అమర్ నాథ్  గుహ రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడించిన మొదటి శివ భక్తుడు.!

 


పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో చాలా ప్రదేశాలలో తాను స్వయంభువుగా వెలిశాడు.  అలాంటి క్షేత్రాలలో అమర్ నాథ్ క్షేత్రం ఒకటి.  ఎంతో  కష్టతరమైన ఈ యాత్రను కూడా భక్తులు ఎంతో సంతోషంగా చేస్తారు.  ప్రతి ఏడాది కేవలం కొన్ని రోజులు మాత్రమే అమర్ నాథ్ యాత్రకు ప్రభుత్వ అనుమతి ఉంటుంది. అమర్ నాథ్ ను అమరేశ్వర్ అని కూడా పిలుస్తారు. అయితే అమర్ నాథ్  గుహ గురించి రహస్యాన్ని మొట్టమొదటిసారి ప్రపంచానికి వెల్లడైనది ఎప్పుడు? ఈ విషయాన్ని వెల్లడి చేసినది ఎవరు? తెలుసుకుంటే..

పురాణాల ప్రకారం ఈ గుహలోనే శివుడు పార్వతి దేవికి అమరత్వ కథను వివరించాడట.  ఈ కారణంగా అమర్‌నాథ్ గుహ శైవ క్షేత్రాలలో చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.  ఏ భక్తుడైనా అమర్‌నాథ్‌ను భక్తితో సందర్శించి అమరేశ్వర శివలింగాన్ని సందర్శించినట్లయితే అతనికి పుణ్య ఫలాలు లభిస్తాయని,  మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు.

భృగు సంహిత, నీలమఠ పురాణం మొదలైన మత గ్రంథాలలో కూడా అమర్‌నాథ్ యాత్ర  ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. అమర్‌నాథ్ యాత్ర చేయడం ద్వారా భక్తుడు కాశీని సందర్శించిన దానికంటే పది రెట్లు ఎక్కువ పుణ్యం, ప్రయాగను సందర్శించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ పుణ్యం, నైమిశారణ్యం సందర్శించిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యం పొందుతాడని గ్రంథాలు,  పురాణాలలో చెప్పబడింది.

మొదట చూసింది ఎవరు?

అమర్‌నాథ్ గుహను మొదట సందర్శించిన వ్యక్తి  భృగువు మహర్షి అని భృగు సంహితలో ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం ఒకసారి కాశ్మీర్ లోయ మొత్తం మునిగిపోయినప్పుడు మహర్షి  నదులు,  వాగుల ద్వారా నీటిని బయటకు తీశాడు. ఆయన  ఏకాంతాన్ని వెతకడం ప్రారంభించినప్పుడు   అమర్‌నాథ్ గుహను చూశాడు.  అందులో అమరేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. ఈ విధంగా అమరేశ్వర స్వామి  దర్శనం పొందిన మొదటి వ్యక్తిగా మహర్షి భృగువును భావిస్తారు.

జానపద నమ్మకం ఏం చెప్తోందంటే..

ప్రసిద్ధ జానపద నమ్మకాల ప్రకారం అమర్‌నాథ్ గుహను మొదటిసారిగా 15వ శతాబ్దంలో బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి సందర్శించాడు. కథ ప్రకారం ఒక సాధువు గొర్రెల కాపరికి బొగ్గుతో నిండిన సంచిని ఇచ్చాడు. గొర్రెల కాపరి సంచిని తిరిగి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బొగ్గుకు బదులుగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. దానిని చూసి గొర్రెల కాపరి ఆశ్చర్యపోయాడు.

గొర్రెల కాపరి సాధువు కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు అతను అమర్‌నాథ్ గుహను కనుగొన్నాడు. అందులో మంచుతో  శివలింగం ఉంది. అప్పటి నుండి అమర్‌నాథ్ ప్రయాణం ప్రారంభమైందని నమ్ముతారు. 'రాజతరంగిణి' పుస్తకంలో కూడా అమరేశ్వర శివలింగం గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 11వ శతాబ్దంలో రాణి సూర్యమతి అమర్‌నాథ్ ఆలయానికి త్రిశూలం,  పవిత్ర చిహ్నాలు మొదలైన వాటిని బహుమతిగా ఇచ్చిందని ప్రజలు నమ్ముతారు.

                                   *రూపశ్రీ.


More Temples