తార లక్ష్మణుడిని ఎలా సముదాయించింది?


రాముడు సుగ్రీవుడి కోసం లక్ష్మణుడిని కిష్కింధకు పంపించాడు. సుగ్రీవుడు లక్ష్మణుడి ముందుకు వెళ్ళడానికి భయపడి తారను పంపించాడు.(వాలి చనిపోయాక తార కూడా సుగ్రీవుడు భార్య అయ్యింది) అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమి వంక చూస్తూ, ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు.

అప్పుడు తార "లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వారు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా" అని పలికింది.

అప్పుడు లక్ష్మణుడు "నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామం అనుభవిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. (మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్థాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము (కష్టపడి సంపాదించినది), ధర్మబద్ధమైన కామము (కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం) వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది.

రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖాలను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడం వలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు" అన్నాడు.

అప్పుడు తార "నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివారు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపవచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. 'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది నిజమే. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణములు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు. అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా?

లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివలన రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి." అని చెప్పింది.

                               ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories