మహాకాళుడి భస్మ హారతిని స్త్రీలు చూడకూడదని అంటారు..  ఎందుకంటే..!


పరమేశ్వరుడి అభిషేకాలు అంటే ఎంతో వైభవంగా ఉంటాయి.  మరీ ముఖ్యంగా కొన్ని క్షేత్రాలలో చేసే అభిషేకాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.  అలాంటి  అభిషేకాలలో ఉజ్జయిని లోని మహాకాళుడి భస్మ హారతి చాలా ముఖ్యమైనది. దీన్ని భస్మాబిషేకం అని కూడా అంటారు. అయితే ఈ భస్మ హారతిని పురుషులు మాత్రమే చూడాలని,  స్త్రీలు చూడకూడదని అంటారు. అసలు ఉజ్జయిని మహాకాళుడి భస్మ హారతిని స్త్రీలు ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? తెలుసుకుంటే..

మహాకాళుడి భస్మ హారతి..

ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు,  మహాకాళునికి భస్మ ఆరతి నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిరోజూ ఆరుసార్లు మహాకాళుని ఆరతి నిర్వహిస్తారు.  వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది భస్మ ఆరతి. ఈ హారతిలో పాల్గొనడానికి,  మహాకాళ దర్శనం చేసుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.  

మహిళలు ఎందుకు పాల్గొనరంటే.

హిందూ మత నమ్మకాల  ప్రకారం మహాకాళుడికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయిస్తారు. ఈ ఆచారం నిర్వహించే సమయంలో  మహాకాళుడి వస్త్రాలు,  నగలు  తొలగిస్తారు. ఆ సమయంలో పరమేశ్వరుడు పూర్తిగా నగ్నంగా ఉంటాడు. ఈ రూపంలో మహాకాళుడిని మహిళలు చూడటం నిషేధించబడిందట.


భస్మ ఆరతి సమయంలో మహాకాళుని రూపం చాలా భయంకరంగా,  శక్తివంతంగా మారుతుంది . అందువల్ల భస్మ ఆరతికి సంబంధించి మహిళలకు నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి.

భస్మ హారతి ప్రాముఖ్యత..

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవది.  శ్రీ మహాకాళేశ్వరుని భస్మ హారతి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.  ఇది ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తం సమయంలో నిర్వహిస్తారు. ఈ ఆరతిలో పాల్గొనడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది,   ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. మత విశ్వాసం ప్రకారం పురాతన కాలంలో శివుడు దుషన్ అనే రాక్షసుడిని చంపిన తర్వాత అతని బూడిదతో తనను తాను అలంకరించుకున్నాడట.  ఈ సంప్రదాయం అప్పటి నుండి కొనసాగుతోందని చెబుతారు.

                                                        *రూపశ్రీ.


More Aacharalu