శని ప్రదోష వ్రతం.. జీవితంలో దుఃఖాలు తొలగిపోవాలంటే ఈ రోజు ఇలా చేయండి..!

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి తిథికి ముందు వచ్చే త్రయోదశి తిథులను ప్రదోష వ్రతాలుగా జరుపుకుంటారు. శుక్లపక్ష త్రయోదశి రోజు, కృష్ణ పక్ష త్రయోదశి రోజు శని ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ త్రయోదశి తిథి ఏ రోజు వస్తే ఆ రోజును దాని ప్రదోష వ్రతం అని పేర్కొంటారు. అయితే మాఘ మాసంలో వచ్చే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా శనివారం వచ్చిన త్రయోదశి తిథిని శని ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. శని ప్రదోష వ్రతం రోజున శివుడు పార్వతీ దేవికి ఈ వ్రతం ఎలా జరుపుకోవాలని ఉపదేశం ఇచ్చారని చెబుతారు. శని ప్రదోష వ్రతం జరుపుకోవడం వల్ల జీవితంలో దుఃఖాలు, సమస్యలు, మానసిక, ఆరోగ్య బాధలు తొలగిపోతాయని చెబుతారు. దీని గురించి తెలుసుకుంటే..
శని ప్రదోష వ్రతం..
శని ప్రదోష వ్రతం రోజు శివుడిని ఆరాధించడం వల్ల అటు పరమేశ్వర అనుగ్రహం, ఇటు శని గ్రహ ప్రబావం తగ్గడం.. రెండూ జరుగుతాయట.
ఉపవాసం..
శని ప్రదోష వ్రతం చేయాలి అనుకునేవారు శని త్రయోదశి వచ్చిన రోజున ఉపవాసం ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. కుదరని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం పూజ వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత ఆహారం తీసుకునేవారు కూడా ఉంటారు.
ప్రదోష కాల పూజ..
ప్రదోష వ్రతానికి ప్రదోష కాల పూజ చాలా ముఖ్యమైనది. సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లడం మంచిది. అలాగే శివ లింగానికి అభిషేకం చేయడం లేదా అభిషేకాలు జరుగుతుంటే వీక్షించడం చేయాలి. పాలు, నీరు, తేనె, బెల్లం మొదలైనవి అభిషేకం కోసం వినియోగించవచ్చు. ప్రదోష వ్రతం రోజున బిల్వదళాలు తప్పకుండా సమర్పించాలి. శివ పంచాక్షరీ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి.
శని గ్రహ శాంతి కోసం..
శని ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల శని గ్రహ శాంతి లబిస్తుంది. దీని వల్ల శనిదోషాలు, ఏలినాటి శని, అర్దాష్టమ శని, శని మహాదశ వంటి దోషాల సమయంలో కలిగే బాధలు, ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
శని ప్రదోష వ్రతం రోజు నల్ల నువ్వులను ఒక తెల్లని వస్త్రంలో చిన్న మూటగా కట్టి, ఆ మూటను నువ్వుల నూనెలో ముంచి దాంతో దీపం వెలిగించాలి. అలాగే నల్లని వస్త్రాలు దానం చేయడం, గోధుమలు లేదా నువ్వులను దానం చేయడం, నువ్వుల నూనెను దానం చేయడం మంచిది.
శని గ్రహ శాంతి కోసం శని ప్రదోష వ్రతం రోజు శని గాయత్రి మంత్రం, హనుమాన్ చాలీసా, మహా మృత్యుంజయ మంత్రం, రుద్రాష్టకం వంటివి జపించాలి.
శని ప్రదోష వ్రత ప్రాముఖ్యత..
ప్రదోష కాలంలో చేసే శివారాధన సాధారణ రోజుల్లో చేసే ఆరాధన కంటే వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు.
శని ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే.. ఏలినాటి శని, అష్టమ శని, శని మహా దశ వంటి శని గ్రహ ప్రభావాలు తగ్గుతాయి.
శని దేవుడిని కర్మ ఫల దాత అని అంటారు. శివారాధన చేయడం వల్ల కర్మ ఫలాలు శాంతిస్తాయని చెబుతారు. అందుకే శని బాధలతో ఇబ్బంది పడేవారికి శని ప్రదోషవ్రతం చాలా ముఖ్యం.
శనిదేవుడు స్వయానా పరమేశ్వరుడికి అపారమైన భక్తుడట. శివుడి అనుగ్రహం ఉంటే శని ప్రబావం కఠినంగా ఉండదని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 14న వచ్చే శని ప్రదోష వ్రతాన్ని తప్పక ఆచరించడం వల్ల దుఃఖాలు తొలిగే మార్గం లభిస్తుంది.
*రూపశ్రీ.


