హిందువుల అంత్యక్రియల సమయంలో కుండను ఎందుకు పగలగొడతారు తెలుసా!


హిందూ మతంలో మనిషి మరణించిన తరువాత జరిపే కార్యాన్ని అంత్యక్రియలు అని అంటారు.  మనిషి  జీవితంలోని పదహారు మతకర్మలలో అత్యంత ముఖ్యమైనవి అంత్యక్రియలు. ఇది ఆత్మ ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి పొందే దశ. దహన సంస్కారాల సమయంలో ఎన్నో ఆచారాలు పాటిస్తారు. వీటిలో ముఖ్యంగా మట్టి కుండను పగలగొట్టడం ముఖ్యమైనది. శరీరాన్ని దహనం చేసేముందు నీటితో నిండిన మట్టి కుండను మోసుకెళ్ళి చితి చుట్టూ తిరగడం,   ఆఖరులో కుండను  వెనుకకు వదిలేసి  పగలగొట్టడం చేస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటో చాలామందికి తెలియదు. కేవలం ఒక ఆచారంగా పాటిస్తూ ఉంటారు కానీ దీని వెనుక కారణాలు చాలామందికి తెలియవు.  దీని గురించి తెలుసుకుంటే..

గరుడ పురాణం ఏం చెబుతోంది..

గరుడ పురాణం ప్రకారం దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. సనాతన సంప్రదాయంలో మానవ శరీరాన్ని మట్టి కుండతో పోలుస్తారు. ఒక మట్టి కుండ పచ్చిగా ఉండి చివరికి మట్టిలో కలిసిపోయినట్లే, మన శరీరం కూడా అంతే. కుండను పగలగొట్టడం అంటే ఈ "మట్టి శరీరం" ఇప్పుడు అంతమైందని,  దాని ఆత్మ స్వేచ్ఛగా ఉందని సూచిస్తుంది.


మరణం తరువాత కూడా ఆత్మ తరచుగా తన కుటుంబం,  శరీరంతో అనుబంధంగా తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరంతో ఆత్మకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయిందని సూచించడానికి కుండను పగలగొట్టే కార్యాన్ని నిర్వహిస్తారు. కుండ పగిలి నీరు బయటకు ప్రవహించే శబ్దం, విరిగిన కుండలో నీటిని ఉంచలేనట్లే, ఆత్మకు ఈ శరీరంలో ఇకపై స్థానం లేదని సూచిస్తుంది.

మూడు రంధ్రాల రహస్యం..

మత విశ్వాసాల ప్రకారం  కుండతో చితి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఒక పదునైన కుశ లేదా పదునైన వస్తువుతో మూడు రంధ్రాలు చేస్తారు. ఈ మూడు రంధ్రాలు మానవ జీవితంలోని మూడు ఋణాల నుండి విముక్తిని సూచిస్తాయి. దేవతలకు ఋణం, ఋషులకు ఋణం,  పూర్వీకులకు ఋణం. కుండ విరిగినప్పుడు ఆ వ్యక్తి ఈ బాధ్యతలన్నింటి నుండి విముక్తి పొంది మట్టిలో కలిసిపోయాడని నమ్ముతారు.


తెలుసుకోవలసిన విషయం..

ఈ ఆచారం మరణించిన వారికి మాత్రమే కాకుండా దహన సంస్కారాల వద్ద ఉన్న వారందరికీ ఒక పాఠంగా  మారుతుంది. ప్రవహించే నీరు జీవితం వేగంగా గడిచిపోవడాన్ని సూచిస్తుంది,  కుండ పగలడం మరణం  అనివార్యమని చెబుతుంది. ప్రతి ఒక్కరూ తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే అనే విషయం స్పష్టం చేస్తుంది.

                                  *రూపశ్రీ.


More Aacharalu