ద్రౌపదిని పూజించే ఆలయాల గురించి తెలుసా..ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..!

పురాణాలలో పేర్కొన్న పంచకన్యలలో ద్రౌపది ఒకరు. మహాభారతంలో ద్రౌపదిది కీలక పాత్ర. భారతీయ చరిత్రలో శక్తివంతమైన మహిళలలో ద్రౌపది కూడా ఒకరు. చాలామంది ద్రౌపదిని ఐదు మందికి భార్య అయ్యిందనే కారణంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ద్రౌపది చాలా గొప్ప మహిళ. ఆమె పతి భక్తి, సామాజిక నియమాలను పాటించిన తీరు, ఆమె అనుసరించిన ధర్మం అన్నీ ఆమెను చాలా విశేషంగా చూపుతాయి. ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు అగ్ని నుండి పుట్టినది కావడంతో ఈమెకు యజ్ఞసేని అనే పేరు కూడా ఉంది. ద్రుపద రాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అని, పాంచాల దేశ యువరాణి కాబట్టి పాంచాలి అని.. ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అయితే ద్రౌపదిని పూజంచే ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుంటే..
శ్రీ ధర్మరాజ-ద్రౌపది ఆలయం..
ఇది బెంగళూరులో ఉంది. ఈ ఆలయంలో ద్రౌపది దేవితో పాటు పాండవులను కూడా పూజిస్తారు. వాహిని క్షత్రియ రాజులు నిర్మించిన ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగినది. ద్రౌపది దేవిని ప్రధానంగా పూజించే ఈ ఆలయంలో కరగ పండుగను కూడా జరుపుకుంటారు.
తమిళనాడులోని కోతమంగళంలో ఉన్న ద్రౌపది అమ్మన్ ఆలయం..
ద్రౌపదిని ప్రధానంగా పూజించే పురాతన ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ద్రౌపది దేవిని బలం, ఆత్మగౌరవం, న్యాయానికి మారుపేరుగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆలయంలో థెమితి అనే పండుగ జరుగుతుంది. ఈ పండుగలో భాగంగా భక్తులు నిప్పు మీద నడుస్తారు. ఇలా నిప్పుల మీద నడిచినప్పుడు ఆ అగ్ని కాల్చదని, ప్రజలను పవిత్రం చేస్తుందని ప్రజలు నమ్ముతారు. స్థానికులు దేవత తమను రక్షిస్తుందని నమ్ముతారు.
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న మెల్పాడి ద్రౌపది అమ్మన్ ఆలయం..
ఇది ఒక ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ ద్రౌపది దేవిని యోధురాలుగా కాకుండా సహనం, స్వచ్ఛతకు ప్రతిరూపంగా పూజిస్తారు. ఇక్కడ ద్రౌపది దేవి "ద్రౌపది అమ్మన్" అనే పేరుతో ప్రతిష్టించబడింది, అంటే "అమ్మన్" అనే పదం "తల్లి" అని అర్థం. ఆలయం చోళుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం ద్రౌపదిని సమాజ పోషక దేవతగా భావిస్తారు.
జింగీ ద్రౌపది ఆలయం..
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చారిత్రాత్మక జింగీ కోట సమీపంలో ఉంది. ఈ ఆలయానికి 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని నమ్ముతారు. ఇక్కడ ద్రౌపది దేవత కాళి దేవి అభివ్యక్తిగా పూజించబడుతుంది. ఆమె ఉగ్రంగా ఉంటుంది. కానీ న్యాయానికి, రక్షణకు ప్రతిరూపంగా ఉంటుంది.
*రూపశ్రీ.



