ప్రదక్షిణలు సవ్యదిశలోనే ఎందుకు చేస్తారో తెలుసా?

గడియారం ముల్లు తిరిగినట్లుగా సవ్యదిశలో ప్రదక్షిణం చేయడం వల్ల దేవుని రూపం మనకెప్పుడూ కుడి వైపు ఉంటుంది. అంతేకాకుండా, మన భారతదేశంలో కుడివైపు అనేది ధర్మానికీ, శుభానికీ చిహ్నం. కాబట్టి, సవ్యదిశలో గర్భగుడికి ప్రదక్షిణం చేస్తూ పోవడం వల్ల ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. అలాగే, జీవితంలో ధర్మం వైపున దేవుడుండి, మనకు నిరంతరం సహాయకారిగా, మార్గదర్శకుడిగా నిలుస్తాడని మరో అర్థం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనం చెడుధోరణులవైపు పయనించకుండా, గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుంది. 


సవ్యదిశలో ప్రదక్షిణ చేయడానికి ఆరోగ్య రీత్యా కూడా ఓ కారణం చెబుతారు. ప్రదక్షిణ చేసి, నేల మీదకు వంగి నమస్కారం చేయాలంటే, శరీరంలో రక్త చలనం ఎక్కువగా ఉండాలి. మొదట ప్రదక్షిణ చేయడం వల్ల శరీరంలో రక్తచలనం ఎక్కువవుతుంది. అదీ సవ్యదిశలో ప్రదక్షిణ చేయడం వల్ల గుండె నుంచి శుద్ధ రక్తం కొంచెం ఎక్కువగా సరఫరా అవుతుంది. ఇలా శరీరంలోని అవయవాలన్నిటికీ శుద్ధ రక్తం అందుతుంది. ఈ శుద్ధ రక్తాన్ని పంపే రక్తనాళం గుండెకు కుడి వైపు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కాబట్టి, సవ్యదిశలో (కుడివైపుగా ప్రదక్షిణం ఆచరిస్తే, ఈ శుద్ధ రక్తం సరఫరా సులభంగా జరుగుతుందని శాస్త్రీయ 1 కారణం తేల్చారు.


తల్లితండ్రుల్ని సాక్షా జగన్మాత, జగత్పితరులుగా సంభావించి వారి చుట్టూ ప్రదక్షిణం చేయడం కద్దు. విఘ్నధిపత్యం చేపట్టే విషయంలో వినాయకుడు కుమారస్వామి, పోటీ పడినప్పుడు, తన తల్లితండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసి, సమస్త భూమండలాన్నీ చుట్టి వచ్చిన ఫలితం పొందిన సంగతి పురాణాల్లో మనం చదువుకున్నదే!


నిత్యం దేవతార్చన అయిన తరువాత, మన చుట్టూ మనమే తిరుగుతూ (ఆత్మ ప్రదక్షిణ), దేవుడికి నమస్కారం చేస్తుంటాం. దీన్నే 'ఆత్మ ప్రదక్షిణ నమస్కారం' అంటారు. దీనిలో 'ఓ పరమార్థం దాగి ఉంది. ప్రతి జీవుడిలోనూ పరమాత్ముడున్నాడు. మనలోనే ఉన్న పరమాత్మను గుర్తించి, ఆ పరమాత్మ స్వరూపమే బాహ్యంగా విగ్రహ రూపంలో భగవంతుడిగా ఉందనే విషయాన్ని గుర్తిస్తూ, మనలో ఉన్న దేవుడికి మనకు మనమే ప్రదక్షిణం చేస్తూ, భగవంతుడికి నమస్కరించడమే 'ఆత్మప్రదక్షిణ నమస్కారం.' అలా ఆత్మప్రదక్షిణ నమస్కారం చేస్తున్నప్పుడు


యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥ 


అనే శ్లోకం పఠిస్తాం. 'అనేకానేక జన్మల పాపాలన్నీ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు ద్వారా నశిస్తూ పోతాయి' అన్నది ఈ శ్లోక భావం.


                                   ◆నిశ్శబ్ద.


More Subhashitaalu