రావణుడు సుగ్రీవుడికి పంపిన రహస్య సందేశం!
రాముడు విభీషణుడికి శరణాగతి ఇస్తాను అని చెప్పగానే విభీషణుడు రాముడి మాటలకు సంతోషించి రాముడి దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే 'ఇది రాముడు నిలబడిన భూమి' అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు "రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యను, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్పి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి" అన్నాడు.
రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు "విభీషణ బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానము చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను" అన్నాడు.
అప్పుడు విభీషణుడు "మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను" అన్నాడు.
మళ్ళీ రాముడు అన్నాడు "లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను" అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.
విభీషణుడు వెళ్ళిపోయాక రావణుడికి ఆలోచన కలిగించి. "ఇప్పుడు సముద్రానికి అవతలవైపున ఉన్న రాముడి గురించి ఏదైనా విషయం తెలుసుకుంటే బాగుంటుంది" అనుకున్నాడు.
అలా అనుకోగానే శార్దూలుడనే గూఢచారిని రాముడి దగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి"అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు" అన్నాడు.
"నేను మాత్రం సీతని ఇవ్వను" అని, సుకుడు అనేవాడిని పిలిచి "నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. "నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి" అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు" అని సుకుడిని పంపించాడు రావణుడు.
◆నిశ్శబ్ద.