నీలకంఠేశ్వర ఆలయం.. రాత్రి సమయంలో నిర్మించిన ఈ ఆలయం గురించి తెలుసా!

పరమేశ్వరుడిని దేవాది దేవుడు అని పిలుస్తారు. త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని ఆరాధిస్తే కష్టాల నుండి తొందరగా గట్టెక్కవచ్చని అంటారు. శ్రావణ మాసంలో దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలలో శివుడిని ఎంతో గొప్పగా పూజిస్తారు. అలాంటి దేవాలయాలలో నీలకంఠేశ్వర ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయం నిర్మాణం, దీని అందం చాలా ప్రసిద్ధి చెందినదే కాదు.. చాలా ఆసక్తికరమైనది కూడా. ఆలయం శిఖరం మీద చెక్కిన శిల్పాలు ఎంతో ఆకర్షిస్తాయి. ఆలయ శిఖరం పైన ఒక అందమైన మానవ ఆకారం ఉంటుంది. ఈ ఆకారం ఈ ఆలయ వాస్తు శిల్పిది అని చెబుతారు. ఈ ఆలయం గురించి రహస్యాలు తెలుసుకుంటే..
నీలకంఠేశ్వర ఆలయం మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలోని ఉదయపూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ, ఉదయం ఆలయ తలుపులు తెరిచిన వెంటనే, శివలింగంపై పూలు కనిపిస్తాయి. శివలింగంపై పూలు ఉండటం నేటికీ ఒక రహస్యంగానే ఉంది. కానీ బుందేల్‌ఖండ్ సైన్యాధిపతులు అల్హా, ఉడల్.. వీరు పరమేశ్వరుడికి గొప్ప భక్తులు అని స్థానిక ప్రజలు నమ్ముతారు. అందుకే వారు ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి శివలింగం మీద పూలు ఉంచి వెళతారని నమ్ముతారు.
ఆలయ నిషేధం..
రాత్రిపూట నీలకంఠేశ్వర ఆలయంలోకి ప్రవేశించడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ అద్భుతమైన పరమేశ్వర ఆలయాన్ని ఒకే వ్యక్తి రాత్రిపూట నిర్మించాడని చెబుతారు. రాత్రిపూట ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆ వ్యక్తి ఆలయం పై నుండి దిగుతున్నప్పుడు అతని సంచులలో ఒకటి పైన మిగిలిపోయిందని నమ్ముతారు. తన సంచిని తిరిగి పొందడానికి అతను మళ్ళీ ఆలయం పైకి ఎక్కాడట. అతను తిరిగి దిగడం ప్రారంభించినప్పుడు కోడి కూసిందని, తెల్లవారిందని.. ఈ కారణంగా ఆ వ్యక్తి అక్కడే ఉండిపోయాడని చెబుతారు. నేటికీ ఆ వ్యక్తి ఆకారం నీలకంఠేశ్వర్ ఆలయం పైన కనిపిస్తుంది. నీలకంఠేశ్వర్ ఆలయ గోడలపై తయారు చేసిన విగ్రహాలు విరిగిపోయాయి. అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దండయాత్ర సమయంలో మొఘలులు వీటన్నింటినీ ధ్వంసం చేసి ఉంటారని అంచనా.
శ్రావణ మాసంలో శివారాధన..
శ్రావణ మాసం.. శ్రేష్టమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివుని ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివుడిని పూజించడం ద్వారా అతిపెద్ద కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు అప్పులు, ఒత్తిడి, వ్యాధులు, వైషమ్యాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ నెల మహిమను గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని నీటితో అభిషేకం చేస్తే ప్రేమ జీవితం సంతోషంగా మారుతుంది, జీవితం ప్రశాంతంగా మారుతుంది. పురాణాల ప్రకారం పార్వతి దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందడం కోసం శ్రావణ మాసంలోనే తపస్సు చేసింది. ఈ తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించింది శ్రావణ మాసంలోనే అని చెబుతారు. అందుకే శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని భక్తిపూర్వకంగా పూజించడం మంచిది.
*రూపశ్రీ.



