉన్నట్లు భావిస్తాడు. అలా అనుకోవడం ప్రాథమిక అవస్థలో సాధకునికి అవసరం.


దీనికొక ఉదాహరణ చెప్పారు: “ఒక యజమాని దగ్గర విశ్వాసపాత్రుడైన పనివాడు ఒకడు చాలా కాలంగా పని చేస్తుంటాడు. అతని సేవల వల్ల సంతృప్తి చెందిన యజమాని ఆ పనివాణ్ణి తన స్థానంలో కూర్చోబెట్టి, తనంతటి వాడే అతను అంటాడు”. అలాగే తనను ఆరాధించి, ప్రేమించి, సేవించిన భక్తుణ్ణి భగవంతుడు చివరకు తనలో చేర్చుకుంటాడు. భగవంతుడు సర్వవ్యాపి అ గుర్తించి, తాను భగవంతుడికి చెందినవాణ్ణని భక్తుడు తెలుసుకుంటాడు. సాధకుడిలోని నిజమైన “నేను”, “బ్రహ్మం" ఒకటే అనీ, పరమాత్మ, ఈ 'నేను' వేరు (ఒకటి కాదు) అనుకోవడం పొరపాటు అనీ తెలియచెప్పే బోధనతోనే జ్ఞానమార్గం ప్రారంభమవుతుంది.


ఇది జ్ఞానమార్గంలో ముఖ్యమైన అంశం. భక్తుడికి ఇదంతా అసంగతంగా తోస్తుంది. అయితే జ్ఞానమార్గాన్ని అవలంబించిన భక్తునికి చివరకు పరబ్రహ్మ దర్శనం అయ్యాక జగత్తుగానూ, జీవులుగానూ ఉన్నది ఆ పరబ్రహ్మమే అని తెలుస్తుంది. శ్రీరామకృష్ణుల గురువైన తోతాపురి జీవితం చదివితే ఈ విషయం తెలుస్తుంది.


పరిపూర్ణమైన జ్ఞానం లభించకపోవడం వల్ల తోతాపురికి మొదట్లో భక్తిమార్గం అంటే విశ్వాసం ఉండేది కాదు. అయితే శ్రీరామకృష్ణుల సాహచర్యంలో జగన్మాత ఉనికి వాస్తవమే అని తెలిసి పరబ్రహ్మను స్వకీయునిగానూ, తటస్థునిగానూ కూడా గుర్తించారు ఆయన. ముందుగా పరబ్రహ్మను తటస్థునిగా భావించే మార్గంలో ప్రత్యేక సాధనలు చేసి తన పరిపూర్ణమైన అనుభవ జ్ఞానంతో పరబ్రహ్మ స్వకీయుడు అని సత్యసాక్షాత్కారాన్ని పొందారు. భక్తుల విషయానికి వస్తే ముందు భగవంతుడు స్వకీయుడు అనే అనుభవం కలుగుతుంది. తరువాత వారి ప్రేమ పరిణతి చెందాక తటస్థమైన అద్వైతంగా గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణ పరిణతి చెందాక భక్తి జ్ఞానాలు సమ్మిళితమై, అభిన్నమైన పరబ్రహ్మ గోచరిస్తాడు. నిజానికి యథార్థమైన ప్రేమ వల్లనే వాస్తవమైన భావైక్యం కలుగుతుంది. నిజమైన భావైక్యం వల్ల వాస్తవమైన ప్రేమ జనిస్తుంది. ప్రారంభంలో అవి వేర్వేరుగా తోచినా సంపూర్ణంగా పరిణతి చెందాక రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి భక్తి, జ్ఞాన మార్గాలు మనిషికి ఆ భగవంతుడిని చేర్చే మార్గాలు. అవి తప్పనిసరిగా అవసరం.


                                ◆నిశ్శబ్ద.


More Subhashitaalu