సంక్రాంతి గంగిరెద్దు వెనక కథ ఇదీ…

 

 

ఈశ్వరునికి కృత్తివాసుడు అన్న పేరు ఉంది. అంటే చర్మధారి అని అర్థం. ఆ చర్మం కూడా ఏనుగురూపంలో ఉండే గజాసురుడు అనే ఓ రాక్షసుని చర్మం. ఇంతకీ దానినే శివుడు ఎందుకు ధరిస్తాడంటే…

 

పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహించిన వరంతో ముల్లోకాలనూ జయించిన వీరుడు గజాసురుడు. అతను పరమ శివభక్తుడు. శివారాధన లేనిదే అతని రోజు సంపూర్ణం అయ్యేది కాదు. నిత్యం శివారాధన చేసినా, గజాసురునికి ఏదో లోటుగానే ఉండేది. ఎంతైనా రాక్షసుడు కదా! శివుని ఆరాధించడం ఏంటి. ఆయనను తనలోనే నిలుపుకోవాలన్న ఆశ అతనిలో పుట్టింది. అంతే! వెంటనే శివుని గురించి ఘోరమైన తపస్సుని ఆచరించడం మొదలుపెట్టాడు. భక్తవత్సలుడైన శివుడు ప్రత్యక్షం కాగానే ‘నిన్ను వీడి వేరుగా ఉండలేకపోతున్నాను. ఈ భక్తుని కరుణించి ఇకనుంచి నా శరీరంలోనే ఉండిపొ’మ్మని కోరుకున్నాడు శివుడు. భోళాశంకరుడైన శివుడు అలాగే గజాసురుని గర్భంలో కొలువుండిపోయాడు.

 

 

శివుడు లేని ముల్లోకాలూ అల్లకల్లోలం అయిపోయాయి. ఆయన గురించి వెతికిన ప్రమథగణాలు వెతికివెతికి అలసిపోయాయి. చివరికి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో పార్వతీదేవికి తెలియవచ్చింది. కానీ ఇప్పుడేం చేసేది! అతను చూస్తేనేమో బలపరాక్రమవంతుడైన రాక్షసుడు. పైగా శివుని తన దేహంలోనే ఉంచుకున్న అతనిని జయించడం అసాధ్యం. ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పార్వతీదేవి విష్ణుమూర్తిని ఆశ్రయించింది. విషయాన్ని విన్న విష్ణుమూర్తి, బ్రహ్మాది దేవతలతో కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఆ ప్రకారం నందిని గంగిరెద్దులా అలంకరించారు. దేవతలందరూ మారువేషాలలో తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, గంగిరెద్దుని ఆడిస్తూ గజాసురుని విడిదిని చేరుకున్నారు. తన ముందు అత్యద్భుతంగా నృత్యగానాలతో సాగిన విష్ణువిలాసాన్ని చూసిన గజాసురుడు చలించిపోయాడు. ‘మీ అద్భుతమైన ప్రదర్శనకు బదులుగా ఏం కావాలో కోరుకోమన్నా’డు. ‘గజాసురా! ఈ గంగిరెద్దు సామాన్యమైనది కాదు. ఇది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని వాహనమైన నంది. తన స్వామికి దూరమై చాలా బాధలో ఉంది. దానిని తన స్వామి దగ్గరకు చేరుకోనియ్యి’ అని అడిగాడు విష్ణుమూర్తి.

 

విష్ణుమూర్తి కోరికను విన్న గజాసురునికి విషయం అర్థమైంది. వీరంతా తనలో ఉన్న పరమేశ్వరుని తిరిగి తీసుకువెళ్లడానికే వచ్చారని బోధపడింది. శివుడు కనుక తన శరీరాన్ని చీల్చుకుని బయటకి వస్తే తన మృత్యువు తప్పదు. ‘పరమేశ్వరా! నాకు చావు దగ్గరపడిందని తెలిసిపోయింది. కానీ నిన్ను వదిలి ఉండటానికి మనస్కరించడం లేదు. అందుకని ఇకపై నా చర్మాన్ని నువ్వు ధరించు. నా శిరసును మల్లోకాలూ పూజించేలా అనుగ్రహించు’ అని వేడుకున్నాడు. శివుడు ‘తథాస్తు’ అనగానే నంది తన పొట్టిన చీల్చి, అందులోని శివుడు బయటకు వచ్చేందుకు అనుమతించాడు గజాసురుడు. తరువాతి కాలంలో శివుని చేతిలో సంహరింపబడిన వినాయకునికి గజాసురుని శిరసుని జోడించడంతో, అది ముల్లోకాలకూ పూజనీయంగా మారింది.

 

ఇక గజాసురుని చర్మాన్ని శివుడు స్వయంగా ధరించసాగాడు. లోకకళ్యాణం కోసం తన భక్తులను శిక్షించినా, వారికి కైవల్యాన్నే ప్రసాదిస్తానని పరమేశ్వరుడు ఈ సందర్భంలో చెప్పకనే చెబుతున్నాడు. శివుని చేజిక్కించుకోవడం కోసం విష్ణుమూర్తి ఆడిన నాటకమే గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది పలికిందని చెబుతారు. సంక్రాంతి సమయంలో ‘అమ్మవారికీ దండంబెట్టు అయ్యగారికీ దండంబెట్టు’ అంటూ వచ్చే గంగిరెద్దులు సాక్షాత్తూ ఆ నందీశ్వరునికి వారసులు! ఇక గజాసుర సంహారాన్ని ప్రతిబింబిస్తూ తమిళనాట ‘వళువుర్‌’ అనే ప్రాంతంలో విరాటేశ్వర ఆలయం ఉంది. ఇందులో శివుడు ‘గజసంహారమూర్తి’గా కనిపిస్తాడు.

 

- నిర్జర.


More Shiva