భారత్ లోని ఈ 5 దేవాలయాలలో నైవేద్యాలను తాకడం, ఇంటికి తీసుకురావడం నిషేధం.. ఎందుకంటే..!

భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు.  ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు మరే ఇతర దేశంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం,   చిన్న గ్రామాలు కూడా ఒక ఆలయాన్ని కలిగి ఉంటాయి. ప్రతి ఆలయానికి దాని  ప్రత్యేకమైన సంప్రదాయాలు,  నమ్మకాలు ఉంటాయి. చాలా వరకు దేవాలయాలలో దైవ దర్శనం, పూజ,  నైవేద్యం తీసుకోవడం వంటివి జరుగుతాయి.  కానీ భారతదేశంలో కొన్ని దేవాలయాలలో ప్రసాదాలను తాకడం లేదా తినడం నిషిద్ధం.  ఇది వింతగా అనిపించవచ్చు కానీ ఈ దేవాలయాలలో శతాబ్దాలుగా ఈ నియమాలు పాటిస్తున్నారు.  ఇంతకీ ఈ దేవాలయాలు ఏంటి? ఎందుకు ఇక్కడ నైవేద్యం లేదా ప్రసాదం తినడం నిషేధించారు.. తెలుసుకుంటే..

కర్ణాటకలోని కోలార్..

కర్ణాటక లోని కోలార్  జిల్లాలోని కోటి లింగేశ్వర ఆలయంలో కోటి శివలింగాలు ఉన్నాయి. పూజ తర్వాత సమర్పించే నైవేద్యాలను కేవలం నామమాత్రానికి మాత్రమే అంగీకరిస్తారు. భక్తులు వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి లేదా తినడానికి అనుమతి లేదు. ముఖ్యంగా శివలింగం పై నుండి సమర్పించే ఈ నైవేద్యం చండేశ్వరుడికి మాత్రమే సొంతమట.  భక్తులు దీనిని తీసుకోకూడదని చెబుతారు.

నైనా దేవి ఆలయం..

51 శక్తిపీఠాలలో ఒకటైన హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో నైవేద్యాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి.  నైనా దేవి నైవేద్యాలు ఆలయ ప్రాంగణంలో మాత్రమే తినవచ్చు. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లడం నిషేధమట. అందుకే నైవేద్యాలను అక్కడే తినాలట.

ఉజ్జయిని కాలభైరవ ఆలయం..

ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం కూడా దాని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భైరవునికి ప్రసాదంగా మద్యాన్ని అందిస్తారు. ఇది భారతదేశంలో ప్రత్యేకమైన ఆచారం. భక్తులు ఈ ప్రసాదాన్ని తాకలేరు లేదా ఇంటికి తీసుకెళ్లలేరు. ఎందుకంటే ఇక్కడ సమర్పించే మద్యం  భైరవుడికి మాత్రమే అంకితం చేయబడింది.

కామాఖ్య ఆలయం..

అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో అమ్మవారికి ఋతుచక్రం వస్తుందనే విషయం తెలిసిందే.  ఈ  ఋతు చక్రంలో ప్రసాదం తినడం ఖచ్చితంగా నిషేధించబడింది.

మెహందీపూర్ బాలాజీ ఆలయం..

 రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం కూడా ఇదే కోవలో ఉంది.  మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ప్రసాదం దేవతకు మాత్రమే సమర్పించబడుతుంది. భక్తులు దానిని తినడం లేదా ఇంటికి తీసుకెళ్లడం నిషేధించబడింది.

                            *రూపశ్రీ.


More Temples