నవదుర్గలను ఆరాధిస్తే కలిగే ఫలితాలు!

 

 

నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకారాలలో కొలుచుకుంటారు. ఈ అలంకారాలలో ఒక ఆలయానికీ మరో ఆలయానికీ పొంతన ఉండి తీరాలన్న నియమం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయా సంప్రదాయాలను బట్టి సాగుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అమ్మవారిని దుర్గాదేవి రూపంలోనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందుకనే దసరాను అక్కడ దుర్గాపూజ అని పిలుస్తుంటారు. ఈ దుర్గాపూజలోని తొమ్మిది రోజులలోనూ అమ్మవారిని నవదుర్గల రూపంలో అలంకరిస్తుంటారు. అమ్మవారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఎత్తిన అవతారమే దుర్గాదేవి అవతారం. ఈమెలోని తొమ్మిది విభిన్న తత్వాలే నవదుర్గలు. ఇవే వారి పేర్లు!

 

శైలపుత్రి :– దక్షయజ్ఞంలో తనకు జరిగిన అవమానానికి, శివుని భార్య సతీదేవి దహనమైపోయిన సంగతి తెలిసిందే! అలా మరణించిన సతి, పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమే శైలపుత్రి లేదా పార్వతి. వృషభవాహనం మీద త్రిశూలం ధరించి ఉన్న ఈమెను ఆరాధిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. 

 

బ్రహ్మచారిణి :– పార్వతిగా జన్మించిన సతీదేవి పరమేశ్వరుని తన భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సుని సాగించింది. పాదచారియై... కుడిచేత జపమాలను, ఎడమచేతిలో కమండలాన్నీ ధరించిన రూపం ఈమెది. ఈ రూపాన్ని ఆరాధించేవారు ధ్యానంలో అత్యున్నత స్థితిని పొందగలరనీ, మోక్షాన్ని సాధించగలరనీ నమ్మకం.

 

చంద్రఘంట :– ఈ అమ్మవారి శిరస్సు మీద ఉండే చంద్రుడు ఘంటాకృతిలో కనిపిస్తాడు. అందుకనే ఈమెను చంద్రఘంటగా పిలుస్తారు. సింహవాహనం మీద ఉండే ఈ అమ్మవారు ఎనిమిది చేతులలో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ కోసం గద, విల్లంబు, త్రిశూలం, ఖడ్గాలని ధరించి కనిపిస్తారు. అదే సమయంలో తన భక్తులకు మోదాన్ని కలిగించేందుకు కమలము, అభయముద్ర, కమండలము, జపమాలతో దర్శనమిస్తారు.

 

కూష్మాండ :– ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం. మరి సూర్యుడు లేకపోతే ఈ లోకంలో అంధకారమూ, ఆకలీ, అనారోగ్యాలూ ప్రబలుతాయి కదా! అమ్మవారి తేజస్సే ఆ సూర్యుడు అని అంటారు. అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి కనిపిస్తారు. ఈ దేవిని కొలిచినవారి ఆయురారోగ్యాలకు లోటు ఉండదని అంటారు.

 

స్కందమాత :– ఈ అవతారంలో బాలకుమారస్వామి (స్కందుడు) ఒడిలో ధరించిన రూపులో అమ్మవారు కనిపిస్తారు. శివగణాలకు స్కందుకు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే ఇరువురి ఆశీస్సులూ లభిస్తాయని అంటారు.

 

కాత్యాయని :– పూర్వం కాత్యాయనుడే మహర్షి అమ్మవారు తన ఇంట జన్మించాలనే కోరికతో ఆమెను ఆరాధించాడట. అలా ఆయన ఇంట జన్మించిన తల్లే కాత్యాయని. అభయవర ముద్రలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్నీ, మరో చేత పద్మాన్నీ ధరించి ఈ అమ్మవారు కనిపిస్తారు. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని అన్నమాట!

 

కాళరాత్రి :– నల్లని రూపుతో, విరబోసుకున్న కేశాలతో, మెరుపులు చిమ్మే హారంతో కాళరాత్రిని తలపించే దేవి ఈమె. తనని ఆరాధించినవారి మనసులోని సకల భయాలనూ రూపుమాపగల చల్లని తల్లి. గార్ధభ వాహనం మీద కనిపించే ఈ తల్లి పేరు వింటే భూతప్రేతాలు సైతం దరిచేరవని అంటారు.

 

మహాగౌరి :– తెలుపు లేదా ఎరుపు రంగుని గౌరవర్ణం అంటారు. పార్వతీదేవి, శివుని కోసం ఘోర తపస్సు చేయగా... ఆ వేడిమికి ఆమె శరీరం నలుపెక్కి పోయిందట. అంతట ఆ పరమేశ్వరుడు ఆమెను గంగాజలంతో అభిషేకించగానే తిరిగి గౌర వర్ణాన్ని పొందింది. అలాగే ఈ తల్లినా ఆరాధించే భక్తులు సకల పాపాలు, సకల భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని నమ్మకం.

 

సిద్ధిదాత్రి :– ఈ ఎనిమిది రూపులనూ దాటిన తర్వాత కనిపించే అమ్మవారు సిద్ధిదాత్రి. అంటే సకల సిద్ధులనూ ప్రసాదించే తల్లి అని అర్థం. సిద్ధులంటే కేవలం  ఇహపరమైన సిద్ధులే కాదు... కుండలినిలోని అన్ని ద్వారాలనూ ఛేదించుకుని సాధించే మోక్షాన్ని మించిన పరమసిద్ధి ఏముంటుంది. అందుకు సూచనగానే అమ్మవారు వికసించిన కమలం మీద ఆశీనురాలైనట్లు దర్శనమిస్తుంది.

 

ఈ నవదుర్గలో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన రంగు, మంత్రం, గ్రహం ఉంటాయి. అంత లోతులకి వెళ్లేందుకు సాధ్యం కాకపోతే ఓం దేవీ శైలపుత్రైనమః, ఓం దేవీ బ్రహ్మచారిణైనమః... అంటూ ఆయా దేవతల పేరు మీదుగా వారిని తల్చుకోవచ్చు. లేదా ఈ క్రింది శ్లోకం ద్వారా ఆ నవదుర్గలనూ ఒకేసారి స్మరించవచ్చు..

 

‘ప్రథమం శైల పుత్రీతిచ ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ పంచమా స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ సప్తమా కాళరాత్రీచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చేతి
నవదుర్గా ప్రకీర్తితా’

- నిర్జర.

 


More Dasara - Navaratrulu